
పాలడైరీ వద్ద వంక పొరంబోకు ఆక్రమించి టీడీపీ నేతలు వేసిన ప్లాట్లు
వైఎస్‌ఆర్ జిల్లా , గాలివీడు: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు..కార్యకర్తలు ప్రభుత్వ భూమిని ఇష్టానుసారం కబ్జా చేసేశారు. వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిలో ఉన్నా పర్వాలేదన్న చందంగా సాగింది తీరు. వీరి వల్ల ఇప్పుడు అధికారులకు చిక్కులొచ్చిపడ్డాయి. ఉగాది నాటికి నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్న నేపథ్యంలో సర్కారు భూమి కాస్తా ఆక్రమణదారుల గుప్పెట్లో చిక్కుకోవడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. కబ్జాదారుల కబంధ హస్తాలనుంచి ఆ భూమికి విముక్తి కల్పించడానికి కొన్నిచోట్ల అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఉదాహరణకు గాలివీడు మండలంలో టీడీపీ నాయకులు గతంలో సర్కారు భూములను కాజేశారు. ఖరీదైన భూములను హస్తగతం చేసుకున్నారు. ఏకంగా పదెకరాలకు పైగా ఇలా కాజేశారని తాజాగా వెల్లడైంది. ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్లకు పైబడే ఉంటుంది.గాలివీడు–నూలివీడు ప్రాంతంలోనే కాదు మండలంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆక్రమణల గుట్టు రట్టు అవుతుందేమోనని టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నట్లు భోగట్టా.
⇔ గాలివీడు నుంచి కోనంపేట వెళ్లే మార్గంలోని పాలకేంద్రం సమీపాన,ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల సమీపాన, ఉర్దూ పాఠశాల సమీంపంలోనూ,మదనపల్లె మార్గంలోనూ,బలిజపల్లె వద్ద ,కరిమిరెడ్డి గారిపల్లె,గోపనపల్లె రోడ్డు వద్ద వెలిగల్లు ప్రాజక్టు సమీపంలోనూ ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. ఇక్కడ సెంటు భూమి ధర సుమారు రూ.5లక్షల నుండి రూ.7లక్షల వరకు పలుకుతోంది. దీంతో గత అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. అధికారులను గుప్పిట్లోకి తెచ్చుకొని పాగా వేశారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని భావించిన వీరంతా ఇప్పుడు కంగు తిన్నారు. కొందరు తాము ఆక్రమించుకున్న భూముల్లో ప్లాట్లు వేసేశారు. దర్జాగావిక్రయించుకున్నారు. మరి కొందరు భూములను అమ్మేశారు. ఇప్పుడు అధికారులు పేదల కోసం ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడటంతో వీరందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తాము కూడగట్టుకున్నది పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో దళారీల పంటకూడా బాగానే పండిందనే ఆరోపణలూ ఉన్నాయి. భూముల కొన్నవారు అసలు విషయం తెలుసుకుని విక్రయించిన వారిమీద ఒత్తిడి తెస్తున్నారు. ముందే చూసుకోవాలి కదా అని టీడీపీ నాయకుల నుంచి బదులు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక బాధితులు కలవరపడుతున్నారు. గాలివీడు అంటే వ్యాపారాలకు కేంద్రబింధువు. సోలార్ ప్లాంట్,వెలిగల్లు ప్రాజెక్టుల ఫలితంగా ఈప్రాంత భూములకు గిరాకీ పెరిగింది.
భూముల క్రమబద్ధీ్దకరణ ఎలా జరుగుతోందంటే..
గాలివీడు మండలంలో ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న రైతుల భూములను కొని రిజిష్ట్రేషన్ చేయించుకొన్న నేతలు వాటిలో ప్లాట్లు వేస్తున్నారు.ఇదే సందర్భంలో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి కలిపేసుకుని ప్లాట్లు వేస్తున్నారు. రైతుల భూముల సర్వే నెంబర్లను చూపి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. కొందరు అధికారులకు ఈ అక్రమ బాగోతం తెలిసినా అధికార పార్టీ నేతలకు భయపడి మిన్నకుండిపోయారు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణ సాగిపోయింది. ఈ ఆక్రమణల భూమి కొన్నవారందరూ ఇప్పుడు నష్టాలపాలవుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తే ఇక్కడ నిరుపేదలందరికీ ఇవ్వదగిన స్థలముందని తెలుస్తోంది. భూముల ఆక్రమణపై విచారిస్తామని తహసీల్దారు రహంతుల్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment