రెచ్చిపోతున్న చోరులు
ఇంటికి తాళం వేస్తున్నారా.. కాస్త జాగ్రత్తగా ఉండండి..ఎందుకంటే ఇంటికి కన్నాలు వేయడానికి దొంగలు సిద్ధంగా ఉంటున్నారు. బంగారమే టార్గెట్‌గా చేసుకొని ఇళ్లు, దుకాణాలను మాత్రమే కాకుండా ఆలయాలను సైతం వదలడంలేదు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంలో 55 దొంగతనాలు జరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ వరుస దొంగతనాలతో మెదక్ పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
మెదక్, న్యూస్‌లైన్:
తాళం వేస్తే చాలు...కన్నాలు పడుతున్నాయి. బంగారమే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమం లో చివరకు ఆ చోరులు దేవుళ్లను కూడా వదలడం లేదు. వరుస దొంగతనాలతో మెదక్ పట్టణ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. 2013 జనవరి నుండి డిసెంబర్ వరకు పట్టణంలో నెలకు సుమారు 5 చొప్పున ఏడాది కాలంలో 55 దొంగతనాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పోలీసుల రికార్డుల ప్రకారం జరిగిన 55 దొంగతనాల్లో రూ.76 లక్షల, 22వేల 800ల ఆస్తులు చోరికి గురికాగా అందులో 13లక్షల 39వేల 884 విలువ గల ఆస్తులు రికవరీ అయ్యాయి. ముఖ్యంగా బంగారమే లక్ష్యంగా దొంగలు విజృంభిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనే ధ్యేయంగా గత ఏడాది రెండు బంగారు దుకాణాలను టార్గెట్ చేసుకున్నారు. 2013 మార్చి 9న మెదక్ పట్టణంలోని జే.ఎన్.రోడ్డులో గల సాయి తిరుమల బంగారు దుకాణంలో కిలోన్నర బంగా రం, 8కిలోల వెండి, రూ.10లక్షల నగదు దొంగిలించారు. పోలీసు రికార్డుల ప్రకారం వీటి విలువ సుమారు 57లక్షల 50వేలు ఉంది. అలాగే జూలై 18న ఇదే జే.ఎన్.రోడ్డులోని ఎస్వి సిల్క్స్ జ్యూవెల్లరి దుకాణంలో జరిగిన చోరీలో 3కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
అప్పట్లో ఈ చోరీ పట్టణంలో సంచలనం సృష్టించింది. జిల్లా ట్రైనీ ఐపీఎస్ అధికారి సైతం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ క్రమంలో గత ఆగస్టు 15న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీసులు ఈ దొంగతనాలకు సంబంధం ఉన్న కొంతమంది దొంగలను పట్టుకోగా రూ.8లక్షల 16వేల 884ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే పట్టణంలోని ఆటో నగర్లో గల టైర్ల దుకాణంలో 2013 మే20న రాత్రి దొంగలు పడి సుమారు రూ.4లక్షల 50వేల విలువైన టైర్లను ఎత్తుకెళ్లారు. 2013డిసెంబర్28న పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలోంచి బంగారు, వెండి, పంచలోహ విగ్రహాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. 2014 జనవరి 3న రాత్రి మెదక్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో కూడా దొంగలు రెండు తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కాగా సగం దొంగతనాల్లో ఇప్పటి వరకు ఎలాంటి రిక వరీలు జరగలేదు. మెదక్ పట్టణంలో తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు, చోరులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండగ సెలవులు వస్తుండటంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు ఉద్యోగస్తులు భయపడుతున్నారు.
దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు
‘పట్టణంలో దొంగతనాల నివారణ కోసం పకడ్బంది చర్యలు చేపట్టాం. పట్టణంలోని అన్ని కూడళ్లలో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశాం. ప్రతి దేవాలయం వద్ద బీట్బుక్లను పెట్టాం. రాత్రిపూట పోలీస్ గస్తీలను ముమ్మరం చేశాం. పాత కేసుల్లో పరిశోధనను తీవ్రతరం చేశాము. ప్రజలు సహకరిస్తే దొంగతనాలను పూర్తిగా అరికడతాం. ఇతర గ్రామాలకు వెళ్లేముందు ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే మంచిది. అనుమానితులు కనిపిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి.’
- కె.ఎన్. విజయ్‌కుమార్, మెదక్ పట్టణ సీఐ