బంగారు రైలు దొరుకుతుందా?
వాల్ బ్రిచ్: నాజీల బంగారు రైలు కోసం మళ్లీ వేట మొదలైంది. నైరుతి పోలెండ్ లోని ఓ పట్టణంలో భూస్థాపితం అయిందని భావిస్తున్న రైలులో భారీగా బంగారం, వజ్రాలు ఉన్నట్లు ట్రెజర్ హంటర్లు అంటున్నారు. అయితే ఇందుకు శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. దీనిపై ట్రెజర్ హంటర్ల ప్రతినిధి మాట్లాడుతూ.. కచ్చితంగా రైలును గుర్తించి తీరుతామని అన్నారు.
గత ఏడాది ఆగస్టులో పోలెండ్ కు దగ్గరలో నాజీల రైలుకు చెందిన ఆనవాళ్లను భూగర్భ రాడార్ ద్వారా గుర్తించామని ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో ఒక్కసారిగా ట్రెజర్ ట్రైన్ ను గురించిన వార్తలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చాయి. దాదాపు 98 మీటర్ల పొడవు కలిగిన రైలు గుర్తులు భూమికి 26 నుంచి 28 అడుగుల లోతు లోపల ఉన్నట్లు వారు పేర్కొన్నారు.
రైలులోపల ఎక్కువగా ఆయుధాలకు సంబంధించిన వస్తువులు ఉన్నట్లు చెప్పారు. కళాఖండాలు, బంగారు ఆభరణాలు, నాజీలు దోచుకున్న బంగారం తదితరాలతో రైలు నిండిపోయి ఉందని తెలిపారు. ఈ వార్తలపై అధ్యాయనం చేసిన ఏజీహెచ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో అలాంటి ఆనవాళ్లేమీ లేవన్నారు.
అక్కడ సొరంగం ఉండే అవకాశం ఉందని చెప్పారు. రష్యన్ ఆర్మీ నుంచి తప్పించుకునేందుకు నాజీలు అప్పట్లో సొరంగాలను నిర్మించినట్లు చెప్పారు. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా, నాజీల రైలు కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. సొరంగ మార్గాన్ని గుర్తించినా అది తాము సాధించిన విజయమే అవుతుందని వారు అంటున్నారు. సొరంగం లోపల రైలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. వచ్చే గురువారం లోపు రైలు గురించిన రహస్యం బట్టబయలవుతుందని చెప్పారు.