ప్రేమికుడి తల్లిపై దాడి.. ఇంటికి నిప్పు | attack on painter mother in krishna district | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి తల్లిపై దాడి.. ఇంటికి నిప్పు

Published Sun, Apr 13 2014 8:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

ప్రేమికుడి తల్లిపై దాడి.. ఇంటికి నిప్పు

ప్రేమికుడి తల్లిపై దాడి.. ఇంటికి నిప్పు

ఘంటసాల: ప్రేమించుకున్న జంట పోలీసులను ఆశ్రయించారనే ఆగ్రహంతో ప్రియురాలి తండ్రి, బంధువులు కలిసి ప్రియుడి తల్లిపై దాడిచేయడంతో పాటు, వారి ఇంటిపై పెట్రోలుపోసి తగులబెట్టారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం శివారు గొల్లపాలెంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొల్లపాలెం దళితవాడకు చెందిన పెయింటర్ గూడపాటి నాగరాజు, అదే ప్రాంతానికి చెందిన నాయుడుపాటి దీప్తి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమను వ్యతిరేకించిన దీప్తి తండ్రి అర్జునరావు ఏడాది కిందట కుటుంబ సభ్యులతో సహా విజయవాడకు మకాం మార్చారు. కుమార్తెకు వివాహ సంబంధాలు చూడటం ముమ్మరం చేయడంతో నాగరాజు, దీప్తి పెళ్లి చేసుకోవాలని భావించి శుక్రవారం రాత్రి చిట్టూర్పులోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం ఘంటసాల పోలీసులను ఆశ్రయించి తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న అర్జునరావు పది మంది అనుచరులు, బంధువులను వెంటపెట్టుకుని గొల్లపాలెం వచ్చారు.

వచ్చీ రావడంతోనే నాగరాజు తల్లి సముద్రాలుపై అర్జునరావు, అతని చెల్లెలు సుధ కర్రతో దాడిచేశారు. ఈ దాడిలో సముద్రాలు చెంప నుంచి నోటిలోకి కర్ర దిగబడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. అంతటితో ఆగని అర్జునరావు, అతని అనుచరులు ఆ ప్రాంతంలో వీరంగం చేసి వెంట తీసుకువచ్చిన పెట్రోలును నాగరాజు ఇంటిపై పోసి నిప్పంటించారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన పరిసర ప్రాంతవాసులపై దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సినీఫక్కీలో సుమారు గంటపాటు వీరంగం చేసిన అర్జునరావు, అతని అనుచరులు అనంతరం అక్కడి నుంచి వచ్చిన ఆటోలో తిరిగి వెళ్లిపోయారు.
 
ప్రాణ రక్షణ కల్పించాలి...
తామిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఒకే కులమైనప్పటికీ పెద్దలు అంగీకరించకుండా తమపై దాడిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రేమికులు నాగరాజు, దీప్తి పోలీసులకు చెప్పారు. తాము మేజర్లయినందున పెద్దల సమక్షంలో వివాహం జరిపించి, రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు చల్లపల్లి సీఐ దుర్గారావు, ఎస్‌ఐ టీవీ వెంకటేశ్వరరావు గొల్లపాలెంలోని నాగరాజు ఇంటిని పరిళీలించారు. అనంతరం అవనిగడ్డలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సముద్రాలు నుంచి వివరాలు సేకరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement