సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత టీడీపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఆర్థిక నేరాల్లో తెలుగు తమ్ముళ్లది అందె వేసిన చెయ్యేనన్న విషయం ఆదిరెడ్డి అండ్ సన్ అరెస్టుతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ అందరిదీ ఒకటే మాట ఒకటే బాటగా అవినీతి రాజ్యమేలింది. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా ప్రజలను నిలువునా దోచుకున్నారు. ఇది చాలదా అన్నట్టు ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి కోట్లకు కోట్ల రూపాయలు వసూలు చేసి పలాయనం చిత్తగించిన వారూ ఉన్నారు.
వెంటాడుతున్న పాపాలు
చిట్టీలు, ఫైనాన్స్‌ల పేరుతో ప్రజలను జలగల్లా పీక్కుతిన్న నేతలు ఒక్కొక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం కటకటాల్లో వేస్తోంది. తాజాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్సీ అప్పారావులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. చిట్‌ఫండ్ చట్టాన్ని తుంగలోకి తొక్కి, ఆర్థిక లావాదేవీల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్న అభియోగాలపై వీరిని అరెస్టు చేశారు. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయని పెద్దలు అంటారు. ఇప్పుడు ఆదిరెడ్డి విషయంలోనూ అదే జరిగిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చిట్టీల పేరుతో చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలన్నింటినీ నగదు రూపంలో నిర్వహించడం.. ఒకచోట కార్యాలయం రిజిస్టర్ చేసి, మరోచోట నిర్వహించడం.. అసలు అనుమతి లేకుండానే కాకినాడలో ప్రాంతీయ కార్యా లయం నిర్వహించడం వంటి అనేక అవకతవకలకు పాల్పడి, ప్రజలను మోసగించారని సీఐడీ ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. లోతైన విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తండ్రీకొడుకులకు ఉచ్చు బిగుస్తుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు.
ఇంకా ఎన్నో..
► తెలుగు తమ్ముళ్ల అక్రమాల్లో కొన్ని బయట పడగా, వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయని అంటున్నారు. ప్రజలను మోసగించి బాధితులు, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న తెలుగు తమ్ముళ్లు చాలా మందే ఉన్నారు.
► తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రెండో వార్డు టీడీపీ ఇన్‌చార్జి అక్కాబత్తుల చిన్నారావు ఇలానే చిట్టీల పేరుతో ప్రజలను నిలువునా ముంచేసి పరారైపోయాడు. ఏసీఆర్ చిట్స్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టి, రెండేళ్ల క్రితం బోర్డు తిప్పేశాడు. ఈ తెలుగు తమ్ముడి చేతిలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 5 వేల మంది మోసపోయారు. చిన్నారావు ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు కొల్లగొట్టేశాడు. అతడి మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
► కోనసీమలో 1996 తుపాను అనంతరం బాధితులకు వచ్చిన రేషన్ బియ్యాన్ని నాటి ఎమ్మెల్యే దివంగత పులపర్తి నారాయణమూర్తి అడ్డంగా బొక్కేసినట్టు వచ్చిన ఆరోపణలు అప్పట్లో పెను సంచలనమే అయ్యాయి.
► ఉప్పలగుప్తం మండలానికి చెందిన మిల్లర్, అప్పటి జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ టీడీపీ అధికారంలో ఉండగా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం దారి మళ్లించాడు. టీడీపీ నేతలు గట్టి ఒత్తిడి తీసుకువచ్చినా ముక్కుసూటిగా పోయిన అప్పటి సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఆ తెలుగు తమ్ముడి అక్రమాల దందాలో మార్పు రాలేదు. మరోసారి రేషన్ బియ్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంలో అతడిపై ఉప్పలగుప్తం పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేయడం గమనార్హం. ఈవిధంగా నాటి నుంచి నేటి వరకూ టీడీపీలో చిన్నాచితకా నాయకుల నుంచి బడా నేతల వరకూ ఇదే పంథాలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.
‘సహకారం’తో అక్రమాలు
ఇప్పుడంటే ఆదిరెడ్డి జగజ్జనని చిట్‌ఫండ్స్ బండారం బయటపడింది కాబట్టి సీఐడీ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. ఇంతకంటే ముందే టీడీపీ ఏలుబడిలో తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)లో జరిగిన కోట్లాది రూపాయల ఆర్థిక కుంభకోణం ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలియంది కాదు. నాటి చైర్మన్‌గా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దివంగత వరుపుల రాజాపై సీఐడీ కేసు నమోదు చేయడం, ఆయన అరెస్టుకు ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, లంపకలోవ, లింగంపర్తి, కిర్లంపూడి, గండేపల్లి, కానవరం, భూపాలపట్నం, మొల్లేరు, రావుపాలెం, వద్దిపర్రు తదితర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సొసైటీల అధ్యక్షులు కోట్లాది రూపాయలు దారి మళ్లించేసి రైతుల నోట మట్టి కొట్టారు. నాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అక్రమార్కులపై వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ విచారణ జరిపిస్తోంది.
వైరివర్గం ఖుషీ
ఆదిరెడ్డి తండ్రీ తనయుల అరెస్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం ఎదుటి వారిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఆ పార్టీ అగ్రనేతలకు వీరి అరెస్టులతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. చిట్టీల పేరుతో చేసిన మోసాన్ని ఆధారాలతో సహా సీఐడీ బయట పెట్టడం వారికి మింగుడు పడటం లేదు. మొదటి నుంచీ రాజకీయంగా ఆదిరెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం మాత్రం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఎక్కడా బయట పడకుండా అంతర్గతంగా సంబరాలు చేసుకుంటోంది. రాజమహేంద్రవరం సిటీపై ఆధిపత్యం కోసం ఇటు ఆదిరెడ్డి, అటు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వర్గాలు చాలాకాలం నుంచి నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. పార్టీపై గుత్తాధిపత్యాన్ని అధిష్టానం తమ కుటుంబానికే రాసి ఇచ్చేసినట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆదిరెడ్డికి తగిన శాస్తే జరిగిందని ఆయన వైరి వర్గంగా ముద్రపడిన గోరంట్ల అనుయాయులు అంటున్నారు. అలాగని ఆదిరెడ్డి అరెస్టులపై పెదవి విప్పడానికి ఆ పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment