government hospitals services
-
ప్రభుత్వాసుపత్రుల్లో ఎలా ఉంది?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్లో గర్భిణీ మృతి కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్పత్రుల్లో వసతులపై నివేదిక అందజేయాలని వైద్యారోగ్య శాఖకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెంచ్.. ‘‘ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తోన్న బడ్జెట్ ఎంత?’’ అని ప్రశ్నించింది హైకోర్టు. ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలంటూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇదీ చదవండి: వాతావరణ శాఖ హెచ్చరికలతో కేసీఆర్ పర్యటన వాయిదా -
పరికరాలు గబ్బు..నిర్లక్ష్యమే జబ్బు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన వైద్య పరికరాలు మూలన పడుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఖరీదైన పరికరాలను ఇస్తుంటే వాటిని వినియోగంలోకి తేవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రభుత్వంతోపాటు దాతలు సైతం వైద్యపరికరాలు అందించారు. అయితే ఎన్ని రూ.కోట్లు ఖర్చుచేసినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వైద్య పరికరాలను ఆస్పత్రి సిబ్బంది మూలన పడేసి కమీషన్ల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తుండటంతో ప్రజలు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. సూర్యాపేటలో మూసి ఉన్న సీటీ స్కాన్ గది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు హుజురాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖనిలో ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయి. నిరుపేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.3 లక్షల విలువైన ఏబీజీ మిషన్‌ను మూలన పడవేయగా, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా అనెస్థీషియా వర్క్‌స్టేషన్ మిషన్‌తోపాటు 3 వెంటిలేటర్లు, సీ–పాప్ మిషన్, సీటీజీ మిషన్, రెండు ఫెటల్ డాప్లర్స్, హిస్ట్రోస్కోప్ విత్ హైడ్రోజెట్, ఐదు ఇన్ఫ్యూజన్ పంప్స్, రెండు అల్ట్రాసౌండ్ మిషన్లను అందజేశారు. సుమారు రూ.50 లక్షల విలువైన పరికరాలను ఐదు నెలలైనా వినియోగంలోకి రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాసుపత్రికి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ గత రెండేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ. 1.20 కోట్ల విలువైన పరికరాలు అందజేసింది. జిల్లా ఆసుపత్రిలో ఆర్థో, జనరల్, ఈఎన్టీ, పల్మనాలజీ, ఆప్‌తో విభాగాలకు చెందిన సర్జన్లు లేకపోవడంతో విలువైన పరికరాలను పక్కన పెట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న రెండు డెడ్‌బాడీ ఫ్రీజర్లు సాంకేతిక సమస్యలతో మూలకు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయోగ్నోస్టిక్లో అడ్వాన్స్ బయోకెమికల్ ఎనలైజర్, పాథా లజీ ఎనలైజర్, సెల్ కౌంటర్, యూరిన్ ఎనలైజర్, 2డీ ఎకో, సీబీపీ, యూరియా క్రియోటిన్, లివర్ ఫంక్షన్ మెషీన్ అందుబాటులోకి తెచ్చారు. దీంట్లో 2డీ ఎకో మిషన్ ఆపరేటింగ్ చేయడానికి కార్డియాలజిస్ట్తోపాటు టెక్నీషియన్ లేకపోవడంతో వాడకంలో లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రిలో రూ.కోటికిపైనే వెచ్చించి ఆరు నెలల క్రితం సీటీ స్కానర్‌ను తెచ్చారు. ఒకట్రెండు నెలల పాటు పనిచేసిన ఈ స్కానర్ ఇప్పుడు మూలనపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లేట్లెట్ పరికరాల యంత్రం రెండేళ్లయినా వినియోగంలోకి తేలేదు. దీనికి సంబంధించి కెమికల్ అందుబాటులో లేకపోవడంతో వినియోగించడం లేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. రూ.2.80 లక్షలతో కొనుగోలు చేసిన ఈ యంత్రంతో వివిధ రక్తపరీక్షలు కూడా చేయొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించారు. జనగామ డయాగ్నొస్టిక్ కేంద్రంలో మొత్తం 57 రకాల టెస్టులకుగాను, 33 రకాల టెస్టులే చేస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్, డెంగీ, వైడల్ టెస్టులు అందుబాటులో లేవు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి భురాన్పురం సర్పంచ్ మచ్చా శ్రీనివాసరావు రూ.15 లక్షల విలువైన ఎక్స్‌రే యంత్రం ఇచ్చినప్పటికీ టెక్నీషియన్ లేకపోవడంతో ఉదయం 9 గంటలకు మొక్కుబడిగా తీసి తర్వాత మూసివేస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్ నిర్వాహణ మరిచారు. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో సేవలు అరకొరగానే అందుతున్నాయి. కేసులను మాత్రమే రెఫర్ చేస్తున్నాం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి రోజూ రోడ్డు ప్రమాదాల కేసులతోపాటు ఇతర రిస్క్ కేసులూ వస్తుంటాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి పేషెంట్లు వస్తుంటారు. ప్రమాదాల్లో బాడీ క్రష్ అయిన హైరిస్క్ కేసులను మాత్రమే పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తున్నాం. మిగతా కేసులకు ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. ఎలాంటి నిర్లక్ష్యం లేదు. -
సర్కారు దవాఖానాల్లో దారుణం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగులతో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని కోవిడ్–19 ప్రత్యేక లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్(ఎల్ఎన్జేపీ)ఆసుపత్రిలో మృతదేహాలున్న బెడ్స్ పక్కనే కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న భయంకర దృశ్యాలున్న వీడియోను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దీంతో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో ఆసుపత్రుల్లో తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దవాఖానాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అలాగే, దీనిపై స్పందించాల్సిందిగా కేంద్రానికి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స ఇతర సౌకర్యాల వివరాలు, వైద్య సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను కోర్టుకు అందజేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉందని, ఈ విషయంలో కేంద్రం జారీ చేసిన నిబంధనలను పాటించడం లేదని మండిపడింది. మృతదేహాలకు ఆసుపత్రులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంది. ఢిల్లీలో తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రిలో నెలకొన్న దారుణ పరిస్థితులపై 17లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రి డైరెక్టర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి సంబంధించిన వీడియోలను మీడియాలో చూసిన తరువాత ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్నామని పేర్కొంది. ‘పేషెంట్లకు చికిత్స చేస్తున్న వార్డులోనే మృతదేహాలను ఉంచారు. లాబీలో, వెయిటింగ్ ఏరియాల్లోనూ మృతదేహాలను ఉంచారు. పేషెంట్లకు ఆక్సిజన్ కానీ, మరే ఇతర వైద్య సదుపాయాలు కానీ కల్పించలేదు. రోగులు ఏడుస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఇది ఢిల్లీలోని 2 వేల పడకలున్న ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి’ అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో పరిస్థితి ‘అత్యంత భయంకరంగా, దారుణంగా, దయనీయంగా’ ఉందని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ యాప్‌లోని సమాచారం మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం బెడ్స్ 5,814 ఉండగా, అందులో 2,620 మాత్రమే ఆక్యుపై అయిన విషయాన్ని తమ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. -
గుట్టు రట్టవుతుందనే బయటపెట్టట్లేదు..
సాక్షి, సిటీబ్యూరో : ఆరోగ్య రాజధాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకుపోతుంటే మన ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నాయి. మందులు, వైద్య పరికరాల కొనుగోలు, ఇతర అభివృద్ధి పనుల్లో పారదర్శంగా వ్యవహరించాల్సిన ఆస్పత్రులు ఆయా అంశాల్లో ఎంతో గోప్యత పాటిస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం కనీసం ఆస్పత్రి పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయలేని దుస్థితి. వైద్య విభాగాలు, నిపుణులు, సేవల వేళలు, ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లు కంప్యూటర్లో పొందుపర్చేందుకు చర్యలు చేపట్టక పోవడం హాస్యస్పదం. ఫలితంగా మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు మాత్రమే కాదు..వివిధ సేవలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ విభాగంలో ఎంత మంది వైద్యులు పని చేస్తున్నారు. ఎన్ని పడకలు ఉన్నాయి. ఏఏ వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తదితర వివరాలు బయటికి తెలియడం లేదు. నగరంలో ఒక్క నిమ్స్ మినహా మరే ఇతర ఆస్పత్రికి ప్రత్యేక వెబ్సైట్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. లోపించిన పారదర్శకత... ప్రతిష్టాత్మాక ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా సహా సుల్తాన్‌బజార్ ప్రభుత్వం ప్రసూతి వైద్యశాల, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, ఫీవర్ ఆస్పత్రి, ఈఎన్టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం, సనత్‌నగర్‌లోని ఛాతి ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. వీటిలో ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి మినహా ఇతర ఆస్ప త్రులేవీ ఇప్పటి వరకు ఆన్లైన్లో ఖాతా తెరవలేదు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు ఇటీవల వెబ్సైట్ ఓపెన్ చేసినప్పటికీ..