రాజ్‌భవన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, న్యూస్‌లైన్: గవర్నర్ నివాసం రాజ్‌భవన్ ముందు శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుని ఆత్మహత్యాయత్న ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన పవన్ కుమార్ పురుగుల మందు తాగి వచ్చి నోటి నుంచి నురగలు కక్కుకుంటూ రాజ్‌భవన్ వద్ద కింద పడిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా సిబ్బంది ఇది గమనించి పవన్‌కుమార్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు సూసైడ్ నోట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా వీరపునాయినిపల్లె మండలం కొమ్మర్ది గ్రామానికి చెందిన దొంతు పవన్‌కుమార్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల పక్క గ్రామమైన రుషిరెడ్డిపల్లెకు చెందిన లింగిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, గజ్జల సురేష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, వై.గంగిరెడ్డిలు పవన్‌కుమార్ ఇంటి తలుపులు బద్దలు గొట్టి లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ. 34 వేల నగదు, టీవీ, డీవీడీ ప్లేయర్ తదితర సామగ్రిని దోచుకెళ్లారు.
ఇదే విషయమై స్థానిక యర్రగుంట్ల ఇన్స్పెక్టర్ రామకృష్ణుడుకు ఫిర్యాదు చేసినా తిరిగి తననే చిత్రహింసలకు గురి చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని పవన్‌కుమార్ తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలను ఇన్స్పెక్టర్కు ఇచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనని చితకబాదారని వాపోయాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు విన్నవించేందుకు వస్తే పోలీసులు అనుమతించడం లేదని, అందుకే తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పంజగుట్ట పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.