వ్యవసాయం కుదేలు
గుజరాత్లో మోడీ పాలనపై సోనియా ధ్వజం
పెట్టుబడిదారుల కొమ్ము కాస్తోంది
రైతుల భూములు బడా వేత్తలపాలు
ఏడు వేల చిన్నతరహా పరిశ్రమలు మూత
అలాంటి ప్రగతి అక్కర లేదు
ప్రజలను బీజేపీ నేతలు మభ్యపెడుతున్నారు
బీజేపీ హయాంలో రాష్ర్టంలో ఖనిజ సంపద లూటీ
కోలారు/మైసూరు, న్యూస్‌లైన్ : గుజరాత్ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ము కాయడం వల్ల వ్యవసాయం కుదేలయిందని, రైతులు భూములు కోల్పోయారని ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ పరోక్షంగా మోడీ పాలనపై ధ్వజమెత్తారు. కోలార్, మైసూరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె గుజరాత్లో పాలనపై దుమ్మెత్తి పోశారు.
రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, అంతేకాక ఆ రాష్ట్రంలో ఏడు వేల చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని, పేదరిక నిర్మూలన కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ఇదేనా గుజరాత్ ప్రగతి అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రగతి తమకు అక్కర లేదని అన్నారు. బీజేపీ నేతలు చెబుతున్న అభివృద్ధి గుజరాత్లో ఎక్కడా కనిపించదని తెలిపారు. అసలు గుజరాత్ ముఖచిత్రం వేరుగా ఉందని వివరించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న వారి ఆటలు ఇకపై సాగవన్నారు.
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఖనిజ సంపద యథేచ్ఛగా లూటీ అయిందని, మైనింగ్ మాఫియాకు అప్పటి ముఖ్యమంత్రి అండగా నిలిచి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రతి ఫలంగా ఆ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకున్న బీజేపీకి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. నిత్యం అవినీతిలో మునిగి ఉండే బీజేపీ తమ పార్టీకి నీతి పాఠాలను వల్లించాల్సిన అవసరం లేదని దెప్పి పొడిచారు.
అవినీతిని అంతమొందించడానికి ఏం చేయాలో కాంగ్రెస్‌కు తెలుసునని, ఇందులో భాగంగానే యూపీఏ సర్కారు పలు చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. అనేక ఆర్థిక సవాళ్లు ఎదురైనా ప్రజా హిత కార్యక్రమాలను చేపట్టడంలో కాంగ్రెస్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని తెలిపారు. పేద విద్యార్థుల మెరుగైన చదువుల కోసం ఆర్టీఈ చట్టాన్ని, పేదల ఆకలి మంటలు చల్లార్చేందుకు ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు.