ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి తరహాలో మరో భారీ మోసం వెలుగుచూసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగజ్జనని చిట్స్ పేరుతో టీడీపీ నేతలు ఆర్థిక నేరానికి పాల్పడిన విషయం బట్టబయలైంది. 1982 చిట్‌ఫండ్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారం డిపాజిట్లు సేకరించి, వాటిని ఇతర వ్యాపారాలకు, వడ్డీలకు మళ్లించి అక్రమాలకు తెరతీసిన విషయం సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ చిట్‌ఫండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు–ఏ1, డైరెక్టర్‌గా ఉన్న ఆయన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్–ఏ2 (రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త)లను సీఐడీ అధికారులు రాజమహేంద్రవరంలో ఆదివారం అరెస్టుచేశారు.
వీరితోపాటు మరో డైరెక్టర్ అయిన ఆదిరెడ్డి అప్పారావు కుమార్తె ఆదిరెడ్డి వెంకట జ్యోత్స్నలపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120బి, 477 (ఎ) రెడ్‌విత్ 34, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్–5, కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీఐడీ విభాగానికి కొన్నినెలల క్రితమే ఫిర్యాదులొచ్చాయి.
అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణ కావడంతో చిట్ రిజిస్ట్రార్ ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో జగజ్జనని చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. వీటిపై సంస్థ బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) సరైన వివరణ కూడా ఇవ్వలేకపోవడంతో సీఐడీ అధికారులు కేసును లోతుగా విచారించి అవకతవకలను నిర్ధారించారు.
యథేచ్చగా ఆర్థిక అక్రమాలు..
జగజ్జనని చిట్ ఫండ్స్ కంపెనీ కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సీఐడీ తనిఖీల్లో బట్టబయలైంది. ఆ కంపెనీ ఎండీ, డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మళ్లించి సొంత ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లుగా ఆధారాలను గుర్తించారు. సీఐడీ అధికారులు గుర్తించిన కొన్ని అంశాలివీ..
► చిట్‌ఫండ్స్ కంపెనీలు ఇతర వ్యాపారాలు చేయడం చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. కానీ, జగజ్జనని సంస్థ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ, అక్రమంగా రుణాలు మంజూరు చేస్తూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది. 2018 నుంచి 2023 వరకు భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు.. వాటిపై వడ్డీలు చెల్లించినట్లు గణాంకాలతో సహా వెల్లడైంది. అదే రీతిలో చందాదారుల సొమ్ముతో భారీగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. తద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడైంది.
► చిట్టీల నిర్వహణలో జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతోంది. ప్రతి చిట్టీలోనూ యాజమాన్య వాటా టికెట్లతోపాటు మరికొన్ని టికెట్లను కూడా కంపెనీ తమ పేరిట ఉంచుతోంది. కానీ, ఆ టికెట్లపై ప్రతినెలా చెల్లించాల్సిన చందాను చెల్లించడంలేదు. ఇతర చందాదారులు పాడిన చిట్టీ పాటల ద్వారా వచ్చే డివిడెండ్‌ను తమ ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇక ఆ టికెట్ల చిట్టీ పాటల ప్రైజ్‌మనీని కూడా జమచేసుకుంటోంది. ఒక చిట్టీ గ్రూప్‌లోని చందా సొమ్మును మరో చిట్టీ గ్రూప్‌లో బుక్ అడ్జస్ట్‌మెంట్ల ద్వారా కనికట్టు చేస్తోంది. అంటే ఒక్క రూపాయి కూడా చందా చెల్లించకుండా అక్రమంగా ఆర్థిక ప్రయోజనం పొందుతోంది.
► చిట్టీ పాటల నిర్వహణలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. 2022 మే నుంచి ఆగస్టు వరకు సంస్థ నిర్వహించిన చిట్టీ పాటల వేలం రికార్డులను పరిశీలించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. చిట్టీ పాట పాడిన వారికి ఇచ్చే మొత్తాన్ని (ప్రైజ్‌మనీ) వాస్తవానికి చిట్టీ పాట నిర్వహించిన తేదీ కంటే ముందే చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు వెల్లడించాయి. అంటే చిట్టీ పాటల నిర్వహణ కంటే ముందే ఆ మొత్తాన్ని కొందరికి చెల్లిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహిస్తున్న చిట్టీ పాటలు పూర్తిగా బోగస్ అని నిరూపితమైంది.
► ప్రతినెలా 41 చిట్ గ్రూపులను నిర్వహిస్తూ రూ.7,61,50,000 వార్షిక టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్నట్లుగా రికార్డుల్లో సంస్థ చూపిస్తోంది. కానీ, ఆ సంస్థ కాకినాడలోని అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్‌కు సమర్పించిన చిట్ వేలం రికార్డులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ సంస్థ ప్రతినెలా క్రమం తప్పకుండా చిట్ వేలాన్ని నిర్వహించడంలేదన్నది వెల్లడైంది. 2022, జనవరి నుంచి 2023 జనవరి వరకు రికార్డులను పరిశీలిస్తే ఒక్కనెల తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ తక్కువ చిట్ వేలమే నిర్వహించింది.
