నేను మంచి భార్యను అవుతాను!
హాట్ గాళ్ బిపాసా బసు యాక్ట్ చేయడం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు పదిహేనేళ్లయ్యింది. అయినా, ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వచ్చినట్లనిపిస్తోందంటున్నారు బిప్స్. ఇంకా తన కెరీర్లో చేయాల్సిన పాత్రలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారామె. ఒకవేళ రిటైర్ అవ్వాల్సి వస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్న బిపాసా ముందుంచితే -‘‘కలలో కూడా ఆ ఊహ రానివ్వను. ఎంతో కష్టపడి పైకొచ్చాను. చాలామంది అభిమానులను సంపాదించుకున్నాను.
ఇండస్ట్రీలోనూ నన్ను అభిమానించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రేమాభిమానాలకు దూరం కాలేను. నటన అనేది ఓ వ్యసనంలాంటిది. దానికి నేను పూర్తిగా బానిసయ్యాను. భవిష్యత్తులో ఒకవేళ సినిమాలకు దూరం కావల్సి వస్తే... నేను తట్టుకోలేనేమో. ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. నా జీవితాంతం సినిమాల్లోనే ఉండాలన్నది నా కోరిక’’ అన్నారు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానంగా -‘‘తెలియదు. ఈ ప్రశ్న విన్నప్పుడల్లా నేను ఒత్తిడికి గురవుతుంటాను.
కానీ, ఏదో రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే, నేను మంచి భార్యని అవుతానని నా నమ్మకం. నాకు ఇద్దరు బిడ్డలు ఉండాలని మా అమ్మ కోరిక. ఓ మంచి తల్లికి కావాల్సిన లక్షణాలన్నీ నాలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా. అమ్మనవుతా. ఇది కనుక మా అమ్మ చదివితే చాలా ఆనందపడిపోతుంది. ఎందుకంటే, నా పెళ్లి కోసం ఆమె ఎన్నో కలలు కంటోంది’’ అని చెప్పారు బిపాసా బసు.