వీరి బతుకులింతేనా? | minimum facilities drought in tribal areas | Sakshi
Sakshi News home page

వీరి బతుకులింతేనా?

Published Sat, Jan 11 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

minimum facilities drought in tribal areas

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్, కంగ్టి, మనూర్, పెద్దశంకరంపేట, నారాయణఖేడ్ మండలాల్లో 110 పంచాయతీలు ఉండగా 181 తండాలు ఉన్నాయి. ని యోజకవర్గంలోని తండాల్లో సుమారు 48 వేల జనాభా ఉంటుంది. చాలాచోట్ల మౌలిక వసతులు లేవనే చెప్పాలి. అంతర్గత రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో తండాలన్నీ అభివృద్ధిలో వెనుకబడి పో యాయి. తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు.

 సౌకర్యాల జాడేది?
 సిర్గాపూర్, బాచేపల్లి, నాగధర్, మునిగేపల్లి, కడ్పల్, మాసాన్‌పల్లి, కల్హేర్ పంచాయతీల్లోని తండాల్లో సమస్యలు తిష్టవేశాయి. బీబీపేట జంలా తండాలో మంచి నీటి ట్యాంక్ నిర్మించి ఏళ్లు కావస్తున్న నిరుపయోగంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా మట్టిరోడ్లు, పూరి గుడిసెలు దర్శనమిస్తున్నాయి. సిర్గాపూర్‌తోపాటు తదితర తండాలు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. ఇళ్లల్లో ఇప్పటికీ కిరోసిన్ దీపాలనే ఉపయోగిస్తున్నారు.

 తాగునీటికి కటకటే..
 తాగు నీటికి కోసం గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని తండాల్లో మంచి నీటి ట్యాంకులు నిర్మించినా బోరు, పైపులైన్ లేకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. గిరిజనులు నీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. పంపుల వద్ద బురద గుంటలు ఉండడంతో నీరు కలుషితం అవుతున్నాయి. ఫలితంగా వారు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గతంలో ఎంతో మంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడిన సందర్భాలున్నాయి.

 విద్య.. మిథ్యే..
 తండాల్లో పాఠశాలలు ఉన్నా అవి సరిగా తెరుచుకోవడం లేదు. మెజార్టీ పాఠశాలలు ఏకోపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో చాలామంది తరచూ డుమ్మాలు కోడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా గిరిజనులు నిరక్షరాస్యులుగా మిలిగిపోతున్నారు.

 ప్రభుత్వ వైద్యం గగనమే..
 తండాల వాసులకు ప్రభుత్వ వైద్యం గగనంగా మారింది. ఆరోగ్య సిబ్బంది తండాలకు వెళ్లడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 104 వైద్య సేవలు అందడం లేదని ఆయా తండా వాసులు ఆరోపిస్తున్నారు. ఇటివలే నాగధర్ రాంచందర్ తండాల్లో గిరిజనులు డయేరియాతో మంచం పట్టిన సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.

 రాకపోకలకు తప్పని ఇబ్బందులు
 మెజార్టీ తండాల్లో మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. కల్హేర్ పోమ్యానాయక్ తండా, సిర్గాపూర్ జంలా తండా, గైర్హాన్ తండా, మాసాన్‌పల్లి రత్ననాయక్ తండా, బుగ్యనాయక్ తదితర తండాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు ఆ తర్వాత తండాల వైపు కన్నెత్తి చూడడం లేదు.

 వ్యక్తిగత మరుగుదొడ్లు కరువే..
 తండాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. ఆరుబయటే తడకలు వేసి స్నానపు గదులుగా వినియోగిస్తున్నారు. మురికి కాలువలు లేకపోవడంతో ఆ నీరంతా వీధుల్లోనే ఉండిపోతుంది. ఇళ్ల ముందే పెంట కుప్పలు పేరుకుపోతున్నాయి. వర్షాకాలంలోనైతే పరిస్థితి భయానకంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉపాధి పనులు సైతం లభించక ఎంతోమంది వలస బాట పడుతున్నారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి బాటపట్టవచ్చని గిరిజనులు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement