Government medicine
-
సర్కారీ వైద్యం సూపర్
మదనపల్లె: గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యం అంటే ప్రజలు భయపడే పరిస్థితి. ప్రాణాపాయ స్థితిలో అత్యవసరంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే వైద్యులు అందుబాటులో లేకపోవడం, ప్రమాదకర పరిస్థితుల్లో వైద్యం అందించలేమంటూ తిరుపతి, బెంగళూరు, వేలూరు ఆస్పత్రులకు రెఫర్ చేసేవారు. అరకొర వసతులతో సామాన్యులకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యరంగానికి మహర్దశ పట్టింది. పేదవాడికి కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పథకంతో మౌలికవసతులు, కోట్లాదిరూపాయలు వెచ్చించి అధునాతన పరికరాలు, ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాల ప్రజల వైద్య అవసరాలకు ఏకైక పెద్దదిక్కు మదనపల్లె జిల్లా ఆస్పత్రి. 2019 వరకు మదనపల్లె జిల్లా వైద్యశాలలో 15 నుంచి 20 మంది మాత్రమే డాక్టర్లు ఉండేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ గిరీషా.పీఎస్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా, ఎమ్మెల్యే నవాజ్‌బాషా కో చైర్మన్‌గా ఉన్నారు. ఆస్పత్రి సమస్యలను ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషిచేయడంతో నేడు జిల్లా ఆస్పత్రిలో 34మంది వైద్యులు సేవలందిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో లభించే ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతిరోజు 700 నుంచి 800 వరకు ఔట్పేషెంట్లు వైద్యచికిత్సలు పొందుతున్నారు. 150 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆప్తాల్మజీ, ఆర్థో, ఈఎన్టీ, సైకియాట్రి, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజీషియన్ మెడిసిన్, గైనకాలజీ, రేడియాలజీ, పిడియాట్రిక్, ఏ.ఆర్.టి.(హెచ్ఐవీ) సెంటర్, టీబీ, డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్యులు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలోనే మంచిపేరున్న బ్లడ్‌బ్యాంక్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. ప్రతిరోజు నాలుగు షిఫ్ట్‌లలో నెలకు 100మందికి పైగా కిడ్నీవ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు డయాలసిస్ సెంటర్ ఉంది. పాయిజన్, హార్ట్‌స్ట్రోక్స్, ఇతర అత్యవసరాలకు సంబంధించి 10 బెడ్లతో ఐసీయూ, పుట్టిన పిల్లలకు తక్షణ వైద్యసేవలకు సిక్ న్యూ బార్న్ యూనిట్లో 10 బెడ్లను ఏర్పాటు చేశారు. డీఎన్బీ కింద గైనిక్, అనస్థీషియా విభాగాలకు సంబంధించి ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులను ప్రభుత్వం కేటాయించింది. 24 గంటలు అత్యవసర వైద్యసేవలు అందేలా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈసీజీ, వెంటిలేటర్లు, కంప్లీట్ ఆటోఅనలైజర్, డయాలసిస్, హార్మోన్ ఎనలైజర్ మిషన్లు, స్కానింగ్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా వైద్యశాలలో త్వరలో బ్రెస్ట్ క్యాన్సర్, ఇతరాలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 8కోట్ల రూపాయల అభివృద్ధి పనులు గడచిన రెండున్నరేళ్లలో జిల్లా వైద్యశాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎంపీ మిథున్‌రెడ్డి సొంత నిధులతో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లను హైదరాబాదు నుంచి తెప్పించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఎంపీ సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్–1, పీఎస్ఏ ప్లాంట్లు–2 మొత్తం మూడింటిని ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా వీటిద్వారా 100 బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 10 ఐసీయూ బెడ్లు, 0–8 సంవత్సరాల పిల్లలకు సేవలందించేందుకు డీఐసీకు శాశ్వత భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. కరోనా టెస్టులు చేసేందుకు వీఆర్డీఎల్ ల్యాబ్ ఉంది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాము. సిబ్బంది కొరత లేకుండా అన్ని విభాగాలకు డాక్టర్లను నియమించాం. జిల్లా ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్వయంగా పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన పేదవాడు ఇక్కడ అందే ఉచిత వైద్యంతో ఆరోగ్యంగా ఇంటికెళ్లాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నాం. –నవాజ్‌బాషా, ఎమ్మెల్యే అందుబాటులో స్పెషాలిటీ వైద్యసేవలు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది కొరత లేదు. గైనకాలజీ విభాగంలో నెలకు 300 వరకు కాన్పులు, ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలకు సంబంధించి అక్టోబర్‌కు సంబంధించి 2వ ర్యాంకును సాధించాం. – డాక్టర్ ఆంజనేయులు, మెడికల్ సూపరింటెండెంట్ రోగులకు మంచి వైద్యం అందుతోంది మాది నిమ్మనపల్లె మండలం దిగువపల్లె గ్రామం. పక్షవాతంతో బాధపడుతున్నాను. ఐదురోజుల క్రితం ఆయాసం, గొంతు, వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ గతంతో పోలిస్తే ప్రస్తుతం మంచి వైద్యం అందుతోంది. సౌకర్యాలు బాగున్నాయి. – శివకుమార్ సింగ్, దిగువపల్లె, నిమ్మనపల్లె -
ప్రభుత్వ వైద్యంపై సంపూర్ణ నమ్మకం కలగాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగేలా వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును మెరుగుపరుస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో మెరుగైన సేవలు అందిస్తూనే, దశలవారీగా వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఈటల సమీక్ష నిర్వహించారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, జిల్లాల ఆస్పత్రుల పనితీరు, వాటిలో ఉన్న సౌకర్యాలను అధికారులు మంత్రికి వివరించారు. ఆస్పత్రుల వారీగా చేయాల్సిన అభివృద్ధి, కావాల్సిన నిధులు, సిబ్బంది నియామకం తదితర అవసరాలను తీర్చాలని మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఒక్క రోగి కూడా చికిత్స అందకుండా వెనుతిరగొద్దని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో సాధ్యమైనంత మేర పడకల పెంపు చేపడతామని చెప్పారు. ఎక్కడి ప్రజలకు అక్కడే అత్యాధునిక వైద్య సేవలు పొందేలా ఆయా జిల్లాల ఆస్పత్రులను ఆధునీకరిస్తామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని ఐదారు నెలల్లో ఖాళీ చేయించి, మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు. నిమ్స్‌లో ప్రస్తుతం ఐసీయూ బెడ్లు 219 ఉండగా, 4 నెలల్లో మరో 100 పడకలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది చివరికి మొత్తం 450 ఐసీయూ పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉన్న వాటినే బాగుచేద్దాం.. ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చే రోగుల్లో అత్యధికులు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకే వస్తున్నారని, త్వరలోనే ఈ ఆస్పత్రులపై ఒత్తిడిని తగ్గిస్తామని మంత్రి చెప్పారు. ఈ మూడు ఆస్పత్రులు అత్యవసర వైద్య సేవలపై దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో దాదాపు 5 వేల పడకలు అందుబాటులోకి ఉన్నాయన్నారు. అయితే, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలేదని అభిప్రాయపడ్డారు. ఆయా కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి, వీటిల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఆయా ఆస్పత్రులను గుర్తించి ఏయే రోగులు ఏ ఆస్పత్రులకు వెళ్లాలన్న దానిపై అవగాహన కల్పిస్తామన్నారు. అంతేకాకుండా ఆయా జిల్లాల నుంచి వచ్చే రోగులు, ఆ రూట్లో అందుబాటులో ఉన్న ఆస్పత్రికే వెళ్లేలా దిశానిర్దేశం చేస్తామని వివరించారు. ఆస్పత్రుల కోసం కొత్త భవనాల నిర్మాణం ప్రస్తుతం తమ ఎజెండాలో లేదని, ఉన్నవాటినే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్ కిట్ల కొరత లేదని, అయితే ఆ పథకంలో భాగంగా అందజేస్తున్న నగదు ప్రోత్సాహం కొన్ని చోట్ల నిలిచిపోయిందని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. తక్షణమే ఇలా చేయండి..: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఉన్న చెత్త, మూలపడ్డ ఫర్నీచర్, స్క్రాప్ అంతా ఖాళీ చేయాలని అధికారులకు ఈటల సూచించారు. ‘3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగవ్వాలి. ముక్కు మూసుకునే పరిస్థితి అస్సలే రావద్దు. ఆస్పత్రి భవనాలకు చిన్న చిన్న మరమ్మతులుంటే వెంటనే చేయించాలి. అన్ని ఆస్పత్రులకు మిషన్ భగీరథ పైప్‌లైన్ తీసుకోవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రోగుల వద్దకు వెళ్లి బాగోగులు తెలుసుకోవాలి. రోగులతో సిబ్బంది ప్రవర్తన ఎట్ల ఉంటుందో గమనించాలి. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా కచ్చితంగా వేతనాలు అందించాలి’అని మంత్రి దిశానిర్దేశం చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్యంలో తెలంగాణను దేశంలోనే మూడో స్థానంలో నిలిపామని, ఈ ఐదేండ్లలో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను తెలంగాణ మెడికల్, హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ సన్మానించారు. మంగళవారం సంఘం నేతలు ఈటలను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలుంటే మళ్లీ కూర్చొని చర్చిద్దామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కలీముద్దీన్ అహ్మద్, అసోసియేట్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, ట్రెజరర్ కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.3 వేలు వసూలు చేశారు!
‘రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మా బంధువుకు పోస్టుమార్టం చేయమంటే డాక్టర్ రూ.3 వేలు లంచం అడిగాడు. ఎమ్మెల్సీ అయి న నేను, ఓ ఎమ్మెల్సీ పీఏ అక్కడే ఉన్నామన్న భయం కూడా ఆ డాక్టర్లో లేదు. ఇదేం పద్ధతి’ – శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీ ఫిర్యాదు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఇలా డబ్బులు అడిగే పద్ధతి అన్ని ఆసుపత్రుల్లో ఉండేది. ఇప్పుడు అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ – వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం. సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యంపై బుధవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో వైద్యారోగ్య శాఖ పనితీరు చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల కీళ్ల మార్పిడి అంశంపై టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్‌గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, భూపతిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటనను సభ ముందుంచారు. గత ఆదివారం తన బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చూడ్డానికి వెళ్లానని, పోస్ట్మా ర్టం కోసం సిబ్బంది మధ్యాహ్నం వరకు ఎదురు చూసేలా చేసి చివరకు రూ.3 వేలు వసూలు చేసి ఆ తంతు పూర్తి చేశారని ఫిర్యాదు చేశారు. తాను, మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పీఏ అక్కడే ఉండగానే వసూళ్లు సాగాయని, మరి పేదల విషయంలో వేధింపులు ఇంకెలా ఉంటాయని సభ దృష్టికి తెచ్చారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, ‘ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవినీతి ఇంకా ఎక్కువగా ఉండేది. అన్ని ఆసుపత్రుల్లో వసూలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ తెలిపారు. ఈ సమాధానంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ విరామ సమయంలో మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు చనిపోయి దుఃఖంలో ఉంటే, వైద్యులు పోస్టుమార్టం కోసం వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. -
అన్ని వ్యాధులకు...