ఆస్పత్రి చరిత్ర వంటి సాధారణ అంశాలు మినహా ఓపీ, ఐపీ, సర్జరీలు, టెండర్లు, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చలేదు. ఆస్పత్రుల్లో ఆన్లైన్ వ్యవస్థ లేక పోవడంతో అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు మొదలు విలువైన వైద్యపరికరాలు, మందుల కొనుగోలు, ఉద్యోగుల నియామకాలు, శానిటేషన్, క్యాంటిన్, పార్కింగ్ వగైరా కాంట్రాక్టులు, చివరకు అత్యవసర పరిస్థితుల్లో కొనుగోలు చేసే మందులు తదితర అంశాల్లో పారదర్శకత లోపించి, అక్రమాలకు తావిస్తోంది. నిలోఫర్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు... నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసినా..ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదు. నిలోఫర్ వెబ్సైట్లో ఇప్పటికీ మాజీ సూపరింటెండెంట్ పేరు, ఫొటోలు, పాత సమాచారమే కన్పిస్తుంది. ఒక్క వైద్య సేవలకు సంబంధించిన వివరాలు మాత్రమే కాదు ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర పరిపాలనాధికారుల పేర్లు, ఫొటోలు సైతం పాతవే దర్శనమిస్తుండటం గమనార్హం. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు కూడా ఆఫ్‌లైన్‌లో చేపడుతుండటం విశేషం. ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల్లో భారీగా గోల్మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు అందులో పొందుపర్చి, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన ఉన్నతాధికారులే అక్రమా లకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గుత్తి ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్
-
మందులోళ్లే.. మాయలోళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఇది మందులోళ్ల మాయాజాలం.. మందుల కొను‘గోల్మాల్’.. కమీషన్ల కహానీ. కాసుల కక్కుర్తి.. ఇదీ సర్కార్ ఆసుపత్రుల్లో సాగుతున్న తతంగం. ప్రభుత్వాసుపత్రిలో అవసరమున్నా లేకపోయినా ఇష్టారాజ్యంగా మందులకు ఇండెంట్లు పెట్టడం, తద్వారా కంపెనీల నుంచి కమీషన్లు పొం దడం వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులకు, ఫార్మసిస్టులకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో జరిగిందే నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఘటన. ఈ కేంద్రానికి 500 ట్రెమడాల్ మాత్రలు అవసరంకాగా, ఏకంగా 10 వేల మాత్రలు పంపించారు. ఆ మాత్రల వల్లే ఇటీవల ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తేలిందేంటంటే, ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద మం దుల ఇండెంట్ పెట్టేందుకుగాను ఆన్‌లైన్‌కు సంబం ధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కొందరు ఫార్మసిస్టులు దొంగిలించి ఇండెంట్లు పెట్టడం. ఈ వ్యవహా రం ఆ శాఖలో సంచలనంగా మారింది. దీంతో సద రు ఫార్మసిస్టులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. కింది నుంచి పైస్థాయి వరకు కమీషన్ల కక్కుర్తి మందుల కొనుగోలుకు సంబంధించి ప్రతి ఆస్పత్రికి ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తారు. అది ఆసుపత్రి ప్రధానాధికారికి మాత్రమే తెలుస్తుంది. గతంలో పీహెచ్‌సీల్లోని మెడికల్ ఆఫీసర్ మందులకు ఇండెంట్ పెడితే అది జిల్లా వైద్యాధికారికి చేరేది. అక్కడి నుంచి ప్రజారోగ్య సంచాలకులకు అవి చేరేవి. బోధనాసుపత్రులైతే వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ)కు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆసుపత్రులైతే సంబంధిత కమిషనర్‌కు చేరేవి. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కు ఇండెంట్ పెట్టేవారు. వారికి కేటాయించిన బడ్జెట్ ఆధారంగా మందుల సరఫరా జరిగేది. దీని స్థానంలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. దీంతో ఏ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి మందులు కావాలన్నా నేరుగా టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పెడుతున్నారు. అయితే, టీఎస్ఎంఎస్ఐడీసీకి మందుల సరఫరా చేసే కంపెనీలతో ఫార్మసిస్టులు, డాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. అవసరం లేకపోయినా ఫలానా మందు లు కావాలని ఇండెంట్ పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా ఫార్మసిస్టులే ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సేకరించి టీఎస్ఎంఎస్ఐడీసీకి నేరుగా మందుల ఇండెంట్ పెడుతున్నారు. ఆ మందులను వాడకపోతే ఎందుకు తెప్పించారో సర్కారుకు సమాధానం చెప్పాల్సి ఉం టుంది. అందుకే తెప్పించిన మందులను గడువుకు కొద్దినెలలు ముందుగా టీఎస్ఎంఎస్ఐడీసీకి వెనక్కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి మళ్లీ ఏవో కొన్ని పీహెచ్‌సీలకు అవి వెళ్తుంటాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇద్దరు ఫార్మసిస్టులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తస్కరించి టీఎస్ఎంఎస్ఐడీసీకి భారీగా మందుల కొనుగోలు ఇండెంట్ పెట్టారు. విషయాన్ని గ్రహించిన ఎంజీఎం వైద్యాధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. ఫార్మసిస్టులు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఒక నివేది కను డీఎంఈకి పంపారు. దాని ఆధారంగా ఆ ఫార్మ సిస్టులను సస్పెండ్ చేయాల్సిందిగా డీఎంఈ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆస్ప త్రులు పెట్టే మందుల ఇండెంట్లను పరిశీలించి, పర్యవేక్షించేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీలో ఒక వ్యవస్థ ఉం టుంది. ఆ అధికారులు ఇండెంట్లను పర్యవేక్షించాలి. కానీ వారు కూడా కంపెనీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. Government hospitals Pharmacists Passwords Indents Department of Health -
వైద్యులు అప్రమత్తంగా ఉండాలి
ఏటూరునాగారం వరంగల్ : వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశించారు. ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిని ఆయన సోమవారం ఆకస్మిక సందర్శించారు. మొదట ఆస్పత్రిలోకి వెళ్లిన ఆయన ఈసీజీ తీయించుకున్నారు. అనంతరం ఓపీ నమోదు, రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, మందుల కొరత తదితర విషయాలపై ఆరా తీశారు. నిత్యం ఓపీ 500ల నుంచి 800 వరకు నమోదవుతున్నట్లు వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. వేతనాలు రావడంలేదు.. తమకు ఐదు నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్ రాలేదని వచ్చాక ఇస్తామన్నారు. లేదంటే తన నిధుల నుంచి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునారికాని సమ్మక్క తనకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని, పింఛన్ రావడంలేదని చెప్పడంతో ఆమె ఆదార్‌కార్డును పరిశీలించిన కలెక్టర్ వయస్సు 65 సంవత్సరాలు ఉంటేనే పింఛన్ వస్తుందని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇంటి కోసం ప్రపోజల్ పెట్టాలని తహసీల్దార్ నరేందర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ శంకర్రావు, ఏఈఈ మధుకర్, వీఆర్ఓలు పాండ్య, రాములు తదితరులు ఉన్నారు. -
ఆన్లైన్లో ప్రభుత్వాస్పత్రుల సేవలు
తుర్కపల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వాస్పత్రులలో సేవలు ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తున్నామని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.ఆమోస్ తెలిపారు. శుక్రవారం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు, వివిధ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన జిల్లామలేరియా అధికారి ఓంప్రకాశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోఉగ్యకేంద్రాలకు ల్యాప్‌ట్యాప్‌లు ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి ఆరోగ్యకేంద్రం సేవలు ఇకనుంచి ఆన్లైన్లో పొందుపరుస్తామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాస్పత్రులలో కాన్పులు జరిగేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సిన్ల వివరాలను పొందుపరుస్తామన్నారు. కాన్పులకు ప్రోత్సాహకాలు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులకు వచ్చేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తున్నామని డీఎంహెచ్ఓ తెలిపారు. గతంలో రెండు కాన్పుల వరకే ప్రోత్సాహకాలిచ్చే వాళ్లమని, ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలిస్తున్నామని పేర్కొన్నారు. ఆ పరేషన్లు కాకుండా సుఖప్రసవాలు జరి గేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రసూతి సేవల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. 104 సేవలను కూడా పెంచి గ్రా మస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి వర్షకాలం ప్రారంభం.. జూన్, జూలై మాసాలల్లో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి ఓం ప్రకాశ్ అన్నా రు. నీళ్లు నిల్వ ఉండకుండా, డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే దోమలు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు. దోమల వల్ల మలేరియా, డెంగీ,, పైలేరియా, చికున్‌గున్యాలాంటి వ్యాధులు వస్తాయన్నారు. జాన్ నెలలో ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించి నిల్వ నీటిని, మురికి కాలువలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆవగాహన కల్పించి వాక్సిన్‌లిస్తామని తెలిపారు. వారి వెంట డాక్టర్ రవీందర్, సీహెచ్ఓ శివాజీమానే, లలిత, వసంత, షర్మిలా, ఫార్మాసిస్టు వేణు ఉన్నారు.