మద్యం దుకాణం వద్దు
టీపీపాళెం దళితవాడ మహిళల ధర్నా
రోడ్డుపై బైఠాయింపు, రాకపోకలకు అంతరాయం
టీపీపాళెం(నాగలాపురం) : తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయరాదని టీపీ పాళెం దళితవాడకు చెందిన మహిళలు ధర్నాకు దిగారు. శనివారం వీరు టీపీ పాళెం వద్ద రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లుపరచి రాకపోకలను సుమారు మూడు గంటల పాటు అడ్డుకున్నారు. తమ దళితవాడకు సమీపంలో మద్యం దుకా ణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చావనైనా చస్తామని కిరోసిన్ తలపై పోసుకునే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకుని సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ ఎస్ఐ శివరావుతో వాగ్వాదానికి దిగారు. ఈ మార్గంలో మహిళలు అధికంగా సంచరిస్తుంటారని, బీరకుప్పం పాఠశాలకు వెళ్లే విద్యార్థినులకు భద్రత లోపిస్తుందని మొరపెట్టుకున్నారు. ప్రశాంతంగా ఉన్న దళితవాడ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని అనుమతించబోమని హెచ్చరించారు.
ప్రభుత్వం లెసైన్స్ మంజూరు చేసిందని అడ్డుకునే వారికి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులను రద్దు చేస్తామని ఎక్సైజ్ ఎస్ఐ బెదిరించినా ‘ మీ వల్ల అయి ్యంది చేసుకోండి, కానీ మద్యం దుకాణాన్ని అనుమతించేది లేదు’ అని చెప్పారు. చివరకు ఎక్సైజ్ పోలీసులు స్థానిక ఎస్ఐ సుమన్‌కు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో ఎస్ఐ అక్కడికి చేరుకున్నారు. మద్యం దుకాణం ఏర్పాటు జరగదని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఆందోళనకు కారణమిదీ...
టీపీ కోట గ్రామానికి మద్యం దుకాణం మంజూరైంది. ఆ గ్రామంలో మద్యం దుకాణం ఉండడంతో అప్పుడప్పుడూ గొడవలు జరుగుతున్నాయని, అక్కడి నుంచి గ్రామ శివార్లకు తరలించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. దుకాణం నడపరాదని ఆందోళనలు చేసి అడ్డుకున్నారు.
దుకాణం మూతపడింది. దీంతో దుకాణాదారు మినీ వ్యాన్‌లో అమ్మకాలు చేపట్టారు. వ్యాన్‌లో అమ్మకాలను కూడా ఆ గ్రామస్తులు అనుమతించకపోవడంతో దుకాణాన్ని టీపీ కోట నుంచి టీపీ పాళెం వెళ్లే మార్గంలో దళితవాడకు సమీపంలో ఏర్పాటు చేసేందుకు శనివారం ప్రయత్నించారు. ఓ రైతు పొలంలో పక్కా గది నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన టీపీ పాళెం దళితవాడ మహిళలు ఆందోళన చేపట్టారు.