సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ – జనసేన పార్టీలకు సంబంధించినంత వరకూ రాజమహేంద్రవరం రూరల్ రాజకీయం రంజుగా మారుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న పీటముడి ఇంకా వీడటం లేదు. ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తానని జనసేన నుంచి ఆ పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్.. కాదు కాదు.. ఈ సీటు తనదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో రూరల్ సీటు కేటాయింపుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ సస్పెన్స్ ఏర్పడింది.
ముందుగా ప్రకటించుకున్నట్టు దుర్గేష్ పోటీ చేస్తారా.. లేక గోరంట్లకు వదిలేస్తారా అనే విషయం ఎటూ తేలడం లేదు. ఇటీవల మండపేటలో పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించిన వెంటనే.. రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో పోటీపై పవన్ కల్యాణ్ కూడా హడావుడిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజమహేంద్రవరం రూరల్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు స్పష్టత ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు. దీంతో రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఓసారి సై.. మరోసారి నైనై..
ఇదిలా ఉండగా జనసేన నేత దుర్గేష్ ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాసేపు పోటీ చేస్తానని, మరికాసేపు పోటీ చేయనని ఆయన సంకేతాలిస్తున్నారు. జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ స్థానం నుంచి దుర్గేష్ బరిలోకి దిగడం ఖాయమని తొలుత సంకేతాలు వెలువడ్డాయి. ఆయన సైతం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి తానే అభ్యర్థినని ప్రకటించుకుని, ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. అంతలోనే ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యల కారణంగా రానున్న ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారని చెబుతున్నారు.
దీంతో రూరల్ రాజకీయం తాజాగా మరో మలుపు తిరిగింది. వాస్తవానికి రూరల్ సీటు మరోసారి ఆశిస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల, దుర్గేష్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ ఇద్దరు నేతలూ రహస్యంగా కలిసి చర్చించుకుని, ఓ నిర్ణయానికి వచ్చారని, అప్పటి నుంచే ఎన్నికల్లో పోటీకి దుర్గేష్ సుముఖంగా లేరన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదునుగా బుచ్చయ్య చౌదరి తన ఎమ్మెల్యే స్థానం తనకే పదిలమని, రూరల్ సీటును తన నుంచి దూరం చేసే దమ్ము ఎవరికై నా ఉందా? అంటూ ఆవేశంతో ప్రకటనలు కూడా చేశారు. తాను ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొంది, మంత్రి కావడం ఖాయమనే లెక్కలు వేసుకునేంత వరకూ వెళ్లారాయన.
నేతల ఒత్తిడితో మళ్లీ సై
పోటీకి దుర్గేష్ దూరమవుతున్న సంగతి తెలుసుకు న్న రూరల్ నియోజకవర్గ జనసేన నేతలు ఆయనపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సువర్ణ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారని వాదనకు దిగారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్న మీ కలను మీ రే నాశనం చేసుకుంటారా?’ అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా దుర్గే ష్ ససేమిరా అని భీష్మించారు. ‘మీరు చేయకపోతే మరో నేతను రంగంలోకి దింపుతాం. అంతే కానీ సీటు మాత్రం త్యాగం చేసుకునే పరిస్థితి తీసుకురాం’ అని స్పష్టం చేశారు. స్వపక్ష నేతల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయిన దుర్గేష్ ఆత్మరక్షణలో పడ్డారు. పార్టీ శ్రేణులను విస్మరిస్తే రాజకీయ భవిష్యత్తు సమాధి అయ్యే ప్రమాదం ఉండటంతో దిక్కు తోచని పరిస్థితిలో చేసేది లేక పోటీకి సై అన్నారు.
సిటీపై గోరంట్ల కన్ను
దుర్గేష్ తాజా నిర్ణయంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రత్యమ్నాయ ఆలోచనలో పడ్డారు. రూరల్ చేజారిన పక్షంలో తనకు అనువైన రాజమహేంద్రవరం సిటీలోనైనా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమవుతున్నారు.
ఆదిరెడ్డి వర్గంలో అలజడి
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు.. రూరల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తమ ఆశలకు ఎసరు పెడుతుందేమోనని మరోసారి రాజమహేంద్రవరం సిటీ సీటు ఆశిస్తున్న ఆదిరెడ్డి అప్పారావు వర్గం ఆందోళన చెందుతోంది. తన కుమారుడు వాసును ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆదిరెడ్డి అప్పారావు కల. దీనికోసమే ఆయన తన కోడలు, ప్రస్తుత ఎమ్మెల్యే భవానీని ప్రజలకు దూరం పెట్టారు. ఆమె బదులు ఆమె భర్త, తన తనయుడు వాసు ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కలను గోరంట్ల నాశనం చేస్తారేమోనని అప్పారావు అంతర్మధనం చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు వద్ద పంచాయతీ పెట్టారు.
‘టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది. ఇంక మీకేం చేయగలను? మీ స్థాయిలో మీరు చూసు కోండి’ అంటూ అచ్చెన్నాయడు చేతులెత్తేయడంతో ఆదిరెడ్డి వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి ఆదిరెడ్డి కుటుంబం వెన్నంటి నిలిచింది. లోకేష్‌తో ఆదిరెడ్డి వాసు సన్నిహిత సంబంధాలు నెరిపి, ఆయన దృష్టిలో పడ్డారు.
ఆ నేపథ్యంలో ఇక తనకు ఎవరూ అడ్డురానన్న ధైర్యంతో సిటీలో పర్యటనలు మొదలు పెట్టారు. ఇటువంటి సమయంలో బుచ్చయ్య ప్రయత్నాలు ఆదిరెడ్డి కుటుంబంలో అలజడి రేపుతున్నాయి. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందనని, చివరకి తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆదిరెడ్డి వర్గం ఆందోళన చెందుతోంది. రాజమహేంద్రవరం రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులపై కాతేరులో సోమవారం నిర్వహించిన రా.. కదలిరా సభలో సైతం చంద్రబాబు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఆయన ఉదాశీన వైఖరితో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment