టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి కొనుగోలు చేసిన రత్నాలచెరువులోని ఏడున్నర ఎకరాల భూమి
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాలచెరువును కొల్లగొట్టిన వైనం ఇది. సాగుచేసుకోమని పేదలకు ఇచ్చిన ఈ చెరువు భూమి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఈ భూముల్ని కొని వెంచర్‌వేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సుమారు రూ.70 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. పట్టణంలోని 134 సర్వే నంబర్‌లో 94 ఎకరాల విస్తీర్ణంలో రత్నాలచెరువు ఉంది. కొన్నేళ్లుగా పేదలు కొందరు గుడిసెలు వేసుకుని నివసించసాగారు. ఇదే ఆక్రమణదారులకు అడ్డాగా మారింది. పేదల పేరుతో పెద్దలు సుమారు 24 ఎకరాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆత్మకూరు గ్రామంలో 2004కు ముందు పొలాలు కొని అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెంచర్ వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్లాట్లు వాయిదాల పద్ధతిలో విక్రయించారు. వాయిదాలు కట్టిన వందలాది మందికి ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయకుండా తిప్పుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అదే వెంచర్‌కు దగ్గరలో ఉన్న రత్నాలచెరువుపై ఆయన కన్నుపడింది. ఈ చెరువు భూమిని సాగుచేసుకునేందుకు ప్రభుత్వం కొంతమంది ఎస్సీలకు పట్టాలిచ్చింది. పట్టాలు ఇచ్చిన భూమిని విక్రయించకూడదని నిబంధన విధించింది. అయినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి ఎస్సీల వద్ద నుంచి 7.5 ఎకరాలను రూ.35 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూమిలో ప్లాట్లు వేసి ప్రజలకు విక్రయించారు. రిజిస్ట్రేషన్లు చేసి రూ.70 కోట్ల మేర సొమ్ము చేసుకున్నారు.
ఈ భూమిని తనకే ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి
గత టీడీపీ ప్రభుత్వ పాలనలో మంత్రి లోకేశ్ రత్నాలచెరువు భూమి మొత్తాన్ని ఐటీ కంపెనీల పేరుతో తమ అనుచరులకు కట్టపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అప్పటి ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రం ఇచ్చారు. చెరువులో తాను కొనుగోలు చేసిన 7.5 ఎకరాలను తనకు వదిలిపెట్టాలని కోరారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తన వద్ద ప్లాట్లు కొన్నవారు తనను డబ్బులు తిరిగి ఇవ్వమంటారనే ఆందోళనతోనే ఆయన ఈ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికీ ఆ భూమిలో కొంత కొమ్మాలపాటి చేతుల్లోనే ఉంది. రత్నాలచెరువు నకిలీ దస్తావేజుల అక్రమాలపై అధికారులు విచారణ జరుపుతుండడంతో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ చెరువు భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment