మూడో రోజూ కొనసాగిన ఆందోళన
మూడో రోజూ కొనసాగిన ఆందోళన
Published Wed, Aug 31 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
గొల్లపాలెం (మలికిపురం) :
పలు డిమాండ్లతో మలికిపురం మండలం గొల్లపాలెంలో ఓఎన్‌జీసీ జీజీఎస్ వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మూడో రోజైన బుధవారం కూడా కొనసాగింది. గ్రామస్తులు అనేక మంది రిలే నిరాహార దీక్షల్లో కూర్చొన్నారు. గ్రామ పెద్దలు గుండుమేను నాగేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నల్లి దాసు, ముస్కూడి ఏసురత్నం, గుండుమేను సూరిబాబు, తోపాటి శ్రీనివాస్, నాగళ్ల సత్యనారాయణ సహా అనేక మంది ఆందోళనలో పాల్గొన్నారు.
మంగళవారం రాత్రి హైడ్రామా
గొల్లపాలెం జీజీఎస్ వద్ద మంగళవార రాత్రి ఓఎన్‌జీసీ, అధికారులు హైడ్రామా సృష్టించారు. గ్రామస్తులను భయపెట్టేందుకు యత్నించారు. ఆందోళన వల్ల జీజీఎస్‌లో ఆయిల్ ట్యాంకులు క్రూడాయిల్‌తో నిండిపోయాయని, అవి పేలిపోయే ప్రమాదం ఉందని ఓఎన్‌జీసీఅధికారులు పోలీసుల ద్వారా గ్రామస్తులకు సమాచారం పంపించారు. వెంటనే ఆందోళన విరమించకుంటే తలెత్తే సంఘటనలకు బాధ్యులను చేస్తూ గ్రామస్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మూడు రోజులుగా ఆందోళన చేస్తుంటే, ఆయిల్ ట్యాంకులు నిండిపోయి పేలిపోతాయా అంటూ మండిపడ్డారు. గతంలో ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకర్ల యజమానులు నెలల తరబడి సరఫరా నిలిపివేస్తే ఎందుకు పేలలేదని ప్రశ్నించారు. గత ఏడాది నగరంలో విస్ఫోటం జరిగి అనేక మంది చనిపోతే నెలకు పైగా ఆయిల్ సరఫరా నిలిచిపోయినప్పడు ఎందుకు పేలిపోలేదని నిలదీశారు. జీజీఎస్‌లో సిబ్బంది వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ప్పుడు, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోను ఆయిల్ సరఫరా నిలిచిపోయినప్పుడు జీజీఎస్‌లో ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు ఎందుకు నిండిపోలేదని ప్రశ్నించారు. తమ గ్రామాభివృద్ధి కోసం ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే, అమాయకులను బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులు, ఓఎన్‌జీసీ అధికారులు.. రాజమహేంద్రవరంలోని ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో గురువారం చర్చలకు వచ్చేందుకు ఓఎన్‌జీసీఅధికారులు అంగీకరించారు.
Advertisement