సాక్షి, అమరావతి: ‘నాడు – నేడు’ కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. రవాణా సౌకర్యం లేని కొండకోనల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లోని ఈ పాఠశాలలను ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ ఈ పాఠశాలలు పాకల్లో, రేకుల షెడ్లలో నడుస్తున్నాయి. చాలా తక్కువ స్కూళ్లకు భవనాలు ఉన్నప్పటికీ, అవి శిథిలమైపోయాయి.
ఇలాంటి పాఠశాలలకు ప్రభుత్వం ‘నాడు – నేడు’ కార్యక్రమం రెండో దశ కింద కొత్త రూపునిస్తోంది. వీటిలో పాడుబడ్డ భవనాలను బాగు చేసి, కొత్త భవనాలు కూడా నిర్మిస్తోంది. తొలుత 20 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న 763 స్కూళ్లను గుర్తించారు. వీటిలో రూ.219.69 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 75 పాఠశాలలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 66, తిరుపతి 51, చిత్తూరు 42, సత్యసాయి జిల్లాలో 38 ఉన్నాయి.
మిగిలిన జిల్లాల్లో 9 నుంచి 30 వరకు పాఠశాలలు ఉన్నాయి. కొత్త భవనాలు నిర్మించాల్సినవి 360 వరకు ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి ఉన్నాయి. ఇప్పటికే 180 స్కూళ్ల పనులు పూర్తి చేయగా, మిగిలిన పాఠశాలల పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యా శాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ ఆదేశించారు. నాడు–నేడు మూడో దశలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ఆధునీకరించాలని నిర్ణయించారు.
817 పాఠశాలల్లో సదుపాయాలు..
ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో నాడు–నేడు పనులు చేపట్టిన 817 పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన రూ.46.83 కోట్లతో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 457 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment