gollapoodi marutirao
-
నడిచే ఉద్యమం
జీవన కాలమ్ కొందరు పరిమితమైన ఆవరణలో పవిత్రమైన కలువ పువ్వులాగ దర్శనమిస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ మంచితనంతో, సౌహార్దంతో అలంకరిస్తారు. వేళ మించి పోగానే గంభీరంగా శలవు తీసుకుంటారు. ఆ కలువ పువ్వు పేరు- కళ్లు చిదంబరం. కళ్లు చిదంబరానికీ నాకూ బంధుత్వముంది. దాదాపు 34 సంవత్సరాల కిందట- మిత్రు డు రఘు నా కళ్లు నాటికను చిత్రంగా తీయాలని తలపెట్టి నప్పుడు- అందులో భాగమ యిన విశాఖ నటుడు చిదం బరం. చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం. కాని ఆనాడు కళ్లు సినీమాలో నటించి మొదటి చిత్రం లోనే నంది అవార్డ్డుని తీసుకుని ఇంటి పేరుని నా రచన పేరుని చేసుకున్న మంచి నటుడు చిదంబరం. నాలాగే అతనూ విజయనగరంలో పుట్టాడు. అదీ మా బంధు త్వం. విచిత్రమేమిటంటే చిదంబరం పాత్ర నా నాటి కలో లేదు. లేని పాత్రని సృష్టించిన ఘనత రఘుదయితే దానికి ప్రాణం పోసి ఆ పాత్ర కారణంగా తన ఇంటి పేరునే చేసుకున్న ఘనత చిదంబరానిది. అంతేకాదు- ఉత్తరాంధ్ర యాసకు ప్రాచుర్యాన్నీ, ఒక పదునునీ తీసు కొచ్చిన ఘనత చిదంబరానిది. సరిగ్గా 45 సంవత్సరాల కిందట ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో విజయ వాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో కళ్లు నాటికను ప్రదర్శించిన ప్పుడు-పోటీ సమాజాలలోని నటులు- పోటీ ప్రమే యం లేకుండా నన్ను తమ చేతుల మీద ఎత్తుకుని ఊరేగించారు. అలా ఊరేగించిన వారిలో ఎమ్.వి.రఘు, జంధ్యాల వంటి వారెందరో ఉన్నారు. ఓ రచయిత కృషికి అది గొప్ప బహుమతి. తర్వాత సినీమా. చిదంబరం విలక్షణమయిన నటుడు. నార్మన్ విస్డమ్ లాగ అతని ముఖమే పెద్ద కేరికేచర్. కేరికేచర్లో ఒక లాభం ఉంది. ఒక నష్టం ఉంది. ప్రేక్షకులను కొట్ట వచ్చినట్టు ఆకర్షిస్తుంది. (కేరికేచర్‌తో ఒక పాత్రను చిర స్మరణీయం చేసిన సృష్టికర్త కె.వి.రెడ్డి, నటించిన నటుడు రేలంగి. పాత్ర మాయాబజారులో ఉత్తరుడు.) ఆయితే దర్శకుడు దానినే వాడుకుంటే- అదే దృశ్యం ఎప్పుడూ అలాగే కనిపిస్త్తుంది. ఇది మొనాటినీ. చర్విత చర్వణం అయిపోతుంది. ఇది నటుడి పరిణతికి పరిమితమైన ప్రయోజనం. రొటీన్. తెలివయిన నటుడు అర్థం చేసుకుని అధిగమి స్తాడు. ఇది సవాలు. తన నటనా జీవితంలో ఆయా చిత్రాలలో టైప్ కాస్టింగ్ చేసిన ఎన్నో సందర్భాలను అధిగమించి తనదైన ముద్రని వేసుకున్నారు చిదంబరం. చంటి, అమ్మోరు, పెళ్లి పందిరి, గోవింద గోవింద ఇందుకు నిదర్శనాలు. శుభలేఖ సినీమాలో చిదంబరం పెళ్లిచూపు లకు వస్తాడు. మెల్లకన్ను. అతను పక్కన నిలబడిన అత్తగారిని చూస్తున్నాడు- తదేకంగా. పెళ్లి పెద్ద ఇబ్బంది పడిపో యాడు. బాబూ, పెళ్లి కూతురు ఇటువేపు ఉంది బాబూ అన్నాడు చెప్పలేక చెప్పలేక. తండ్రి ఇబ్బందిగా మా వాడు పెళ్లి కూతురునే చూస్త్తున్నాడండీ అన్నాడు. ఈ సీను ఊహిస్తూ ఓ రోజంతా నవ్వుకున్నాం నేనూ, కె.