కర్ణాటక డీజీపీ రేస్‌లో గుత్తి వాసి
గుత్తి రూరల్ : కర్ణాటక రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) రేసులో గుత్తికి చెందిన మలగవేలి నారాయణరెడ్డి (ఎంఎన్‌రెడ్డి) ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర కమాండెంట్ జనరల్, హోమ్గార్డ్స్, సివిల్ డిఫెన్స్, ఫైర్ ఎమర్జెన్సీ (ఎస్డీఆర్ఎఫ్) డైరెక్టర్‌గా ఉన్నారు. గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డుకు చెందిన దివంగత ఎం.రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు ఎంఎన్‌రెడ్డి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ గుత్తి ఏడో వార్డులోని ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి పది వరకు గుత్తి ఎంఎస్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ కర్నూలు, డిగ్రీ హైదరాబాదులో చదివారు.
1984 కర్ణాటక రాష్ట్ర బ్యాచ్‌కు ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ అదే రాష్ట్రంలోని మైసూర్లో అడిషనల్ ఎస్పీగా లభించింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి పంపిన డీజీపీ ఎంపిక జాబితాలో ఎంఎన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ రాష్ట్రానికే చెందిన మహిళా ఐపీఎస్ నీలమణి రాజుతో ఆయన డీజీపీ పోస్టు కోసం పోటీపడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి కర్ణాటక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్ర డీజీపీ రేసులో ‘అనంత’ వాసి ఉండడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.