భయం లేదు... లాగించేదాం
కంటోన్మెంట్/శాలిబండ : ‘బర్డ్ ఫ్లూ భయం లేదు.. ఎప్పటిలాగే చికెన్ వంటకాల్ని లాగించేయండి’ అంటూ చికెన్ ప్రియులకు పిలుపునిస్తున్నారు..‘వెన్‌కాబ్’ జనరల్ మేనేజర్ బాలసుబ్రమణ్యం. అంతేకాదు తమ సంస్థ ఆధ్వర్యంలో చికెన్ వంటకాల్ని వండి మరీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్‌లోని సిక్రోడ్లో ‘గోల్డెన్ చికెన్ మార్కెట్’ ఆవరణలో మంగళవారం సాయంత్రం చికెన్ వంటకాల ఉచిత పంపిణీ చేపట్టారు. చికెన్ పకోడీ, చికెన్ 65, లాలీపాప్, డ్రమ్‌స్టిక్స్...
ఇలా ఐదారు రకాల చికెన్ వంటకాల్ని ప్రజలకు ఉచితంగా అందజేశారు. నిర్భయంగా చికెన్ వంటకాల్ని తినాల్సిందిగా ప్రజలకు సూచించారు.
ప్రజల్లో అవగాహన కోసమే...
బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ విక్రయాలు అమాంతం పడిపోయాయని, ప్రస్తుతం ‘ఫ్లూ’ ప్రమాదం లేకున్నా చికెన్ అమ్మకాలు పెరగడం లేదన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించి గతంలో మాదిరిగానే చికెన్‌ను ఆదరించేలా చేయడం కోసమే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్థానిక నాయకులు శ్రీనివాస్, గోల్డెన్ చికెన్ మార్కెట్ ఎండీ అన్వర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బహదూర్‌పురా ఫతేదర్వాజా వద్ద స్నేహ ఫ్రెష్ చికెన్ కంపెనీ చైర్మన్ రాంరెడ్డి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించారు. శాలిబండ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్, ఈ కార్యక్రమంలో పాతబస్తీలోని ఫౌల్ట్రీ యజమానులు, చౌక్ చికెన్ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు బషీర్, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు.