సేవలు నిల్
విభజన బిజీలో ప్రభుత్వ శాఖల అధికారులు
నివేదికల తయారీలో నిమగ్నం
వచ్చే నెల 2 వరకు ఇదే పరిస్థితి
పనులు జరగక జనం అవస్థలు
జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో సామాన్యులకు సేవలందడం కష్టమైపోతోంది. ఏ శాఖకు వెళ్లినా వచ్చే నెల 2 తర్వాతే పనులు జరుగుతాయంటూ జనాన్ని తిప్పి పంపేస్తున్నారు. విభజన కారణంగా రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ శాఖలను వేరు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ శాఖల అప్పులు, బకాయిల నివేదికల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని శాఖల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్లుల గోలే కనిపిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులంతా రాష్ట్రస్థాయి అధికారులే. వీరిలో తెలంగాణ ప్రాంత అధికారులు ఇక్కడ ఉన్నారు. విభజన నేపథ్యంలో ఇప్పుడు ఏయే శాఖల అధికారులు ఏ ప్రాంతానికి చెంది న వారు?, వారి సర్వీసు వివరాలను ప్రభుత్వం సేకరించింది.
దీని ఆధారంగా ఉద్యోగుల పంపకాలు చేపట్టడంతో ఇప్పుడు జిల్లాలోని మార్కెటింగ్, గనులశాఖ, వైద్య, విద్య, ఉన్నత విద్య, తూనికలు కొలతలు, రహదారులు భవనాలశాఖ, ఆర్డబ్ల్యూఎస్, గ్రామీణ నీటిసరఫరా, ఆడిటింగ్, వాణిజ్య పన్నులు, పౌరసరఫరాల శాఖ.. ఇలా అన్ని విభాగాల్లోనూ అధికారులు ఉద్యోగుల పంపకాలపైనే చర్చించుకుంటున్నా రు. జోనల్, రాష్ట్రస్థాయి అధికారులు తాము ఎక్కడికెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
వాస్తవానికి వచ్చే నెల 2 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడుతుండడంతో ఈలోగా అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల పంపకాలు, పాత బకాయిలు తదితర అంశాలన్నీ తేలిపోవాల్సి ఉంది. అన్ని విభాగాల్లో అధికారులు తమకు రావలసిన నిధులకు సంబంధించి పైస్థాయి అధికారులతో సంప్రదింపుల్లో తల మునకలై ఉన్నారు. దీంతో ఏ శాఖలోనూ పనులు ముందుకు కదలడంలేదు. వ్యవసాయ శాఖలో ఇప్పటికీ ఖరీఫ్ ప్రణాళికను సైతం తయారు చేయలేదు. దీంతో ఎన్నికల కోడ్ ముగిసినా ఏ పనులు ముందుకు కదలక ప్రజలు ఉసూరుమంటున్నారు.