Gosanraksana
-
మధ్యప్రదేశ్‌లో ఆవుల కోసం మంత్రిత్వ శాఖ
ఛత్తర్పూర్: మధ్యప్రదేశ్ కేబినెట్లో త్వరలోనే ఆవుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం వెల్లడించారు. ‘ప్రస్తుతమున్న గో పాలన, పశుసంవర్ధక బోర్డు చాలా పరిమితుల్లో పనిచేయాల్సి వస్తోంది. అందుకే దీని స్థానంలో గో మంత్రిత్వ శాఖను త్వరలోనే ప్రవేశపెడతాం’ అని ఖజురహోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన స్పష్టం చేశారు. ఆవుల సంరక్షణ, గోవుకు సంబంధించిన ఇతర అంశాలపై ఈ శాఖ పనిచేస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో.. దేశంలోనే ఆవులకోసం ఉద్దేశించిన తొలి సంరక్షణ కేంద్రాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎవరు పశువులు!?
మీలో ఎవరైనా చేయరాని పని చేస్తే పశువులా ప్రవర్తించావంటారు.. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే దున్నపోతులా ఉన్నావని తిట్టిపోస్తారు.. చెప్పింది అర్ధం చేసుకోకపోతే ఎద్దులా తలూపుతున్నావని ఎద్దేవా చేస్తారు.. తెలివైన ఓ మనిషీ మాకో సందేహం.. నిబంధనల్ని తుంగలో తొక్కి మమ్మల్నిలా లారీలో కుక్కి కుక్కి అంబా.. అని అరిచినా ఆలకించకుండా వధశాలకు పంపుతున్నారే.. మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి !? వన్‌టౌన్ : అక్రమంగా కబేళాకు తరలిస్తున్న 50 పశువులను విజయవాడ గోసంరక్షణ దళ్ పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ర్టంలోని మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్కు రెండు కంటెయినర్ లారీల్లో 50 ఎద్దులను తరలిస్తున్నారు. లారీలు అశోక్‌పిల్లర్ వద్దకు రాగానే గోసంరక్షణ దళ్ అధ్యక్షుడు ప్రదీప్సింగ్రాజపురోహిత్ ఆధ్వర్యంలో పలువురు వాహనాలను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. వాహనాలను పోలీసుస్టేషన్ తరలించి లారీ డ్రైవర్లు షోకాత్, మంటాఖాన్లను అరెస్ట్ చేశారు. జహీరాబాద్‌కు చెందిన అస్లాం వీటిని కృష్ణాజిల్లా హనుమాన్‌జంక్షన్‌లో విక్రయించేందుకు పంపినట్లు డ్రైవర్లు తెలిపారు. కంటెయినర్లో కిక్కిరిసి నింపడంతో వీటిలో రెండు గాయాలపాలై మరణించినట్లు గుర్తించారు. అనంతరం పశువులను గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఎర్రబాలెంలోని గోసంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.