విశ్వనాథ్‌గారూ. తీరా ఈ సీను చిత్రంలో ఉందో లేదో నాకు గుర్తులేదు. కాని మిత్రుడు చిదంబరంతో మాట్లాడి నప్పుడు తరుచు నాకీ సీను గుర్తొస్తుంది. అయితే ఇది కేవలం చిదంబరం వ్యక్తిత్వంలో ఒక పార్శ్వం. గొప్ప ఉద్యమకారుడు. ఎప్పుడూ సాటి నటుల గురించి, తనతో ప్రయాణం చేసే సోదర కళాకా రుల గురించీ తాపత్ర యపడే మనిషి. విశాఖలో సకల కళాకారుల సమాఖ్యని ప్రారంభించాడు. పేద కళాకారు లకు ఆర్థిక సహాయాన్ని అందించాడు. చదువు చెప్పిం చుకోలేని పేద కళాకారుల పిల్లలకు జీతాలు, పుస్తకాలు వంటివి సమకూర్చే ఏర్పాట్లు చేశాడు. అన్నిటికంటే విశేషమైన ఉపకారం- ఈ ప్రాంతంలో ఏ కళాకారుడు కన్నుమూసినా-అంతరాలతో ప్రమేయం లేకుండా వెంటనే సమాఖ్య ఖాతాలోంచి రెండువేల రూపాయలు ఆ కుటుంబానికి చేరుతుంది. చివరి రోజుల్లో ఆరోగ్యం బొత్తిగా చెడింది. పక్కనే ఆక్సిజన్ సిలెండర్ పెట్టుకుని ముక్కుకి గొట్టం పెట్టు కుంటే తప్ప కూర్చోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలోనూ సభ లను నిర్వహించాడు! ఆ మధ్య- విశాఖ కళాకారులకు మాత్రమే సన్ని హితుడైన మరో ఉద్యమకారుడు- అతి మామూలు మనిషి- కష్టంలో కొండంత మనస్సుతో నిలవగలిగిన ఒక వ్యక్తి- మొక్కల మోహన్ కన్నుమూశాడు. మా అందరికీ ఆప్తుడు. చిదంబరం పేరు పేరునా అందరికీ ఫోన్ చేశాడు. నాకయితే అరడజను సార్లు ఫోన్ చేశాడు. అంత నిస్సహాయత లోనూ- వచ్చి సభను నిర్వహించాడు. తాను రాలేని సభలను- రాకపోయినా- నిర్వహించిన సందర్భాలు నాకు తెలుసు. మంచితనం మీదా, స్నేహం మీదా, సౌహార్ద్రం మీదా, పక్కవాడికి చెయ్యగల సహాయం మీదా కొం డంత నమ్మకంగల వ్యక్తి. మొన్న చెన్నైలో ఉన్న నాకు విశాఖ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి కళ్లు చిదంబరం గారు ఆసుపత్రిలో చేరారు అన్నారు. అప్పటి నుంచీ ఆయనకి ఫోన్ చేస్తున్నాను. మధ్యాహ్నానికి వారి అబ్బాయి పలికాడు. నాన్నగారు వెళ్లిపోయారు- అదీ వార్త. కొందరు పరిమితమైన ఆవరణలో పవిత్రమైన కలువపువ్వులాగ దర్శనమిస్తారు. తమచుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ మంచితనంతో, సౌహార్ద్రంతో అలంక రిస్తారు. వేళ మించిపోగానే గంభీరంగా సెలవు తీసుకుం టారు-నిస్సహాయంగా కాదు. తృప్తిగా, హుందాగా, గర్వంగా. కారణం- తమ ఉనికిని, తమ సౌజన్యాన్ని పంచిన ఆవరణ వారి చుట్టూ వెలుగుతూంటుంది. ఆ కలువ పువ్వు పేరు- కళ్లు చిదంబరం. గొల్లపూడి మారుతీరావు -
లెజెండ్ నిష్ర్కమణ
జీవన కాలమ్ ఆమెని ‘లేడీ శివాజీ గణేశన్’ అని గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. 1500 చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి ప్రపంచ చరిత్రను తిరగరాసింది. ‘ఆమె కేవలం నటికాదు. ద్రవిడ ఉద్యమం’ అన్నారు ఆమెతో కలిసి పనిచేసిన కరుణానిధి. ప్రముఖ నటీమణి మనోరమ కన్నుమూసిన వార్త తెలియ గానే మిత్రుడు, దర్శకుడు కోడి రామకృష్ణకి ఫోన్ చేశాను. 1996లో ఒకే ఒక్కసారి మనోరమ నా భార్యగా నటించింది. నిజానికి ఇలా చెప్పడం మర్యా దకాదు. నేను ఆమె భర్తగా నటించాను. సినీమా పేరు ‘లాఠీచార్జ్’. నా కెరీర్లో కనీసం 30 మందికి పైగా నా భార్య పాత్రలో చేశారు. కాని మనోరమ ఎందుకు? కోడి చెప్పాడు. నా పాత్ర గాంధీ అనుయాయుడు. అతని స్పృహ అలనాటి స్వాతంత్య్ర సమరం రోజుల్లోనే నిలిచి పోయింది. ఎప్పుడూ గాంధీ నిన్న మొన్న ఉన్నట్టే మాట్లాడతాడు. కష్టమల్లా తెలిసి తెలిసే ఆ ‘అవాస్తవాన్ని’ నిజమని నమ్మించే, నమ్మించాల్సిన పాత్ర నా భార్య. అదీ మనోరమ. ఇతను ‘గాంధీగారు ఉప్పు సత్యాగ్రహమంటున్నారు. దేశమంతా తరలివస్తోంది. వెళ్లాలి’ అన్నాడనుకోండి. ‘అవునండీ. వెళ్లి తీరాలి. ఆయన వెనుక దేశ ప్రజలంతా ఒకటిగా నిలబడాలి కదా? బయలుదేరండి’ అనే పాత్ర భార్యది. తీరా అవి నీతిమయమయిన ఈ వర్తమాన సమాజంలోకి అతని మెదడు సర్దుకుంటుంది. కాని ఈ సమాజ పతనం అతన్ని హింసిస్తుంది. ఈసారి కోరుకుని అతను గతం లోకి పారిపోతాడు. విశేషమేమిటంటే భార్య అతని ప్పుడు నమ్మే అవాస్తవాన్ని ‘వాస్తవ’మని సమర్థించే పాత్రని మళ్లీ వహిస్తుంది! ఇది చాలా క్లిష్టమయిన పాత్రీ కరణ-నాదీ, మనోరమదీ. ఆశ్చర్యపడేటంత అవలీలగా - అంత గొప్ప టైమింగ్‌తో చేసింది. (కనీసం 50 ఏళ్ల కిందట యూజిన్ అయొనెస్కో ‘ది చైర్స్’ అనే నాటిక స్ఫూర్తితో ‘ కాలం వెనక్కు తిరిగింది’ అనే నాటిక రాశాను. ఎగ్జిస్టెన్సియలిజం దాని మూలసూత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే We are condemned to live. రాజమండ్రి లలిత కళానికేతన్ పోటీలలో ఆ సంవత్సరం ఆ ఒక్క నాటికతోనే పోటీ నిర్వహించారు. కనీసం పది ట్రూపులు నటించాయి. అదొక చరిత్ర.) మనోరమ విలక్షణమయిన నటి. నాకంటే రెండేళ్లు పెద్ద. రాత్రి వేళల్లో షూటింగు పెడితే సాధారణంగా తిడు తూంటాను. అప్పుడు నేను కోడి మీద విసుక్కోలేదు. ఆ మాట తెల్లవారు ఝామున 3 గంటలకి నవ్వుతూ గుర్తు చేశాడు కోడి. ‘కారణం- మనోరమ. నాకంటే సీనియర్ నటిస్తూంటే నేను యాగీ చెయ్యడం తప్పు’ అన్న గుర్తు. 49 సంవత్సరాల కిందట చెన్నైలో ఆమె స్టేజీ నాట కం చూశాను. అంత గొప్ప టైమింగ్ ఉన్న నటి చాలా అరుదు. ఆయా భాషల్లో గొప్ప నటీమణులున్నారు. మన భాషలో సూర్యకాంతమ్మ. కాని మనోరమ ప్రత్యే కత ఏమిటంటే- దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించే పాత్రల్ని చిరస్మరణీయం చేశాక, తర్వాతి తరం దర్శ కులు, రచయితలు ఆమె ప్రతిభను మరో మలుపు తిప్పారు. ‘చిన్న తంబి’ వంటి ఉదాత్తత, సెంటిమెంటు పండించే పాత్రల వెల్లువ ఆమెకు దక్కింది. అంతే. ఆమె కెరీర్ మరో పెద్ద మలుపు తిరిగింది. హాస్య నటి క్యారెక్టర్ నటి అయితే - ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోతుంది. ఎల్లకాలం నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పాత్ర హఠాత్తుగా కంటతడి పెట్టుకుంటే ఆ పాత్ర ఆకాశానికి లేస్తుంది. ఇదొక రేంజ్. హాస్యం పాపులారిటీని ఇస్తుంది. ఆర్ద్రత దానికి పదును పెట్టి మన్నికనిస్తుంది. నవ్వు ఆకాశం. కన్నీరు సముద్రం. హాస్యం సర్వజన సమ్మతం. ఆత్మీ యత- సర్వజన వశీకరణ. మరిచిపోలేని ఎన్నో పాత్ర లకు రెండవ దశలో ప్రాణం పోసింది మనోరమ. అయిదుగురు ముఖ్యమంత్రులతో (అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీ రామారావు) కలసి పని చేసింది. మూడేళ్ల కమల్‌హాసన్‌తో పనిచేసింది. లక్షల హృదయాల్లో తిష్ట వేసుకుంది. ఆమెని ‘లేడీ శివాజీ గణేశన్’ అని గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. 1,500 చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి ప్రపం చ చరిత్రను తిరగరాసింది. ‘ఆమె కేవలం నటికాదు. ద్రవిడ ఉద్యమం’ అన్నారు ఆమెతో కలిసి పనిచేసిన కరుణానిధి. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో ఆమె తమిళ చిలకమ్మ. తమిళ చిత్రం చూసిన వారు ఆమె వీరంగం మరిచిపోలేరు. షావుకారు జానకి తెలుగు పాత్రని అంతే చిరస్మరణీయం చేశారు. హాస్యానికి కన్నీరు జోడయితే తయారయ్యే రసా యనం ప్రపంచ చరిత్రలోనే అనితర సాధ్యం. ఎందరో డానీ కేలు, నార్మన్ విస్డమ్లు, లారెల్ హార్డీలు కనిపి స్తారు. కాని ఈ ఒక్క కారణానికే చార్లీ చాప్లిన్ మకుటా యమా నంగా నిలుస్తారు. నట జీవితంలో ఆ రేంజ్‌ని సాధించిన నటీమణి మనోరమ. మొన్న చెన్నై బీచి వేపు నా కారు వెళ్తూంటే ‘ఇటు వెళ్లడం మంచిది కాదు సార్!’ అన్నాడు డ్రైవర్. ‘ఏం’ అన్నాను. మా ఆవిడ సమాధానం చెప్పింది. అంత్య క్రియలకి మనోరమ పార్థివ దేహాన్ని ఊరేగిస్తున్నారట. దారి పొడుగునా వందల వేల మంది పాకల్లో నివసించే బడుగు వర్గాల మనుషులు బారులు తీరారు. తమ జీవితాల్లోకి - ఒక జీవితకాలం పాటు చిరునవ్వునీ, కన్నీటినీ రంగరించి కల్లాపు జల్లిన ఆ ‘తల్లి’కి కృతజ్ఞతని చెప్పుకోడానికి. ఒక క్యారెక్టరు సినీ నటికి దక్కిన అరుద యిన నివాళి అది. మనోరమ చరిత్ర. చాలా కారణాలకి మళ్లీ మళ్లీ పునరావృతం కాని గొప్ప చరిత్ర. గొల్లపూడి మారుతీరావు