► ఈ కంపెనీ టర్నోవర్‌కు బ్యాంకులో జమచేస్తున్న చందా మొత్తాలు భిన్నంగా ఉన్నాయి. ప్రతినెలా రూ.7.61 కోట్ల టర్నోవర్ అని కంపెనీ చెబుతోంది. అంటే.. డివిడెండ్ మొత్తం మినహాయించుకుంటే ప్రతినెలా రూ.5కోట్లు చొప్పున ఏడాదికి చందా మొత్తాలే రూ.60కోట్లు జమచేయాలి. కానీ, జమచేస్తున్న మొత్తం ఆ దరిదాపుల్లో కూడా లేదు.
► చిట్టీల వేలం సొమ్ము చెల్లింపు ముసుగులో జగజ్జనని చిట్‌ఫండ్స్ నల్లధనాన్ని చలామణిలోకి తెస్తోంది. 49 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ మొత్తం రూ.11,76,82,000 చెల్లింపులను పరిశీలించారు. వాటిలో 21 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ రూ.4,68,45,753ను బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన 28 చిట్టీల వేలం పాటల ప్రైజ్‌మనీ రూ.7,08,36,247ను నగదు రూపంలో చెల్లించినట్లు చెప్పారు. నగదు రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. అంటే.. నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినట్లు వెల్లడైంది.
► చిట్‌ఫండ్ కంపెనీ అన్ని వ్యవహారాలు నగదులోనే నిర్వహిస్తోంది. అంటే చందాల వసూళ్లు, చిట్ పాట మొత్తం చెల్లింపులన్నీ నగదులోనే నిర్వహిస్తోంది. ఇది ఆదాయపన్ను చట్టానికి విరుద్ధం.
► బ్యాంకు ఖాతాల్లో సంస్థ భారీగా నగదు డిపాజిట్లు కూడా చేస్తోంది. చిట్ వసూళ్లతో ఆ డిపాజిట్లు సరిపోలడంలేదు. ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లు నగదు రూపంలోనే చేస్తున్నారు.
► చందా చెల్లించడంలేదని చెబుతున్న చిట్‌ల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించడంలేదు.
► మరోవైపు.. జగజ్జనని చిట్‌ఫండ్స్ వేలానికి సంబంధించిన మినిట్స్ రికార్డులకు బ్యాంకు లావాదేవీలు భిన్నంగా ఉన్నాయి. మచ్చుక్కి 11 చిట్టీ పాటల మినిట్స్‌ను సీఐడీ అధికారులు పరిశీలించారు. అందులో పేర్కొన్న మొత్తం కంటే వాస్తవంగా బ్యాంకు ద్వారా చెల్లించిన మొత్తం తక్కువగా ఉంది. అంటే.. చందాదారులను ఆ చిట్‌ఫండ్స్ సంస్థ మోసం చేస్తోందని వెల్లడైంది.
► చిట్‌ఫండ్ చట్టంలో పేర్కొన్న రికార్డులను జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహించడంలేదు. అలాగే, చట్టంలో పేర్కొన్న వార్షిక బ్యాలన్స్ షీట్ పార్ట్–1, పార్ట్–2లనూ సమర్పించడంలేదు.
సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే భవానీ
అడ్డం తిరిగిన అప్పారావు..
తనను అరెస్టు చేసేందుకు వీల్లేదంటూ సీఐడీ అధికారులతో ఆదిరెడ్డి అప్పారావు వాదనకు దిగారు. జీఎస్టీ ఎగవేత విషయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చర్యలను నియంత్రిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపుతూ తనను అరెస్టుచేయడం అన్యాయమని వాదించారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనకు సీఐడీ అధికారులు స్పష్టతనిచ్చి అరెస్టుచేశారు.
సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా
టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ల అరెస్టు నేపథ్యంలో రాజమహేంద్రవరం సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరంలో జరగబోయే మహానాడును అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. అప్పారావు, శ్రీనివాస్‌ను అన్యాయంగా అరెస్టుచేశారని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. సీఐడీ కార్యాలయంలో భర్త, మామను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పరామర్శించారు.
అనుమతి లేకుండా ఆఫీసులు
రాజమహేంద్రవరంలోని వీఎల్ పురం, తిలక్ రోడ్డులోని డోర్ నంబర్ 79/2–4/3 చిరునామాతో చిట్‌ఫండ్ కార్యాలయం నిర్వహించేందుకు జగజ్జనని చిట్‌ఫండ్స్ అనుమతి తీసుకుంది. కానీ, అనుమతి లేకుండా 86–26–13/1 తిలక్ రోడ్డు చిరునామాతో ఉన్న భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. దీనిపై చిట్ రిజిస్ట్రార్‌కు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అలాగే, జగజ్జనని చిట్‌ఫండ్స్ రాజమహేంద్రవరంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి తీసుకుంది. అందుకు విరుద్ధంగా కాకినాడ జగన్నాథపురంలో అనధికారికంగా మరో బ్రాంచి కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇది ఖాతాదారులను మోసం చేయడమే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment