Government land occupied
-
అమ్మో.. కొమ్మాలపాటి.. రత్నాలచెరువులో వెంచర్లు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాలచెరువును కొల్లగొట్టిన వైనం ఇది. సాగుచేసుకోమని పేదలకు ఇచ్చిన ఈ చెరువు భూమి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఈ భూముల్ని కొని వెంచర్‌వేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సుమారు రూ.70 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. పట్టణంలోని 134 సర్వే నంబర్లో 94 ఎకరాల విస్తీర్ణంలో రత్నాలచెరువు ఉంది. కొన్నేళ్లుగా పేదలు కొందరు గుడిసెలు వేసుకుని నివసించసాగారు. ఇదే ఆక్రమణదారులకు అడ్డాగా మారింది. పేదల పేరుతో పెద్దలు సుమారు 24 ఎకరాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు గ్రామంలో 2004కు ముందు పొలాలు కొని అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెంచర్ వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్లాట్లు వాయిదాల పద్ధతిలో విక్రయించారు. వాయిదాలు కట్టిన వందలాది మందికి ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయకుండా తిప్పుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అదే వెంచర్‌కు దగ్గరలో ఉన్న రత్నాలచెరువుపై ఆయన కన్నుపడింది. ఈ చెరువు భూమిని సాగుచేసుకునేందుకు ప్రభుత్వం కొంతమంది ఎస్సీలకు పట్టాలిచ్చింది. పట్టాలు ఇచ్చిన భూమిని విక్రయించకూడదని నిబంధన విధించింది. అయినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి ఎస్సీల వద్ద నుంచి 7.5 ఎకరాలను రూ.35 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూమిలో ప్లాట్లు వేసి ప్రజలకు విక్రయించారు. రిజిస్ట్రేషన్లు చేసి రూ.70 కోట్ల మేర సొమ్ము చేసుకున్నారు. ఈ భూమిని తనకే ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి గత టీడీపీ ప్రభుత్వ పాలనలో మంత్రి లోకేశ్ రత్నాలచెరువు భూమి మొత్తాన్ని ఐటీ కంపెనీల పేరుతో తమ అనుచరులకు కట్టపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అప్పటి ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రం ఇచ్చారు. చెరువులో తాను కొనుగోలు చేసిన 7.5 ఎకరాలను తనకు వదిలిపెట్టాలని కోరారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తన వద్ద ప్లాట్లు కొన్నవారు తనను డబ్బులు తిరిగి ఇవ్వమంటారనే ఆందోళనతోనే ఆయన ఈ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికీ ఆ భూమిలో కొంత కొమ్మాలపాటి చేతుల్లోనే ఉంది. రత్నాలచెరువు నకిలీ దస్తావేజుల అక్రమాలపై అధికారులు విచారణ జరుపుతుండడంతో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ చెరువు భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
సర్కారీ స్థలం.. వివాదాస్పదం!
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు స్థలాలపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. వాస్తవికతకు, ల్యాండ్ బ్యాంక్ లెక్కలకు పొంతన లేకపోవడంతో మార్పులుచేర్పులకు సిద్ధమైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం జిల్లాలో దాదాపు 90.18 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దీని విలువ రూ.3,000 కోట్లకు పైనే ఉంటుంది. అయితే ఈ భూమిలో సుమారు 58శాతం వివాదాల్లో చిక్కుకుంది. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఆయా స్థలాలు వివాదాస్పదంగా మారాయి. అధికారుల ఉదాసీన వైఖరితో మరికొన్ని స్థలాలు క్రమబద్ధీకరణకు నోచుకున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ బ్యాంక్‌లోని లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతనలేకుండా పోయింది. దీన్ని గమనించిన రెవెన్యూ యంత్రాంగం ల్యాండ్ బ్యాంక్ స్థలాల అప్డేషన్కు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏడుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. 16 మండలాలు.. 95 పార్శిల్స్ హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 95 ల్యాండ్ పార్శిళ్లు ఉండగా... మొత్తం 4,36,471.2 చదరపు గజాల ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇందులో 72 పార్శిళ్లలోని 1,75,595.2 చదరపు గజాల స్థలం ఎలాంటి వివాదాలు లేకుండా సవ్యంగా ఉండగా... మిగిలిన 23 పార్శిళ్లలోని 2,57,972 చదరపు గజాల స్థలం వివాదాల్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా తిరుమలగిరిలో కేవలం 4 పార్శిళ్లలో 1,84,774.91 చదరపు మీటర్ల ఖాళీ స్థలం ఉండగా... షేక్‌పేటలో 8 పార్శిళ్లలో 74,073.3 చదరపు మీటర్ల స్థలాలు ఉన్నాయి. నాంపల్లి, చార్మినార్ మండల పరిధిలో గజం స్థలం కూడా ఖాళీగా లేకపోగా... అమీర్‌పేటలో ఒక్క పార్శిల్లో 751 మీటర్ల ఖాళీ స్థలం ఉండగా అది కాస్త వివాదాల్లో చిక్కుకుంది. అత్యధికంగా గోల్కొండలో 26, ఆసీఫ్‌నగర్‌లో 23 పార్శిళ్లు ఉన్నాయి. నాలుగు విభాగాలు... ల్యాండ్ బ్యాంక్‌లోని పార్శిళ్లను నాలుగు విభాగాలుగా విభజించి మార్పులుచేర్పులు చేస్తున్నారు. ఏ కేటగిరీగా ఒకటికి రెండుసార్లు నమోదైన స్థలాలు, బీ కేటగిరీగా క్రమబద్ధీకరణ స్థలాలు, సీ కేటగిరీగా డిపార్ట్మెంట్లకు కేటాయించిన స్థలాలు, డీ కేటగిరీగా కోర్టు వివాదాల్లోని స్థలాలుగా విభజిస్తున్నారు. ఈ నెల 15లోగా ల్యాండ్ బ్యాంక్‌ను పూర్తిస్థాయిలో అప్డేట్ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
ఉప్పుటేరునూ మింగేశారు
భీమవరం : ప్రభుత్వ భూములను కబ్జా చేయడంలో అక్రమార్కులకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. చివరికి ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలోని భూములనూ మింగేస్తున్నారు. భూములను కబ్జా చేసి దర్జాగా చెరువులు తవ్వి రొయ్యలను సాగుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మత్తు నిద్రను వీడడం లేదు. దొంగపిండి, లోసరిలో 100 ఎకరాల కబ్జా భీమవరం మండలంలోని కృష్ణాజిల్లా సరిహద్దు గ్రామాలైన దొంగపిండి, లోసరిలు ఉప్పుటేరును ఆనుకుని ఉన్నాయి. డ్రెయిన్ మధ్యలో గట్టు పక్కన 120 ఎకరాల బీడు భూములు ఉన్నాయి. వీటిలో 100 ఎకరాలను అక్రమార్కులు కబ్జా చేసేశారు. చెరువులు తవ్వేసి రొయ్యలను సాగు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. మిగిలిన భూమిపైనా కన్నేసి దాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. దొంగపిండి నుంచి లోసరి వరకు ఉన్న ఉప్పుటేరులో గట్టును ఆనుకుని కిక్కిస, మడ అడవులు, ఆల్చీ దుబ్బులతో కూడిన బీడు భూములు ఉన్నాయి. చెట్లను నరికివేసి చెరువులు తవ్వేయడంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు జిల్లాల మధ్య తగాదా ఉప్పుటేరు మధ్యలో ఉన్న బీడు భూముల్లో పాగా వేసేందుకు అటు కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, లక్ష్మీపురం గ్రామస్తులు ఇటు పశ్చిమలోని లోసరి, దొంగపిండి గ్రామాల మధ్య తగవు నడుస్తోంది. ఇటీవల పల్లిపాలెం గ్రామస్తులు లోసరి వైపు ఉన్న డ్రెయిన్ భూమిలోకి వచ్చి జెండాలు పాతి భూఆక్రమణ చేసేందుకు ప్రయత్నించగా ఇటువైపు గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరు జిల్లాలలోని గ్రామాల మధ్య ఆ భూములు మావంటే మావని వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు సర్వే చేయించి అధికభాగం లోసరిలోనే ఉన్నాయని తేల్చారు. జోరుగా పంపకాలు లోసరి సమీపంలో ఉప్పుటేరులో ఉన్న సుమారు 50 ఎకరాల బీడు భూములను గ్రామస్తులు కుటుంబాలలోని రేషన్‌కార్డుల వారీగా గుర్తించి పంపకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. పోరంబోకు భూమిలో పాగా వేసి వాటిలో కూడా రొయ్యల సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.