హ్యాపీగా... గాసిప్ డేస్!
కాలేజీ లైఫ్... సరదాలు... షికార్లు... కబుర్లు...
ఆటపట్టించుకోవడాలు...పేమలో పడటం... పార్క్‌లకి వెళ్లడం...
లెక్చరర్స్‌లో కొందరంటే ఇష్టపడడం... కొందరిని చూసి భయపడటం...
క్యాంటీన్లో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకోవడం...
‘స్టూడెంట్ లైఫ్ చాలా జాలీ, రమ్మన్నా రాదండి మళ్లీ’
అన్న సినీ రచయిత మాటలు అక్షరసత్యం... అని చూపాడు కొత్తగూడానికి చెందిన సాగర్ వి.ఎస్. అనే దర్శకుడు ‘గాసిప్’ లఘుచిత్రం ద్వారా...
డెరైక్టర్స్ వాయిస్: నేను ఎంబిఏ, ఎం.ఫిల్ చేశాను. ఇప్పటివరకు హ్యాపీ బర్త్‌డే, గాసిప్... అనే రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ప్రస్తుతం ‘కార్తికేయ’ అనే దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నాను. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రైటర్‌గా తెలుగు, ఇంగ్లీషు చలనచిత్ర పరిశ్రమలలో చేస్తున్నాను. ‘గాసిప్’ చిత్రాన్ని ఐదు రోజులలో పూర్తి చేశాను. ఈ చిత్రానికి 60,000 రూపాయలు ఖర్చయ్యింది. ఇందులో నటించినవారిలో కొందరు ప్రొఫెషనల్స్, కొందరు టీవీ యాంకర్లు ఉన్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో తమ్మారెడ్డి భరద్వాజ, రఘుకుంచె, సినీ క్రిటిక్ జీవీ... వంటి ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించాను. రావిశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, తిలక్, పానుగంటి... వీరి రచనలు ఎక్కువగా చదువుతాను. హృదయానికి హత్తుకునే కుటుంబ కథా చిత్రాలు తీయాలనేది నా కోరిక. అలాగే మానవ విలువలతో కూడిన చిత్రాలు కూడా తీయాలనుకుంటున్నాను. ఎప్పటికైనా మంచి దర్శకుడిగా నిలబడాలన్నదే నా లక్ష్యం.
షార్ట్‌స్టోరీ: కాలేజీ విద్యార్థులు క్యాంటీన్‌కి వెళ్లినప్పుడు, పార్క్‌కి వెళ్లినప్పుడు, ఎక్కడ కలిసినా ఏవో కబుర్లు ఉంటాయి. వారు ఎలా మాట్లాడుకుంటారో, ఏ విధంగా ప్రవర్తిస్తారో చూపడమే ఈ కథ.
కామెంట్: ‘దేర్ ఆర్ నో జనరేషన్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ ఓన్లీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని ట్యాగ్‌లైన్ పెట్టడంలోనే దర్శకుడి ఆలోచన విధానం కనపడుతుంది. మంచి దార్శనికత ఉన్న దర్శకుడు. స్క్రీన్‌ప్లే చక్కగా ఉంది. బ్యాక్ స్కోర్లోవచ్చిన వాయిస్ బావుంది. ప్రతి ఆర్టిస్ట్‌ని ఎంతో అందంగా చూపాడు. మంచి మేక ప్ ఉంది. నటీనటులు బాగా నటించారు. కాలేజీ లైఫ్, వాతావరణం చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా ఇందులో నటించిన వారంతా చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. లఘుచిత్రంలా కాకుండా, చలనచిత్రం స్థాయిలో తీశాడు. ఇందులో ఇంగ్లీషు ప్రయోగం తగ్గించి, తెలుగు ఉపయోగించి ఉంటే కృత్రిమత్వం ఉండేది కాదు. ‘ఏరా, ఏమే’ అనే సంప్రదాయానికి స్వస్తి పలికితే బాగుంటుంది. కథనంలో కొంచెం స్పీడ్ ఉండాలి. హ్యాపీడేస్ టేకి ంగ్ లా ఉంది. ఏది ఏమైనా లఘుచిత్రానికి చలనచిత్ర స్థాయి తీసుకు వచ్చిన సాగర్‌కి ఆల్ ద బెస్ట్.