వ్యక్తిపై హత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
వీరపునాయునిపల్లె (వైఎస్సార్ జిల్లా): భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. వివరాలు.. వైఎస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని గోనుమాకులపల్లెకు చెందిన పాల కొండయ్యకు, ఓబుల్‌రెడ్డి పల్లె గ్రామానికి చెందిన లక్ష్మయ్య, నారప్ప, శంకర్లకు భూమి విషయమై గొడవలున్నాయి. ఈ వివాదం కోర్టులో ఉంది.
బుధవారం కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కొండయ్య తన ద్విచక్రవాహనంపై ఉదయం బయలుదేరి వెళ్తుండగా దారిలో కాపుకాచిన ముగ్గురు ప్రత్యర్థులు అతని మెడను కత్తితో కోసి, చనిపోయాడనుకుని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన వారు అతడిని కడప రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.