gollapalem
-
రొయ్యో.. అయ్యయ్యో.. భారీగా ధర పతనం!
కాజులూరు(కాకినాడ జిల్లా): రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రొయ్యల సాగు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఏరియేటర్లు పెడుతూ.. అవసరమైన మందులు వాడుతూ రైతులు రొయ్యల సాగును ముందుకు నెట్టుకొస్తున్నారు. ఏదో ఒకవిధంగా కనీసం 30 కౌంట్ వరకూ అయినా రొయ్యలను పెంచితే గత ఏడాది నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వైట్‌స్పాట్, రెడ్గ్రిల్ వంటి వ్యాధులకు గురై చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు 150, 120 100, 90 వంటి తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు ధరను అమాంతం తగ్గించేశాయి. వారం క్రితం 100 కౌంట్ ధర రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.210కి మించి రావడం లేదు. దీనికి తోడు పట్టుబడి పట్టిన రొయ్యలు పీలింగ్, గుళ్లకొట్టులో ఉన్నాయంటూ నాణ్యత లోపం పేరుతో మరికొంత కోత విధిస్తున్నారు. ఎకరం చెరువులో సగటున రెండు టన్నుల దిగుబడి వస్తే కేజీకి రూ.60 చొప్పున రూ.1.20 లక్షల వరకూ రైతు నష్టపోవాల్సి వస్తోంది. తగ్గిపోయిన ధర రూపంలో కష్టార్జితమంతా కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఈక్వెడార్ వంటి దేశాల నుంచి ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూండటంతో ఇక్కడి రొయ్యలకు డిమాండ్ తగ్గి, ధర పడిపోతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదని, వాతావరణ మార్పులతో వ్యాధులు సోకి రొయ్యలు చనిపోతుండటంతో అందరూ ఒకేసారి పట్టుబడి పట్టాల్సి వస్తోందని, ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రావడంతో కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయని ఆక్వా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగే ఆక్వా మార్కెట్‌కు ఆ స్థాయిలో డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులుంటాయని.. అయితే స్థానిక కంపెనీలన్నీ సిండికేటుగా మారి సరుకు ఎక్కువగా వచ్చే సమయానికి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేతలు, మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా పట్టుబడి సమయానికి రొయ్యల ధరలు తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని కోరుతున్నారు. అదును చూసుకుని.. రైతుల నుంచి ఒకేసారి సరకు వస్తుంటే కంపెనీలన్నీ ఏకమై ధర తగ్గించేస్తున్నాయి. వ్యాధుల బారిన పడి చెరువుల్లో రొయ్యలు తేలిపోతుండటంతో తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. రొయ్య కేజీ 150 కౌంట్ కంటే చిన్నదిగా ఉంటే కంపెనీలు కొనటం లేదు. డైలీ మార్కెట్లో కేజీ రూ.50కి అమ్ముకోవాల్సి వస్తోంది. – పిల్లి కృష్ణమూర్తి ఆక్వా రైతు, కుయ్యేరు ఇలాగే ఉంటే సాగు కష్టమే మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. పైగా పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే. – వీరవల్లి గణపతి, ఆక్వా ట్రైనీ టెక్నీషియన్, గొల్లపాలెం -
అందాల దీవికి 'ఆపద'!
సాక్షి, ప్రతినిధి విజయవాడ/ కృత్తివెన్ను: ఆరువేల ఎకరాల పైచిలుకు భూభాగం.. మూడు వైపులా ఉప్పుటేర్లు, ఒకవైపు బంగాళాఖాతం.. నాలుగువైపులా నీటితో సుందరమైన సహజ అందాలకు కొదవేలేదు.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న చినగొల్లపాలెం దీవికి సాగరుని రూపంలో ప్రస్తుతం ఆపద ముంచుకొస్తుంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు సరిహద్దుగా ఉంటూ రెండు జిల్లాల సంస్కృతికి అద్దం పడుతున్న ఈ దీవిపై విశ్లేషణాత్మక కథనం... 1962వ సంవత్సరానికి ముందు వరకు దీవి మూడు వైపులా నీటితో ఒక వైపు భూభాగంతో ద్వీపకల్పంగా ఉండేది. 1962వ సంవత్సరంలో కొల్లేరు పరీవాహక ప్రాంత ముంపు నీరు సముద్రంలో కలిసేందుకు చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మధ్య కాలువ (కొత్తకాలువ) తవ్వారు. దీంతో అప్పటి నుంచి సహజసిద్ధ ద్వీపకల్పం మానవ నిర్మిత దీవిగా మారిపోయింది. నాటినుంచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు దీవికి బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తరువాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరుపై వారధి నిర్మించడంతో చినగొల్లపాలెం దీవి వాసులకు రోడ్డుమార్గం ద్వారా రవాణా సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. ప్రమాదం అంచున దీవి.. ఆరువేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంతో పాటు, పదివేల జనాభా కలిగిన దీవిలో ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది. ప్రస్తుతం దీవిని రెండు వైపులనుంచి సముద్రం పెద్ద ఎత్తున కోతకు గురిచేయడంతో ప్రజల్లో తీవ్ర భయాం దోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే దా దాపు ఎనిమిది వందల ఎకరాల వరకు సరుగు, కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసి కనుమరుగైపోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత నివారణకు పూడికతీత.. ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా విలసిల్లే దీవి మనుగడ ప్రమాదంలో ఉంది. 1986, 2004–06 సంవత్సరాల మధ్య కాలంలోనూ ఇక్కడ పూడిక తీత పనులు చేశారు. అప్పట్లో కొంతమేర కోత ఆగినా..తిరిగి మళ్లీ ఇప్పుడు మరింత వేగంగా కోత కోస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీవి కోత నివారణకు సముద్ర ముఖద్వారాల్లో పూడిక తీయడంతో పాటు శాశ్వత పరిష్కారంగా కోత ప్రదేశంలో రాతి కట్టడం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు పూడిక తీయకపోతే దీవి కనుమరుగే సముద్రం వేగంగా దీవిని కోతకు గురిచే స్తుంది. దీనికి ప్రధాన కారణం దీవికి తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న పాత, కొత్తకాలువలు పూడుకు పోవడమే.వెంటనే సముద్ర ముఖద్వారం వద్ద పూడికను తీయకపోతే పెను ప్రమాదమే. –కొక్కిలిగడ్డ బాపూజీ, మాజీ సర్పంచ్ చినగొల్లపాలెం ఇలాగే కొనసాగితే భారీ నష్టమే గ్రామాన్ని సముద్రం కోతకోస్తూ ఊరివైపు దూసుకొస్తుంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సముద్రంలో కలిసిపోయాయి. కోత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. –మాసాబత్తుల శ్రీనివాసరావు, దీవి పరిరక్షణ అధ్యక్షులు కోత నివారణకు ప్రతిపాదనలు.. చినగొల్లపాలెం దీవి కోత నివారణకు సీ కోస్టల్ ఏరియా (ప్రొటెక్షన్కీ)లో భాగంగా రూ.210 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపాం. దీంతో పాటు కొత్తకాలువ, పాత కాలువల పూడికతీత రెగ్యులేటర్ల నిర్మాణాలకు, పాతకాలువపై రెగ్యులేటర్‌కు రూ.364కోట్లు, కొత్త కాలువపై రెగ్యులేట ర్కోసం రూ.166.35 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. – సుబ్రమణ్యేశ్వరరావు, డ్రైనేజీ డీఈఈ -
గొల్లపాలెంలో భారీ పేలుడు
కంట్రోల్ పాయింట్లో గ్యాస్ లీకు ఆందోళనలో గొల్లపాలెం వాసులు గొల్లపాలెం(మలికిపురం) : గొల్లపాలెం గ్రామంలోని ఓఎన్జీసీ జీసీఎస్ సమీపంలో గ్యాస్ కంట్రోల్ పాయింట్లో ఆదివారం గ్యాస్ లీకైంది. భారీ శబ్ధంతో తొలుత పేలుడు సంభవించడంతో స్థానికంగా నివాసాలు ఉంటున్న ప్రజలు బెంబేలెత్తారు. పేలుడుతో పాటు గ్యాస్ లీకైంది. సుమారు అర గంట పాటు గ్యాస్ లీకైందని స్థానికులు తెలిపారు. జీసీఎస్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా ఈ కంట్రోల్ పాయింట్‌కు గ్యాస్ క్రూడాయిల్ వస్తోంది. అక్కడి నుంచి నగరం జీసీఎస్‌కు వెళుతోంది. పేలుడుతో జీసీఎస్లో గ్యాస్సరఫరా నిలిపి వేశారు. పేలుడు సంభవించిన చోట గ్యాస్ అదుపులోకి వచ్చింది. సాయంత్రం వరకూ గెయిల్ ఉన్నతాధికారులు ఎవరూ ఇక్కడకు రాలేదు. పేలుడుకు కారణాలు తెలియలేదు. మరమ్మతులు కూడా చేయాల్సి ఉంది. -
మూడో రోజూ కొనసాగిన ఆందోళన
గొల్లపాలెం (మలికిపురం) : పలు డిమాండ్లతో మలికిపురం మండలం గొల్లపాలెంలో ఓఎన్జీసీ జీజీఎస్ వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మూడో రోజైన బుధవారం కూడా కొనసాగింది. గ్రామస్తులు అనేక మంది రిలే నిరాహార దీక్షల్లో కూర్చొన్నారు. గ్రామ పెద్దలు గుండుమేను నాగేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నల్లి దాసు, ముస్కూడి ఏసురత్నం, గుండుమేను సూరిబాబు, తోపాటి శ్రీనివాస్, నాగళ్ల సత్యనారాయణ సహా అనేక మంది ఆందోళనలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి హైడ్రామా గొల్లపాలెం జీజీఎస్ వద్ద మంగళవార రాత్రి ఓఎన్జీసీ, అధికారులు హైడ్రామా సృష్టించారు. గ్రామస్తులను భయపెట్టేందుకు యత్నించారు. ఆందోళన వల్ల జీజీఎస్‌లో ఆయిల్ ట్యాంకులు క్రూడాయిల్‌తో నిండిపోయాయని, అవి పేలిపోయే ప్రమాదం ఉందని ఓఎన్జీసీఅధికారులు పోలీసుల ద్వారా గ్రామస్తులకు సమాచారం పంపించారు. వెంటనే ఆందోళన విరమించకుంటే తలెత్తే సంఘటనలకు బాధ్యులను చేస్తూ గ్రామస్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మూడు రోజులుగా ఆందోళన చేస్తుంటే, ఆయిల్ ట్యాంకులు నిండిపోయి పేలిపోతాయా అంటూ మండిపడ్డారు. గతంలో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్ల యజమానులు నెలల తరబడి సరఫరా నిలిపివేస్తే ఎందుకు పేలలేదని ప్రశ్నించారు. గత ఏడాది నగరంలో విస్ఫోటం జరిగి అనేక మంది చనిపోతే నెలకు పైగా ఆయిల్ సరఫరా నిలిచిపోయినప్పడు ఎందుకు పేలిపోలేదని నిలదీశారు. జీజీఎస్‌లో సిబ్బంది వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ప్పుడు, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోను ఆయిల్ సరఫరా నిలిచిపోయినప్పుడు జీజీఎస్‌లో ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు ఎందుకు నిండిపోలేదని ప్రశ్నించారు. తమ గ్రామాభివృద్ధి కోసం ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే, అమాయకులను బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులు, ఓఎన్జీసీ అధికారులు.. రాజమహేంద్రవరంలోని ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. దీంతో గురువారం చర్చలకు వచ్చేందుకు ఓఎన్జీసీఅధికారులు అంగీకరించారు. -
జీజీఎస్ వద్ద కొనసాగుతున్న ఆందోళన
గొల్లపాలెం (మలికిపురం) : గ్రామాభివృద్ధి విషయంలో ఓఎన్జీసీ వైఖరికి నిరసనగా మలికిపురం మండలం గొల్లపాలెంలో గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. జీజీఎస్ ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 25 మంది రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా వందలాది మంది మహిళలు, గ్రామస్తులు శిబిరం కూర్చొన్నారు. కాకినాడ డీఎస్పీ వి.విజయరావు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. జీజీఎస్‌లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఓఎన్జీసీ అధికారుల తరపున గ్రామస్తులతో చర్చించారు. ఆయిల్ సరఫరా నిలిచిపోవడం వల్ల బావులు దెబ్బతినే అవకాశం ఉందని, బావులు మూసుకుపోతే ఒక్కొక్క బావిని మరలా తెరిచేందుకు రూ.కోటికి పైగా ఖర్చవుతుందని ఓఎన్జీసీ అధికారులు ఆందోళన చెందుతున్నట్టు వివరించారు. కొన్ని ట్యాంకులు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు వచ్చి, స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు భీష్మించారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు సెప్టెంబర్ ఒకటో తేదీన వస్తారంటున్నారని చెప్పారు. అప్పటి వరకూ ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామం నుంచి కోట్లాది రూపాయల విలువైన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు తరలించుకు పోతున్న ఓఎన్జీసీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు ఈ ఆందోళన చేపట్టారు. డీఎస్పీ వైఖరితో ఉద్రిక్తత : ఎమ్మెల్యే ఆగ్రహం మలికిపురం : గొల్లపాలెం ఓఎన్జీసీ జీజీఎస్ వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీజీఎస్ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులను బలవంతంగా తొలగించేందుకు కాకినాడ డీఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో పోలీసులు యత్నించారు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు ఫోన్లో తెలిపారు. వెంటనే అక్కడి చేరుకున్న ఎమ్మెల్యే సూర్యారావు డీఎస్పీతో పాటు ఓఎన్జీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తుల పోరాటం చేస్తుంటే, వారి ఆవేదన వినేందుకు ఒక్క ఓఎన్జీసీ అధికారి కూడా రాకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. లాఠీ చార్జీ చేస్తే.. ముందు తనపై చేయాలని చెప్పారు. ఓ కేంద్ర మంత్రి హస్తం? గొల్లపాలెంలో ఉద్రిక్తతకు ఓ కేంద్ర మంత్రి వైఖరి కారణమని తెలుస్తోంది. గొల్లపాలెం జీజీఎస్‌లో ఆయనకు కాంట్రాక్టు ఉందని, ఈ ఆందోళనల వల్ల ఆయన పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్టు తెలిసింది. దీంతో ఆ మంత్రి.. కలెక్టర్, ఎస్పీలకు ఫో¯Œæలో హుకుం జారీచేశారని, దీంతో పోలీసులు, స్థానిక ఓఎన్జీసీ అధికారుల చర్యల వల్ల ఉద్రిక్తత ఏర్పడినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆగ్రహంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు. -
ఓఎన్జీసీ జీసీఎస్ ముట్టడి
గొల్లపాలెంలో సంస్థ కార్యకలాపాల అడ్డగింత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ధర్నా చర్చలు విఫలం, రిలే దీక్షలు ప్రారంభం గొల్లపాలెం (మలికిపురం) : తమ ప్రాంతం నుంచి చమురు నిక్షేపాలను తరలించుకుపోతున్న ఓఎన్జీసీ తమ గ్రామాభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం గొల్లపాలెంలోని జీసీఎస్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుమారు 25 ఏళ్లుగా గ్రామంలో జీసీఎస్ ద్వారా చమురు, సహజవాయువు ఉత్పత్తులను తరలించుకుపోతున్న ఆ సంస్థ.. గ్రామాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కోట్లాది రూపాయల విలువైన ఆయిల్, క్రూడాయిల్‌ను తరలించుకుపోతున్న ఓఎన్జీసీ ఈ గ్రామాన్ని తక్షణమే దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏటా రూ.3 కోట్ల చొప్పున గ్రాంట్ ఇవ్వాలని, గ్రామంలో నిరుద్యోగులకు స్థానిక జీసీఎస్లో 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. కార్పొరేట్ ప్రమాణాలతో గ్రామంలో 20 పడకల ఆస్పత్రిని నెలకొల్పాలని కోరారు. గ్రామంలో పాడైన రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఓఎన్జీసీ అధికారులు.. ఎమ్మెల్యే, ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తుల డిమాండ్లను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళతామని, మూడు రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు వచ్చే వరకూ ఇక్కడే బైఠాయిస్తామని ఆందోళనకారులు భీష్మించారు. గ్రామానికి చెందిన అనేక మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆందోళనకారులతో ధవళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల బీవీ సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల పాల్గొన్నారు. ఈ ఆందోళనతో సోమవారం సుమారు లక్ష లీటర్ల క్రూడాయిల్ సరఫరా నిలిచిపోయింది. ఆందోళన నేపథ్యంలో రాజోలు సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ప్రేమికుడి తల్లిపై దాడి.. ఇంటికి నిప్పు
