Government land grabbing
-
భూస్వాహా పాత్రలపై సీ‘ఐ’డీ
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ వీఆర్వో మోహన్‌గణేష్ పిళ్లై భూబకాసుర అవతారం వెనుక పలువురి హస్తం ఉన్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన వేల ఎకరాల కుంభకోణంలో కొందరు రెవెన్యూ ఉద్యోగుల పాత్ర సైతం ఉన్నట్లు భావిస్తున్నారు. రూ.500 కోట్ల భూబాగోతంలోని కుట్ర కోణం వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌లో కీలక భూమిక పోషించిన కలెక్టరేట్ సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకుని అక్రమ విక్రయాలకు తెరతీసిన మాజీ వీఆర్వో, టీడీపీ నేత అడవి రమణ లీలలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఒకే సర్వే నంబర్.. పలు విస్తీర్ణాల్లో భూములు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె సర్వే నంబర్ 459లో 10.99 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ భూ రికార్డుల్లో నమోదైంది. ఈ భూమి కూడా గుట్ట పోరంబోకు. మోహన్‌గణేష్ పిళ్లై అదే సర్వే నంబర్లో 160 ఎకరాలకుపైగా ఉన్నట్లు నమోదు చేశారు. మరో రికార్డులో అదే సర్వే నంబర్లో 45 ఎకరాలు ఉన్నట్లు ఉంది. నిషేధిత జాబితాలో 300 ఎకరాలు ఉన్నట్లు నమోదైంది. నిషేధిత జాబితాలో అదే సర్వే నంబర్లో 300 ఎకరాలు ఉన్నట్లు చూపుతున్న రికార్డు వెలుగులోకి అక్రమ విక్రయం నకిలీ రికార్డులు సృష్టించి కాజేసిన ప్రభుత్వ, అటవీ భూములను అమ్మి సొమ్ము చేసుకునేందుకు పిళ్లై అండ్ కో ప్రయత్నించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కొన్ని భూములకు సంబంధించి డాక్యుమెంట్లను మీ సేవ ద్వారా తీసుకుని, వాటికి నకిలీ పత్రాలను జతపరిచి టీడీపీ నేత అడవి రమణ ద్వారా విక్రయించేందుకు పిళ్లై సన్నాహాలు చేసినట్లు గుర్తించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందిన నాగమోహన్‌రెడ్డి అనే వ్యక్తిని బుట్టలో వేసుకుని తాము కాజేసిన భూములను అమ్మేందుకు రూ.55.60 లక్షలు తీసుకున్నట్లు ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు రాసుకున్న అగ్రిమెంట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. మరోవైపు టీడీపీ నేత అడవి రమణ చౌడేపల్లె మండలం చారాల గ్రామంలో రైతులకుæ కమ్యూనిటీ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద పంపిణీచేసిన భూముల్లో 35 ఎకరాలను, సీజేఎఫ్ఎస్ కాలనీకి కేటాయించిన 9 ఎకరాలను కబ్జా చేశాడని బాధితులు సోమవారం చౌడేపల్లె తహసీల్దార్ మాధవరాజుకు ఫిర్యాదు చేశారు. -
పేదలకేదీ జాగా..
వైఎస్ఆర్ జిల్లా , గాలివీడు: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు..కార్యకర్తలు ప్రభుత్వ భూమిని ఇష్టానుసారం కబ్జా చేసేశారు. వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిలో ఉన్నా పర్వాలేదన్న చందంగా సాగింది తీరు. వీరి వల్ల ఇప్పుడు అధికారులకు చిక్కులొచ్చిపడ్డాయి. ఉగాది నాటికి నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్న నేపథ్యంలో సర్కారు భూమి కాస్తా ఆక్రమణదారుల గుప్పెట్లో చిక్కుకోవడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. కబ్జాదారుల కబంధ హస్తాలనుంచి ఆ భూమికి విముక్తి కల్పించడానికి కొన్నిచోట్ల అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఉదాహరణకు గాలివీడు మండలంలో టీడీపీ నాయకులు గతంలో సర్కారు భూములను కాజేశారు. ఖరీదైన భూములను హస్తగతం చేసుకున్నారు. ఏకంగా పదెకరాలకు పైగా ఇలా కాజేశారని తాజాగా వెల్లడైంది. ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్లకు పైబడే ఉంటుంది.