gold taken
-
తణుకులో పట్టపగలే చోరీ
తణుకు : స్థానిక బ్యాంకు కాలనీలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లో బీరువాలో దాచుకున్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీనివాస టవర్స్‌లో నివాసం ఉంటున్న రవీంద్రతేజ బాదంపూడి రైల్వే సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య యర్రాయిచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. బుధవారం ఉదయం వారు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం వీరి కుమార్తె స్కూలు నుంచి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. పడకగదిలో బీరువా తెరిచి ఉంది. అందులో సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెవి నరికారు.. మెడ కోశారు
జీలుగుమిల్లి: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దుండగులు తెగబడ్డారు. చెవి దుద్దుల కోసం ఆమె చెవిని కత్తితో కోసేశారు. ముక్కు పుడక కోసం ముక్కును కోస్తుండగా ఆమె పెదవులు తెగిపోయాయి. బంగారు గొలుసు కోసం మెడ నరికారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములగలంపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల తొంట గంగా మహాలక్ష్మి ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త చాలాకాలం క్రితం మరణించాడు. ఆమె కుమారుడు, కుమార్తె వివాహాలు కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. దీంతో మహాలక్ష్మి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి తెగబడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో చెవి దుద్దుల కోసం ఆమె చెవిని, ముక్కు పుడక కోసం పెదవులను, గొలుసు కోసం మెడను కత్తితో కోసేశారు. చెవిదుద్దులు, ముక్కుపుడక రాకపోవడంతో ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఘటనలో వృద్ధురాలి చెయ్యి విరిగిపోయింది. వృద్ధురాలు తేరుకుని నల్లజర్ల మండలం దూబచర్లలో ఉంటున్న కుమారుడికి ఫోన్ చేయడంతో అతడితోపాటు బంధువులు వచ్చి ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై పి.బాలసురేష్ తెలిపారు. దొంగల ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. -
ఈవోఆర్డీ ఇంట్లో చోరీ
ఏలూరు అర్బన్ : నగరంలోని ఒక అపార్ట్మెంటులో చోరీ జరిగింది. ఫ్లాట్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు 17 కాసుల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు ఈవోఆర్డీగా పనిచేస్తున్న ఎం.మురళికృష్ణ, మధులత దంపతులు స్థానిక రామకృష్ణాపురం మినీబైపాస్ రోడ్డులో ఉన్న గీతా అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. మధులత జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం వారిద్దరూ యథావిధిగా ఫ్లాట్‌కు తాళాలు వేసుకుని డ్యూటీకి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి అగంతకులు ఫ్లాట్ తాళాలు పగులగొట్టి బీరువా తెరిచి అందులో ఉన్న 17 కాసుల బంగారు నగలు అపహరించుకుపోయారు, దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ ఎసై ్స ఎం.సాగర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్‌ను రప్పించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.