రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ముందు వెళుతున్న లారీని ఢీకొన్న వ్యాన్
డ్రైవర్, క్లీనర్ మృతి
గట్టుభీమవరం వద్ద దుర్ఘటన
మృతులు మెదక్ జిల్లా వాసులు
గట్టుభీమవరం(వత్సవాయి) : విధి నిర్వహణలో భాగంగా డీసీఎం వ్యాన్‌లో దూరప్రాంతం నుంచి వచ్చిన డ్రైవర్, క్లీనర్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై గట్టుభీమవరం పరిధిలోని కొంగరమల్లయ్య గుట్టవద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు చెందిన డ్రైవర్ చాకలి గోవర్థన్, క్లీనర్ యేలేష్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం వ్యాన్‌లో విజయవాడ వచ్చారు. అక్కడ సిలిండర్లను నింపుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
కొంగరమల్లయ్య గుట్ట వద్ద ముందు వెళుతున్న లారీని వీరి వాహనం అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ కేబిన్ నుజ్జునుజ్జవగా, గోవర్థన్, యేలేష్ లోపల ఇరుక్కుని అక్కడికక్కడే మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న వత్సవాయి పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. క్రేన్‌ను రప్పించి, గంటసేపు శ్రమించి మృతదేహాలను వెలికి తీయించారు.
మృతుల వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. జగ్గయ్యపేట సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదవగా, ఎస్సై ఆర్.ప్రసాదరావు దర్యాప్తు చేస్తున్నారు.