ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
భీమవరం : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణం తక్షణం నిలిపి వేయాలని, అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమవరంలో ప్రభుత్వ, పార్కు యాజమాన్య దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కమిటీ కార్యదర్శి బి.సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును ఆరెంజ్ క్యాటగిరీలో చేర్చామని చుక్కనీరు కూడా గొంతేరు డ్రై యిన్‌లో కలవదని ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభ సందర్భంలో ప్రకటించిన సబ్‌కలెక్టర్ వందల కోట్ల రూపాయల ఖర్చుతో సముద్రంలోకి ప్రత్యేకSపైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఫ్యాక్టరీకి అనుకూలంగా త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫుడ్ పార్కు పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గాదిరాజు వెంకటసుబ్రహ్మణ్యంరాజు, సీపీఐ నాయకుడు మల్లుల సీతారామ్ ప్రసాద్, చేబోలు సత్యనారాయణ, ధనికొండ శ్రీనివాస్, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ పాల్గొన్నారు.