
పెద్ద ఉప్పరపాడులో కేవలం 10.99 ఎకరాలు ఉన్నట్లు చూపుతున్న రెవెన్యూ రికార్డు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ వీఆర్‌వో మోహన్‌గణేష్ పిళ్లై భూబకాసుర అవతారం వెనుక పలువురి హస్తం ఉన్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన వేల ఎకరాల కుంభకోణంలో కొందరు రెవెన్యూ ఉద్యోగుల పాత్ర సైతం ఉన్నట్లు భావిస్తున్నారు. రూ.500 కోట్ల భూబాగోతంలోని కుట్ర కోణం వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌లో కీలక భూమిక పోషించిన కలెక్టరేట్ సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకుని అక్రమ విక్రయాలకు తెరతీసిన మాజీ వీఆర్‌వో, టీడీపీ నేత అడవి రమణ లీలలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు.
ఒకే సర్వే నంబర్.. పలు విస్తీర్ణాల్లో భూములు
సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె సర్వే నంబర్ 459లో 10.99 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ భూ రికార్డుల్లో నమోదైంది. ఈ భూమి కూడా గుట్ట పోరంబోకు. మోహన్‌గణేష్ పిళ్లై అదే సర్వే నంబర్‌లో 160 ఎకరాలకుపైగా ఉన్నట్లు నమోదు చేశారు. మరో రికార్డులో అదే సర్వే నంబర్‌లో 45 ఎకరాలు ఉన్నట్లు ఉంది. నిషేధిత జాబితాలో 300 ఎకరాలు ఉన్నట్లు నమోదైంది.
నిషేధిత జాబితాలో అదే సర్వే నంబర్‌లో 300 ఎకరాలు ఉన్నట్లు చూపుతున్న రికార్డు
వెలుగులోకి అక్రమ విక్రయం
నకిలీ రికార్డులు సృష్టించి కాజేసిన ప్రభుత్వ, అటవీ భూములను అమ్మి సొమ్ము చేసుకునేందుకు పిళ్లై అండ్ కో ప్రయత్నించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కొన్ని భూములకు సంబంధించి డాక్యుమెంట్లను మీ సేవ ద్వారా తీసుకుని, వాటికి నకిలీ పత్రాలను జతపరిచి టీడీపీ నేత అడవి రమణ ద్వారా విక్రయించేందుకు పిళ్లై సన్నాహాలు చేసినట్లు గుర్తించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందిన నాగమోహన్‌రెడ్డి అనే వ్యక్తిని బుట్టలో వేసుకుని తాము కాజేసిన భూములను అమ్మేందుకు రూ.55.60 లక్షలు తీసుకున్నట్లు ధ్రువీకరించుకున్నారు.
ఈ మేరకు రాసుకున్న అగ్రిమెంట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. మరోవైపు టీడీపీ నేత అడవి రమణ చౌడేపల్లె మండలం చారాల గ్రామంలో రైతులకుæ కమ్యూనిటీ ల్యాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద పంపిణీచేసిన భూముల్లో 35 ఎకరాలను, సీజేఎఫ్‌ఎస్ కాలనీకి కేటాయించిన 9 ఎకరాలను కబ్జా చేశాడని బాధితులు సోమవారం చౌడేపల్లె తహసీల్దార్ మాధవరాజుకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment