ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న పోల్ పండితుల అంచనాలను, ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ తలకిందులు చేసింది. సునాయాసంగా మెజారిటీ మార్కు దాటేసి భూపేశ్ బఘేల్ సర్కారును గద్దె దించింది. ఐదు సంవత్సరాల విరామం అనంతరం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 54 సీట్లు నెగ్గింది. రాష్ట్రంలో బీజేపీకి ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. గిరిజన ప్రాంతాలైన సర్గుజా, బస్తర్‌లను ఏకపక్షంగా కొల్లగొట్టడమే బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
బస్తర్, సర్గుజాలో హవా
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు షాకివ్వడం నిజమే అయినా బీజేపీని కూడా ఒకింత విస్మయపరిచాయనే చెప్పాలి. ఎందుకంటే బఘేల్ సర్కారు ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు ప్రధానంగా ఆయన పక్కాగా అమలు చేసిన పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలే కారణంగా నిలిచాయి. ముఖ్యంగా 2018లో రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో అధికారంలోకి రాగానే బఘెల్ ప్రవేశపెట్టిన వరికి బోనస్ పథకం రాష్ట్రంలో సూపర్‌హిట్టయింది.
వరికి దేశంలోనే అత్యధిక బోనస్ ఇస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. పారీ్టలకతీతంగా అర్హులందరికీ పథకం ఫలాలు అందేలా బఘేల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఈసారి బీజేపీ గెలుపు అందరినీ ఆశ్చర్యపరిచిన పరిణామమే. గిరిజన ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలన్నింటినీ ఈసారి బీజేపీ ఏకపక్షంగా ఒడిసిపట్టడమే దాని మెజారిటీకి ప్రధాన కారణంగా నిలిచింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఉత్తరాదిన ఉన్న సర్గుజా రెండూ బీజేపీకి జైకొట్టాయి.
బస్తర్‌లోని 12 స్థానాలకు గాను బీజేపీకి 9 స్థానాలు దఖలుపడ్డాయి. సర్గుజాలోనైతే మొత్తం 14 సీట్లను గాను బీజేపీ ఏకంగా 13 స్థానాలను దక్కించుకుంది. ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్ కంచుకోట కావడం విశేషం. రాజవంశీకుడైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావంతో సర్గుజా ప్రాంతంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆనాడు 14 స్థానాలకుకుగాను కాంగ్రెస్‌కు 12 సీట్లు దక్కాయి. ఈసారి పరిస్థితి దాదాపుగా తారుమారవడం విశేషం. ఇక్కడ బీజేపీ హవా దెబ్బకు చివరికి సింగ్‌దేవ్ సైతం ఓటమి చవిచూశారు. బస్తర్‌లో మాత్రం 3 స్థానాలతో కాంగ్రెస్ ఉనికి నిలుపుకోగలిగింది.
రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్‌కు మొగ్గు
► గిరిజన ప్రాంతాలతో పోలిస్తే రాజధాని రాయ్‌పూర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శనే చేసింది.
►ఇక్కడి 20 స్థానాల్లో ఆ పార్టీ 11 సీట్లు నెగ్గింది. బీజేపీకి 9 స్థానాలు దక్కాయి.
►బిలాస్‌పూర్ ప్రాంతంలో బీజేపీ 13, కాంగ్రెస్ 10 చోట్ల గెలిచింది. పాలి తనఖర్‌లో గోండ్వానా గణతంత్ర పార్టీ గెలిచింది.
►దుర్గ్ ప్రాంతంలోనూ 20 స్థానాలుండగా బీజేపీ, కాంగ్రెస్ చెరో పదింటిని గెలుచుకున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment