ఏపీ రాజధాని ఫ్రీ జోన్!
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్ నుంచి పాలన మొత్తం ఏపీ రాజధానికి తరలించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెండో జోన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం గుంటూరు-విజయవాడను ఫ్రీ జోన్ చేసేందుకు సర్కారు ప్రయత్నాలు ఆరంభించింది. హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల స్థానికతను సడలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఇప్పటికే ఏపీ రాజధాని ప్రాంతంలో రెండు హెచ్ఆర్ఏలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉద్యోగ సంఘాలు సీఎస్‌తో సమావేశమైనప్పుడు స్థానికత అంశం తెరపైకి తెచ్చారు. వరుసగా ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికతగా నిర్ధారిస్తారు. ఏపీ రాజధాని ప్రాంతంలో కొత్తగా వెళ్లే ఉద్యోగుల పిల్లలకు స్థానికత ఉండదు. వారిని అక్కడ నాన్ లోకల్‌గానే పరిగణిస్తారు. ఉద్యోగాల్లో ఇతర అవకాశాల్లో నష్టం జరిగే అవకాశం ఉండటంతో రాజధానిని ఫ్రీ జోన్ చేయాలని మొదట్నుంచీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆర్టికల్ 371 డి ని సవరించాలని కేంద్రానికి లేఖ రాసింది. రెండు నెలల్లోగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసి సవరణ చేస్తే ఉద్యోగుల తరలింపులో ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.