గాలివీడు–నూలివీడు ప్రాంతంలోనే కాదు మండలంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆక్రమణల గుట్టు రట్టు అవుతుందేమోనని టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నట్లు భోగట్టా. ⇔ గాలివీడు నుంచి కోనంపేట వెళ్లే మార్గంలోని పాలకేంద్రం సమీపాన,ఆర్ఆర్ జూనియర్ కళాశాల సమీపాన, ఉర్దూ పాఠశాల సమీంపంలోనూ,మదనపల్లె మార్గంలోనూ,బలిజపల్లె వద్ద ,కరిమిరెడ్డి గారిపల్లె,గోపనపల్లె రోడ్డు వద్ద వెలిగల్లు ప్రాజక్టు సమీపంలోనూ ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. ఇక్కడ సెంటు భూమి ధర సుమారు రూ.5లక్షల నుండి రూ.7లక్షల వరకు పలుకుతోంది. దీంతో గత అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. అధికారులను గుప్పిట్లోకి తెచ్చుకొని పాగా వేశారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని భావించిన వీరంతా ఇప్పుడు కంగు తిన్నారు. కొందరు తాము ఆక్రమించుకున్న భూముల్లో ప్లాట్లు వేసేశారు. దర్జాగావిక్రయించుకున్నారు. మరి కొందరు భూములను అమ్మేశారు. ఇప్పుడు అధికారులు పేదల కోసం ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడటంతో వీరందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తాము కూడగట్టుకున్నది పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో దళారీల పంటకూడా బాగానే పండిందనే ఆరోపణలూ ఉన్నాయి. భూముల కొన్నవారు అసలు విషయం తెలుసుకుని విక్రయించిన వారిమీద ఒత్తిడి తెస్తున్నారు. ముందే చూసుకోవాలి కదా అని టీడీపీ నాయకుల నుంచి బదులు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక బాధితులు కలవరపడుతున్నారు. గాలివీడు అంటే వ్యాపారాలకు కేంద్రబింధువు. సోలార్ ప్లాంట్,వెలిగల్లు ప్రాజెక్టుల ఫలితంగా ఈప్రాంత భూములకు గిరాకీ పెరిగింది. భూముల క్రమబద్ధీ్దకరణ ఎలా జరుగుతోందంటే.. గాలివీడు మండలంలో ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న రైతుల భూములను కొని రిజిష్ట్రేషన్ చేయించుకొన్న నేతలు వాటిలో ప్లాట్లు వేస్తున్నారు.ఇదే సందర్భంలో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి కలిపేసుకుని ప్లాట్లు వేస్తున్నారు. రైతుల భూముల సర్వే నెంబర్లను చూపి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. కొందరు అధికారులకు ఈ అక్రమ బాగోతం తెలిసినా అధికార పార్టీ నేతలకు భయపడి మిన్నకుండిపోయారు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణ సాగిపోయింది. ఈ ఆక్రమణల భూమి కొన్నవారందరూ ఇప్పుడు నష్టాలపాలవుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తే ఇక్కడ నిరుపేదలందరికీ ఇవ్వదగిన స్థలముందని తెలుస్తోంది. భూముల ఆక్రమణపై విచారిస్తామని తహసీల్దారు రహంతుల్లా తెలిపారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నాలు
మదనపల్లె : మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలోని అమ్మచెరువు మిట్ట సమీపంలో దాదాపు రూ.5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కదిరి-మదనపల్లె ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న గుట్టను జేసీబీ సహాయంతో చదును చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిని కాజేయాలని పథకం పన్నారు. మొత్తం 39 కుంటల స్థలాన్ని చదును చేసి ప్లాట్లుగా తయారు చేసి విక్రయించేం దుకు చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడం, నిర్లక్ష్యం కారణంగా ఈ స్థలాన్ని ఆక్రమించకుండా చర్యలు చేపట్టలేకపోతున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయలు రెవెన్యూ అధికారుల చేతులు మారిందనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ స్థలానికి సంబంధించి ఒక అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయని ఆరోపణలు ఉన్నాయి. కబ్జాదారులు కూడా తాము లక్షల రూపాయలు రెవెన్యూ అధికారులు ఖర్చు పెట్టామని బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. కబ్జాదారులకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుల అండదండలు అందిస్తున్నారు. ఈ పట్టాలను కూడా వారే సృష్టించి ఆధారాలను చూపుతున్నారు. ఇక్కడ ఒక్క కుంట స్థలం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం కబ్జాకు గురవుతున్న స్థలంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా ఆ స్థలం పూర్తిగా ప్రభుత్వానికి చెందిన డీకేటీ అంటున్నారు. మొత్తం 39 పట్టాలలో ఏ ఒక్కటి కూడా నిజం కాదని ప్రస్తుత రెవెన్యూ అధికారులు అంటున్నారు. గతంలో తహశీల్దార్ ఇచ్చాడని వారు చూపుతున్న పట్టాలు బోగస్ అని వివరించారు.