నకిలీ డాక్టర్‌పై గూండా చట్టం
చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నైలో నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతూ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించిన కేసులో ఇటీవల అరెస్టయిన ఆనందకుమార్పై గూండా చట్టం మోపారు. ఆనంద్ కుమార్ విజయవాడకు చెందిన వ్యక్తి. ఏడాది పాటు అమలయ్యేలా ఈ చట్టాన్ని ప్రయోగించినట్లు నగర కమిషనర్ జార్జ్ శుక్రవారం తెలిపారు. చెన్నై కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి తనతో సహా మరికొంత మంది దగ్గర ఆనందకుమార్, అతని భార్య నిర్మల రూ.33.65 లక్షలు తీసుకుని మోసగించారని అంబత్తూరుకు చెందిన కామరాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దంపతులను గత నెల 23వ తేదీన అరెస్ట్ చేశారు.
ఆనందకుమార్ గుంటూరు వైద్య కళాశాలలో 2007-08 సంవత్సరంలో మాత్రమే వైద్యవిద్య చదివి, తర్వాత మానేశాడు. నర్సింగ్ పూర్తి చేసిన భార్య నిర్మల సహా 2009లో చెన్నై విరుగంబాకం చేరుకుని డాక్టర్ అవతారం ఎత్తాడు. భార్య నిర్మల సైతం నకిలీ సర్టిఫికెట్తో నర్సింగ్ స్కూల్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దంపతులు ప్రస్తుతం చెన్నై పుళల్ జైలులో ఉన్నారు. ప్రాథమిక విచారణలో ఆనందకుమార్ పలు మోసాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాదిపాటు గూండా చట్టం అమలు చేసినట్లు కమిషర్ తెలిపారు.