షార్ట్ సర్క్యూట్‌తో వస్తువుల దగ్ధం
కొండపాక /నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జిల్లాలో ఆదివారం రెండు చోట్ల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్రామంలోని ఒక ట్రాన్స్ఫార్మర్ మీదగా వెళ్లిన వైర్లు కాలి ఒకదానికి ఒకటి అతుక్కుపోయి షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీనికి కారణంగా స్థానిక ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్)లో కంప్యూటర్, ప్రింటర్, కౌంటింగ్ మిషన్ల తగలబడుతుండడంతో బయటికి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి.
ఆదివారం సెలవు కావడంతో ఇరుగురు పొరుగువారు గమనించి బ్యాంక్ వాచ్‌మన్ జలీల్‌ను సమాచారం అందించారు. ఆయన వచ్చి తాళాలు తీసి స్థానికుల సాయంతో మంటలను ఆర్పేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు బ్యాంక్ మేనేజర్ ఉదయ్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్‌లు బ్యాంక్‌కు చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
అదేవిధంగా కుకునూర్‌పల్లి పీహెచ్‌సీతో సహా కొన్ని ఇళ్లల్లో మీటర్‌తో పాటు వైర్లు కాలి బూడిదయ్యాయి. గ్రామంలో మొత్తం 20 టీవీల వరకు కాలిపోయినట్లు సర్పంచ్ ఐలంయాదవ్ తెలిపారు. ఈ సంఘటనపై బ్యాంక్ అధికారులు కుకునూర్‌పల్లి స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్టు ఎస్ఐ యాదిరెడ్డి తెలిపారు.
రాంచంద్రాపూర్‌లో.. షార్ట్ సర్క్యూట్ కారణంగా నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన కుమార్ ఇంట్లో ఆదివారం టీవీ, సెల్‌ఫోన్‌కు సంబంధించిన చార్జీలు కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఏడాది కాలంగా గ్రామంలో తరుచూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నట్లు తెలిపారు. ఇళ్లలో స్విచ్ ఆఫ్ చేసినా కరెంట్ సరఫరా అవుతోందన్నారు. దీని కారణంగా నష్టం వాటిళ్లుతున్నటుల బాధితుడు తెలిపారు.