ఇది ముమ్మాటికీ బినామీ పిల్.. ఆధారాలతో సహా..
సాక్షి, అమరావతి : ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తమ బినామీలతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయిస్తున్న నేపథ్యంలో, అలాంటి బినామీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలతో హైకోర్టు ముందుంచింది. ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం ఫొటోల సైజుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ పిల్ దాఖలు చేసిన కిలారి నాగశ్రవణ్‌కు టీడీపీకి, ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన అన్ని ఫొటోలను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. టీడీపీ, ఆ పార్టీ నేతలతో తనకున్న సాన్నిహిత్యం గురించి పిటిషనర్ ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టారని, ఈ ఒక్క కారణంతో ఈ వ్యాజ్యాన్ని కొట్టేయొచ్చని వివరించింది. (ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం: ఆ పిల్‌ను కొట్టేయండి )
►ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటోను చాలా పెద్దదిగా వాడడంతో పాటు, ప్రకటనల జారీలో పత్రికల పట్ల వివక్ష చూపుతున్నారంటూ కిలారి నాగ శ్రవణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సీజే జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం ముందు గురువారం విచారణకు వచ్చింది.
►ఈ వ్యాజ్యం విచారణార్హతపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ అర్హతపై ప్రాథమిక కౌంటర్ దాఖలు చేయడానికి న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో ప్రభుత్వం తరఫున సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ హైకోర్టులో ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు అండ్ కోతో సన్నిహిత సంబంధాలు
►నాగశ్రవణ్ యువగళం పేరుతో ఓ సంస్థను స్థాపించారు, ఈ సంస్థకు పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు రాజకీయ సలహాదారుగా ఉన్నారు. టీడీపీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు నాగ శ్రవణ్‌కు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఎంపీ రామ్మోహన్నాయుడు అవకాశం కల్పించారు.
►టీడీపీ రాజకీయ కార్యకలాపాల్లో పిటిషనర్ చాలా క్రియాశీలకంగా ఉన్నారు. టీడీపీ తరఫున డిజిటల్ మహానాడును నిర్వహించే బాధ్యతను ఇతనికే ఇచ్చారు. పిటిషనర్ ఈ విషయాలన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టారు.
►ఓ పత్రిక తరఫున పిల్ దాఖలు చేయడమే కాకుండా, ముఖ్యమంత్రిపై అవాస్తవ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అజెండాతో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఇలాంటి వ్యాజ్యాలను ప్రాథమిక దశలోనే అణిచి వేయాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది.
ఆయన ప్రజా స్పృహ ఏపాటిదో అర్థమవుతోంది
►నాగ శ్రవణ్ దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుంది. సానుకూల ఉత్తర్వులు పొందేందుకు కోర్టును ఇలా తప్పుదోవ పట్టించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది.
►హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి కొద్ది రోజుల ముందు పిటిషనర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాజ్యంలోని అంశాల గురించి ప్రస్తావించారు. ముందు తమ అనుకూల మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించి, తర్వాత అదే అంశంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడాన్ని టీడీపీ నేతలు ఓ ప్రామాణిక విధానంగా మార్చుకున్నారు.
►ఇదే విధానంలోనే ఇప్పటికే ప్రభుత్వంపై హైకోర్టులో అనేక వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రజా స్పృహ ఉన్న వ్యక్తిగా చెప్పుకున్న పిటిషనర్, తన వ్యాజ్యంలో ఆంధ్రజ్యోతిని ప్రతివాదిగా చేర్చలేదు. దీనిని బట్టి అతనికున్న ప్రజా స్పృహ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
►ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కేవలం టీడీపీ, ఓ పత్రిక వ్యాపారం కోసం బినామీ ప్రయోజన వ్యాజ్యంగా (బిల్) మార్చేశారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలి.