తప్పుడు పేర్లు.. నకిలీ టెస్టులు!
ఇంజాపూర్కు చెందిన సుమతి (38) కూడా 21వ తేదీన టెస్టు చేయించుకున్నట్టు నమోదు చేశారు. ఆమెకు ఈ విషయమే తెలియదు. తన పేరు, తన భర్త ఫోన్ నంబర్ (8247323492)ను ఎందుకు నమోదు చేశారని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన కౌశిక్ (31) కొద్దిరోజులుగా తిరుపతిలోనే ఉన్నారు. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ బుధవారం అబ్దుల్లాపూర్మెట్లో కరోనా టెస్టు చేయించుకున్నట్టు ఆయన ఫోన్ నంబర్ (9440452123)తో సహా రికార్డు చేశారు.
ఉమర్ఖాన్గూడకు చెందిన రజిత (30), సైదులు (37), శివకుమార్ (25), ప్రణవి (12), రాము (28)లు ఈ నెల 21న అబ్దుల్లాపూర్మెట్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయించుకున్నట్టు ఆస్పత్రి రికార్డులో పేర్లు, ఫోన్ నంబర్ (7989983606) సహా నమోదు చేశారు. వారికి నెగెటివ్ వచ్చినట్టు చూపారు. నిజానికి ఆ రోజున వీరెవరూ టెస్టులు చేయించుకోలేదు.
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్మెట్
ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయకుండానే.. చేసినట్టుగా నమోదు చేసి, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్లను పక్కదారి పట్టించిన తీరు ఇది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిసి చేస్తున్న ఈ దందా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడింది. గతంలో టెస్టులు చేయించుకున్న వారి పేర్లు, వివరాలనే మళ్లీమళ్లీ రికార్డుల్లో నమోదు చేసి కిట్లను దారిమళ్లిస్తున్నట్టు తేలింది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యమే ఈ వ్యవహారానికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఆరోగ్య కేంద్రంలో జరిపిన పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం 43 మందికి, గురువారం 63 మందికి ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయినట్టు, మిగతా వారందరికీ నెగిటివ్ వచ్చినట్టు రికార్డు చేశారు. కానీ రికార్డులో చూపించిన వారిలో ఐదారుగురికి మినహా మిగతావారెవరికీ టెస్టులే చేయలేదని తేలింది.
కిట్లు లేవని జనాన్ని తిప్పిపంపేస్తూ..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 248 ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో రోజుకు సగటున 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కానీ జనం టెస్టుల కోసం ఇప్పటికీ కొన్ని ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అక్కడి సిబ్బంది కిట్లు లేవని చెబుతూ చాలా మందిని తిప్పి పంపేస్తున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం టెస్టులు చేసినట్టు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. నకిలీ పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు.
ఎవరికీ అనుమానం రాకుండా..
ప్రభుత్వ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లలో కొందరు డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటివద్ద, బయట ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్నారు. చిన్నచిన్నక్లినిక్లు పెట్టి నడిపిస్తున్నారు. వాటిల్లో ప్రైవేటుగా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యూలు ఉండటం, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో ధరలు ఎక్కువగా ఉండటం, ర్యాపిడ్ కిట్లు లేకపోవడంతో.. చాలా మంది చిన్న క్లినిక్లలో కరోనా టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొందరు వైద్య సిబ్బంది దీనిని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డుల్లో తప్పుడు పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. పది, ఇరవై మందికి టెస్టులు చేసి.. 50 నుంచి 60 మందికి చేసినట్టు నమోదు చేస్తున్నారు. పాజిటివ్ రిపోర్టులు రాస్తే.. పైఅధికారులకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో నెగిటివ్గా నమోదు చేస్తున్నారు. ఇక కొందరు వైద్య సిబ్బంది టెస్టు కిట్లను చిన్నచిన్న ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి.
తప్పుడు ఫలితాలతో సమస్యలు
చేయని టెస్టులు చేసినట్టు.. నెగెటివ్ వచ్చినట్టు చూపుతుండటంతో కేసులు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం నెలకొంటోంది. వైరస్ వ్యాప్తి తగ్గిందన్న భావనతో జనం కోవిడ్ నిబంధనలను విస్మరిస్తున్న పరిస్థితి ఉందని.. మాస్క్లు, భౌతిక దూరం వంటివి పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.