సకల సదుపాయాల సర్కారీ దవాఖానాలు
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య
గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలే మా లక్ష్యం
హెలికాప్టర్ ద్వారా అత్యవసర చికిత్సలు
సర్కారీ ఆస్పత్రులకు వచ్చే రోగులు మందులు బయట కొనాల్సిన పని ఉండదు
నష్టపోయిన మెడిసిన్ సీట్లను మళ్లీ సాధిస్తా..
హైదరాబాద్: ‘వైద్యునిగా 30 ఏళ్ల అనుభవముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు వజ్రకవచంలా ఉపముఖ్యమంత్రి పదవిచ్చారు. వీటిని ఉపయోగించి సర్కార్ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళతా.సర్కారీ దవాఖానాల్లో సకల సదుపాయాలను సమకూర్చుతాం. తెలంగాణలోని గడపగడపకూ వైద్యాన్ని అందిస్తా. సర్కార్ ఆస్పత్రులకు వచ్చే రోగు లు ఇకపై మందులు బయట కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. పరీక్షల కోసం ప్రైవేటు లాబ్‌లకు వెళ్లకుండా ప్రక్షాళన చేస్తా. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా. అవసరమైతే ఆ ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తా.’ అని వైద్యశాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య చెప్పారు. వైద్య రంగాభివృద్ధి, ప్రభుత్వాస్పత్రుల బలోపేతం, ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల నివారణ, పేదలకు కార్పొరేట్ వైద్యం వంటి అంశాల్లో రాజయ్య తన విజన్‌ను, ప్రభుత్వ లక్ష్యాలను ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
వైద్యానికి వజ్రకవచం డీసీఎం
రోగులందరికీ చక్కని వైద్యాన్ని అందించేందుకు ఈ పదవిని ఉపయోగిస్తా. సచివాలయంలో సమీక్షలకే పరిమితమవడానికి నేను వ్యతిరేకం. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ వ్యా ధుల నివారణకు, మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకుంటా.
గ్రామాలు, తండాల్లో మార్పు
ఇప్పుడున్న రోగాల్లో 70 శాతం దోమలు, ఈగలవల్లే సంభవి స్తున్నాయి. గ్రామాల, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు వీటిపై అవగాహన లేదు. పైగా మూఢ నమ్మకాలు ఎక్కువ. జ్వరం ఎక్కువై అది మెదడుకు సోకి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దెయ్యం పూనిందని యంత్రాలు కట్టించుకుంటారే తప్ప చికిత్స చేయించుకోవాలనుకోరు. అందుకే ఆ ప్రాంతాలపైనే నేను దృష్టి సారించా. వైద్యశాఖతోపాటు ఐటీడీఏ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, అంగన్వాడీ ఉద్యోగులనూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనూ భాగస్వామిని చేస్తా. కళాజాతాల ద్వారా రోగాల నివారణపై అవగాహన కల్పిస్తా.
హెలికాప్టర్ అంబులెన్సుల ఏర్పాటు
అత్యవసర పరిస్థితిలో కేసీఆర్ చెప్పినట్టు హెలికాప్టర్ అంబులెన్సులను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తాం. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొం దిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో బోర్లలో పిల్లలు పడితే ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెచ్చించి వాళ్ల ప్రాణాలను కాపాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఏజెన్సీ ప్రజలు రోగాలబారినపడినప్పుడు హెలికాప్టర్ అంబులెన్సులను వినియోగిస్తే తప్పేముంది?
సర్కార్ దవాఖానాల ప్రక్షాళన
ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, కనీస సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. ఇకపై అలాంటివి ఉండకుండా చూస్తాం. సర్కార్ దవాఖానాలకు వచ్చేవారు ఇకపై బయట మందులు కొనడం, ప్రైవేటు డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకునే పరిస్థితి రానీయను. మందులను ఆస్పత్రుల్లో అందజేయిస్తా. పరీక్షలను సైతం అక్కడే జరిపిస్తా.
సమయపాలన పాటించాల్సిందే..
డాక్టర్లు, సిబ్బంది సరిగా విధులకు హాజరు కావడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇకపై సమయాలను కచ్చితంగా పాటించాల్సిందే. డాక్టర్ల గౌరవాన్ని పెంపొందించే బాధ్యతను నేను తీసుకుంటా. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి.
అవినీతిని నిర్మూలిస్తా..
ప్రభుత్వాస్పత్రుల్లో రెండు రకాల అవినీతి జరుగుతోంది. రోగుల వద్ద అటెండర్, సెక్యూరిటీ గార్డ్ వంటి కింది స్థాయి ఉద్యోగులు తీసుకునే పది, పరకా వంటివి ఒకటైతే... మందులు, ఇతరత్రా వాటిల్లో జరిగే అవినీతి మరొకటి. రెండో రకం అవినీతిని నిర్మూలిస్తే... మొదటిది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అందుకోసం కృషి చేస్తా.
హెల్త్‌హబ్‌గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్టూరిజంగా మార్చేందుకు ప్రయత్నిస్తా. ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతా. బీబీనగర్ నిమ్స్ పనులను పూర్తిచేసి రెండు నెలల్లో ఓపీ బ్లాకును ప్రారంభిస్తా. గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో ఎంసీఐ నిబంధనలు పాటించలేదనే కారణంతో వంద సీట్లకు కోత విధించారు. వాటిని తిరిగి సాధించుకుంటాం. మరోసారి ఎంఐసీ ఆయా కళాశాలలను సందర్శించాలని, కేంద్ర నిబంధనలను పూర్తిగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇస్తా.