మంచి దర్శకుడే కాదు... మార్గదర్శకుడు
సందర్భం: నేడు రాజ్‌కుమార్ హిరానీ బర్త్‌డే
2003వ సంవత్సరం భారతీయ సినిమా ప్రేక్షకలోకం ఆర్ద్రతతో హర్షించింది. కళామతల్లిని కనకవర్షంతో అభిషేకించింది. మనసు తడిని చెంప మీద ఆనంద భాష్పాలుగా రాల్చింది. ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’ అనే కొత్త డాక్టరు ఆగమనంతో దశాబ్దాలుగా మూస సినిమాల కథా వస్తువుల్లోని బ్యాక్టీరియాను పోగొట్టి ప్రేక్షకులనూ, పరిశ్రమలోని ఆలోచనాపరుల్నీ ఆరోగ్యంతో ఉత్తేజితుల్ని చేసింది.
ఇన్ని అద్భుతాలకు మూలకారకుడు భూమ్మీద పడింది 1962 నవంబర్ 22న. ప్రేక్షకలోకాన్నీ, నాతిగా భావించి ముచ్చటగా మూడు ముళ్లేశాడు ఈ దర్శకుడు - రాజ్‌కుమార్ హిరానీ. ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్’ - ఈ మూడు ముళ్లు వేసి ‘నాతి చరామి’ అన్నాడీయన.
ప్రేక్షక లోకంలో ఏడు జన్మల అనుబంధం పెనవేసుకున్నాడు. ఈ మూడు చిత్రాల్లో... సాధారణ చలన చిత్రాల్లో లోపించిన, మరుగున పడిన మానవ ‘ధర్మం’ ఉంది. మనుషులు మర్చిపోయిన మానవత్వపు విలువలను ఆచరించాలన్న ‘కామం’ (కోరిక) ఉంది. నిర్మాత విధూ వినోద్ చోప్రాకు ప్రేక్షకులిచ్చిన ‘అర్థం’ (ధనం) భారీగా ఉంది. ‘ఇలాంటి సినిమాల్రా మాక్కావాలి’ అనిపించేలా శాటిస్ఫ్యాక్షన్ ప్రేక్షకుడికి - ‘మోక్షం’గా లభించింది. దటీజ్ రాజ్‌కుమార్ హిరానీ.
చాలా పెద్ద సమస్యల్ని చిరునవ్వు నవ్వేలా తేలికగా ప్రస్తావించడం, జీవితాన్ని కాంప్లికేట్ కాకుండా ఎలా చూసుకోవాలో చిన్న చిన్న పరిష్కార మార్గాలు చూపడం, ప్రేమను శరీరం మీద కాకుండా మనసులతో చూపడం, అన్ని కళాత్మక భావాలనీ కమర్షియల్‌గా కళ్ల ముందు ఆవిష్కరించడం - నిజంగా సినిమా చూడడం వచ్చిన వాడికి ఇంతకంటే నచ్చే విషయం మరొకటి ఉండదు.
‘ఖల్నాయక్’ వేషధారిని ‘మున్నాభాయ్’గా మెప్పించడం ఓ సాహసం. ‘జాదూ కీ జప్పీ’ (కౌగిలి మంత్రం) సినిమాకే కాదు ఆత్మీయతలు కొరవడిన ఆధునిక సమాజానికీ ఓ అవసరం. సీక్వెల్ కథలు హిట్ అవ్వడమే చాలా అరుదైన రోజుల్లో ‘లగేరహో మున్నాభాయ్’ సినిమా తీయడం ఇంకో పెద్ద సాహసం.
అహింస, సత్యం అనే ఆయుధాలతో భారతావనికి స్వాతంత్య్రం సాధించిన గాంధీ మహాత్ముని ఆశయాలనూ, ఆలోచనలనూ ఇవాళ్టి సమాజంలో ఎలా ఆచరణలో పెట్టచ్చో చూపించిన చిత్రం - ‘లగేరహో...’. ‘గూండా గిరీ’కి వ్యతిరేకంగా ‘గాంధీగిరి’ని ప్రేరేపించడం దర్శకునిలోని ఎవరెస్ట్ అంత ఎత్తై వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం. రాంచోడ్ పాత్రతో ‘త్రీ ఇడియట్స్’లో విద్యావ్యవస్థలో వ్యక్తిత్వ వికాసం ఎంత అవసరమో చూపించిన తీరు అద్భుతం. కొంతమంది మేధావులైన దర్శకులు సమస్యల్ని వెండితెర మీద ప్రతిబింబిస్తారు. అవార్డు సినిమాలగానో, ఆర్ట్ సినిమాలగానో పేరు పొంది, మంచి దర్శకులవుతారు. రాజ్‌కుమార్ హిరానీ మాత్రం సమస్యలకు పరిష్కారాన్ని చూపాడు. జనామోదం పొంది, కమర్షియల్గానూ సక్సెస్ అయ్యాడు. మంచి దర్శకుడేకాదు, మార్గదర్శకుడు కూడా అయ్యాడు.
ఈ తరం యువతరానికి రాజ్‌కుమార్ హిరానీ సినిమాల సారాంశాలు, కథాంశాలు... పాఠ్యాంశాలు. 2014లో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాను... కొత్తగా రాయాలంటే రాజ్‌కుమార్ హిరానీ స్క్రిప్టులు అన్నీ కలిపి రాసేసుకోవడమే. ఆయన సినిమా ఒక ‘చికెన్ సూప్ ఫర్ ద సోల్’! ఒక ‘సీక్రెట్’! మానవ జీవన పోరాటంలో శిథిలమైపోతున్న నైతిక విలువలనూ, మానవీయ దృక్పథాన్నీ, ఆత్మీయతనూ, సరళమైన మృదుభాషణనూ, ఆలింగనాన్నీ, ఓదార్పునూ, నవ్వునూ, కన్నీటినీ - అన్నిటినీ స్పృశించి మనలో వాటికి మళ్లీ జీవం తొడుగుతున్న వెండితెర బ్రహ్మ - రాజ్‌కుమార్ హిరానీ. ‘పీకే’తో ఆయనతో నాలుగో అడుగు వేయడం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అఖిల భారత సినీ ప్రేక్షకులలో నేనొకడిని! ఆయనకు మనందరి తరపునా ‘శతమానం భవతి’.
జన్మదిన శుభాకాంక్షలతో...