ఘంటసాల: ప్రేమించుకున్న జంట పోలీసులను ఆశ్రయించారనే ఆగ్రహంతో ప్రియురాలి తండ్రి, బంధువులు కలిసి ప్రియుడి తల్లిపై దాడిచేయడంతో పాటు, వారి ఇంటిపై పెట్రోలుపోసి తగులబెట్టారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం శివారు గొల్లపాలెంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొల్లపాలెం దళితవాడకు చెందిన పెయింటర్ గూడపాటి నాగరాజు, అదే ప్రాంతానికి చెందిన నాయుడుపాటి దీప్తి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను వ్యతిరేకించిన దీప్తి తండ్రి అర్జునరావు ఏడాది కిందట కుటుంబ సభ్యులతో సహా విజయవాడకు మకాం మార్చారు. కుమార్తెకు వివాహ సంబంధాలు చూడటం ముమ్మరం చేయడంతో నాగరాజు, దీప్తి పెళ్లి చేసుకోవాలని భావించి శుక్రవారం రాత్రి చిట్టూర్పులోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం ఘంటసాల పోలీసులను ఆశ్రయించి తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న అర్జునరావు పది మంది అనుచరులు, బంధువులను వెంటపెట్టుకుని గొల్లపాలెం వచ్చారు. వచ్చీ రావడంతోనే నాగరాజు తల్లి సముద్రాలుపై అర్జునరావు, అతని చెల్లెలు సుధ కర్రతో దాడిచేశారు. ఈ దాడిలో సముద్రాలు చెంప నుంచి నోటిలోకి కర్ర దిగబడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. అంతటితో ఆగని అర్జునరావు, అతని అనుచరులు ఆ ప్రాంతంలో వీరంగం చేసి వెంట తీసుకువచ్చిన పెట్రోలును నాగరాజు ఇంటిపై పోసి నిప్పంటించారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన పరిసర ప్రాంతవాసులపై దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సినీఫక్కీలో సుమారు గంటపాటు వీరంగం చేసిన అర్జునరావు, అతని అనుచరులు అనంతరం అక్కడి నుంచి వచ్చిన ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ప్రాణ రక్షణ కల్పించాలి... తామిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఒకే కులమైనప్పటికీ పెద్దలు అంగీకరించకుండా తమపై దాడిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రేమికులు నాగరాజు, దీప్తి పోలీసులకు చెప్పారు. తాము మేజర్లయినందున పెద్దల సమక్షంలో వివాహం జరిపించి, రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు చల్లపల్లి సీఐ దుర్గారావు, ఎస్ఐ టీవీ వెంకటేశ్వరరావు గొల్లపాలెంలోని నాగరాజు ఇంటిని పరిళీలించారు. అనంతరం అవనిగడ్డలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సముద్రాలు నుంచి వివరాలు సేకరించారు. -
గొల్లపాలెంలో కారు, ఆటో ఢీ
గొల్లపాలెం(కాజులూరు),న్యూస్‌లైన్ : కాకినాడ-కోటిపల్లి రహదారిలో కాజులూరు మండలం గొల్లపాలెం మహిమా చర్చి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్యావటానికి చెందిన ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులు కాకినాడ నుంచి ద్రాక్షారామ వెళుతున్నారు. గొల్లపాలెం మహిమా చర్చి సెంటర్ వద్ద కోటిపల్లి నుంచి కాకినాడ వెళుతున్న కారు ఎదురుగా ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బోల్తాపడ్డ ఆటో, కారు ముందుభాగం నుజ్జయ్యాయి. ఆటోలో ఉన్న రాయపాటి సత్యనారాయణ, ఉప్పుమిల్లి వెంకటరావు, శ్రీనివాస్ తీవ్రంగా, మరో ఐదుగురు, కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.