కుక్కలొచ్చాయి జాగ్రత్త!
రుద్రవరం, న్యూస్‌లైన్: నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. దీంతో స్మగ్లర్లలో వణుకు పుడుతోంది. రుద్రవరం రేంజ్ పరిధిలోని ఆర్. నాగులవరం, రుద్రవరం తదితర గ్రామాల్లో ఎర్రచందనం స్మగర్లు దుంగలను నిల్వ ఉంచి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం అటవీ అధికారి రాంసింగ్, పోలీసు అధికారి శ్రీకాంతరెడ్డి డాగ్ స్క్వాడ్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాంసింగ్ మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని చాలా గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టగలిగామన్నారు.
ఆర్ నాగులవరం, టి లింగందిన్నె, తిప్పారెడ్డి పల్లె గ్రామాల్లో స్మగర్లు ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని అక్రమ రవాణాను అడ్డు కోవడానికి పోలీసుల సహకారం కోసం జిల్లా ఎస్పీ రఘురామి రెడ్డిని కోరామన్నారు. స్పందించిన ఆయన జిల్లా పోలీసు అధికారి పోలీసు బలగాలతోపాటు డాగ్ స్క్వాడ్‌ను పంపించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరొందిన ఆర్. నాగులవరం గ్రామాన్ని మొదట ఎన్నుకుని దాడులు నిర్వహించామన్నారు. అలాగే రుద్రవరం గ్రామంలోని బెస్తకాలనీలో సోదాలు నిర్వహించామన్నారు. ఇప్పటి నుంచి డాగ్ స్క్వాడ్ సిబ్బంది రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయంలో ఉంటుందని రాత్రి సమయంలో దాడులు చేస్తామన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారి జాకీర్ ఉశేన్, బీటు అధికారి రామకృష్ణలతోపాటు డాగ్ స్క్వాడ్, పోలీసు, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.