రజనీకుమార్ మోడి అనుమానాస్పద మృతి
మృతుడు గెలాక్సి గుడ్‌షెప్పర్డ్ స్కూల్ అధినేత
కల్లూరు: కర్నూలు నగరంలోని గెలాక్సి గుడ్‌షెప్పర్డ్ స్కూల్ అధినేత, ఆదర్శ విద్యా సంస్థల అధినేత తిమ్మయ్య అల్లుడు రజనీకుమార్ మోడి(48) కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మరణించారు. శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం పడి ఉన్న విషయాన్ని గ్రామస్తులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
మృతుడిని రజనీకుమార్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అయితే రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎవరూ రాకపోవడం గమనార్హం. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఏడేళ్లుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ నగరంలోనే జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తన సొంత ఫోర్డ్‌ఫిగో కారులో కోడుమూరు మండలం గోరంట్లలో జరిగే తిరుణాలకు వెళ్లి కర్నూలుకు తిరుగు ప్రయాణమైనట్లు తెలిసింది.
ఆత్మహత్యా.. హత్యా!
రజనీకుమార్ మృతి అనుమానాస్పదంగా మారింది. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. హత్య చేశారనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పెద్దటేకూరు గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్దకు ఒక తెల్లని కారు రావడాన్ని సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న రైతులు గుర్తించారు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను పలుకరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ ముగ్గురూ రైతులను బెదిరించి పంపినట్లు సమాచారం.
తెల్లవారే సరికి రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండటంతో ఆ ముగ్గురే హత్య చేసి ఉంటారనే చర్చ గ్రామస్తుల్లో జరుగుతోంది. మృతుని శరీర అవయవాలు చెల్లాచెదురు కావడంతో పాటు.. చేతులు, తలకాయ ఘటనా స్థలంలో లభించలేదు. ఘటనా స్థలానికి సమీపంలోని ఓ ఇంటి వద్ద లభించిన చేతికి రెండు బంగారు ఉంగరాలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి వచ్చిన కారు అక్కడ లేకపోవడంతో రజనీకుమార్ హత్యకు గురై ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది.