ఢిల్లీలో ‘ఆప్’కా సర్కార్!
ప్రభుత్వ ఏర్పాటుపై కేజ్రీవాల్ స్పష్టమైన సంకేతాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముందడుగు వేసింది. కాంగ్రెస్తో కలసి ప్రభుత్వాన్ని పంచుకోవడంపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ అంశంపై వారంపాటు నిర్వహించిన రిఫరెండంలో ప్రజలు తమకు సానుకూల ఫలితాలు ఇచ్చారని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఇక్కడ తెలిపారు. కాంగ్రెస్తో కలసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రిఫరెండంలో పాల్గొన్న 80 శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అలాగే ఆది వారం వరకూ నిర్వహించిన 280 బహిరంగ సభల్లో చాలా చోట్ల ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. అయితే రిఫరెండంతోపాటు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్, ఈ-మెయిల్స్ ద్వారా అందిన ఫలితాలను విశ్లేషించాక ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ అంశంపై సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాక లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను మధ్యాహ్నం 12:30 గంటలకు కలసి తుది నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని పలు హామీలను కొన్ని గంటల వ్యవధిలోనే అమలు చేస్తామన్నారు. కాగా, రిఫరెండం నిర్వహణ తీరు సరిగాలేదన్న విమర్శలను కేజ్రీవాల్ అంగీకరించారు. కానీ ఈ చర్య ద్వారా తాము ప్రజాభిప్రాయాన్ని చూచాయగా తెలుసుకోగలిగామన్నారు.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హంగ్ ఫలితాలు ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. బీజేపీ 31 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా ఆప్ 28 స్థానాలు, కాంగ్రెస్ 8, అకాలీదళ్ (ఎన్డీఏ భాగస్వామ్యపక్ష పార్టీ), జేడీయూ చెరో సీటు గెలుచుకున్నాయి. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 36 స్థానాలు దక్కకపోవడంతో బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడగా, ఆప్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ బేషరతు మద్దతు పలికింది. కాంగ్రెస్ మద్దతుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై ఆప్ రిఫరెండం నిర్వహించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఆప్ చర్యను రాజకీయ అవకాశవాదంగా అభివర్ణించింది. విలువలు, ప్రత్యామ్నాయ రాజకీయాలకు కట్టుబడతామన్న ఆప్... కాంగ్రెస్ మద్దతును ఏ విధంగా సమర్థించుకుంటుందని బీజేపీ ప్రశ్నించింది.