మచిలీపట్నం : సర్కారు వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. కడుపునొప్పి, కాలునొప్పి, జ్వరం వచ్చి ప్రభుత్వాసుపత్రికి వెళితే అక్కడ వైద్యులు, సిబ్బంది ఉండరు. ఒక వేళ ఉన్నా అన్ని వ్యాధులకు ఒకే రకం మందులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల( పీహెచ్సీ)లో సురక్షిత ప్రసవాలు జరుపుతారని పాలకులు చెబుతున్నా శిథిలావస్థకు చేరిన ఆపరేషన్ థియేటర్లు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఐదు నెలల కిందట జిల్లావ్యాప్తంగా 20కు పైగా నూతన పీహెచ్‌సీలను ప్రారంభించారు. వీటికి నిధులు విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదు. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు పోస్టు పోర్టబుల్ (పీపీ) యూనిట్లు, 620 ఉప కేంద్రాలు, 24 గంటల పాటు పనిచేసే ఆసుపత్రులు 28 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నా రోగులకు సకాలంలో వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ‘సాక్షి’ బృందం సోమవారం పీహెచ్‌సీలను పరిశీలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ► మచిలీపట్నం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో శుభ్రత లోపించింది. శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆసుపత్రిలో సివిల్ సర్జన్ పోస్టులు –7, అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు–4, డెప్యూటీ సివిల్ సర్జన్ పోస్టు–1, స్టాఫ్‌నర్సు పోస్టులు–9 ఖాళీగా ఉన్నాయి. మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని రూ. 12 కోట్లతో నిర్మించినా ప్రారంభానికి నోచుకోలేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగకపోవటంతో నిధులు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి. ► అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు లో 24గంటల ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రి పగటిపూట మాత్రమే పనిచేస్తోంది. డాక్టర్ ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేరు. వేకనూరు పీహెచ్‌సీని ఇటీవల ప్రారంభించారు. మందులు, ఫర్నిచర్ కొరత ఉంది. పులిగడ్డ పీహెచ్సీలో ఫర్నిచర్ కొరత వేధిస్తోంది. ఘం టసాల పీహెచ్సీలో ఒక డాక్టరే ఉండ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పెదకళ్లేపల్లి పీహెచ్‌సీని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ► కంకిపాడు పీహెచ్సీలో మత్తు డాక్టర్ లేరు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఆసుపత్రి ఆవరణ చెత్త, చెదారాలతో నిండి ఉంది. ఉప్పులూరు పీహెచ్‌సీకి నిధులు విడుదల కావటం లేదు. ఈ ఆసుపత్రి సిబ్బంది ప్రతి అవసరానికి కంకిపాడు పీహెచ్‌సీపై ఆధారపడాల్సి వస్తోంది. ► మైలవరం నియోజకవర్గంలోని మైలవరం, రెడ్డిగూడెం పీహెచ్సీలలో గైనకాలజిస్టులు లేరు. జి.కొండూరు పీహెచ్‌సీకి సాధారణ రోగులు వెళితే విజయవాడకు రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డాక్టర్ కొరత ఉంది. ► తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం పీహెచ్సీలో డాక్టర్ లేరు. పుష్కరాల సమయంలో మాతా, శిశువులను వారి గృహాలకు తీసుకువెళ్లే వాహనాన్ని విజయవాడకు తీసుకువెళ్లారు. ఇంకా తిరిగి రాలేదు. పీహెచ్సీ భవనం శి«థిలావస్థకు చేరింది. తిరువూరులోని రాజగూడెం పీహెచ్‌సీని నూతనంగా నిర్మించినా నిధులు విడుదల కావటం లేదు. ► జగ్గయ్యపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టు, మత్తు డాక్టర్, ఎక్స్‌రే టెక్నిషియన్, దంత వైద్యుడు లేరు. నూజివీడు గొల్లపల్లి పీహెచ్సీలో వైద్యులు లేరు. సిబ్బంది కొరత వేధిస్తోంది. ► గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు పీహెచ్సీలో ఫ్లోరింగ్ దెబ్బతింది. తలుపులు, దర్వాజాలు పాడైపోయాయి. రూ.12లక్షల వ్యయంతో మరమ్మతులు చేస్తామని చెప్పటమే త ప్ప పనులు ప్రారంభం కావటం లేదు. ► కైకలూరు పీహెచ్సీలో నలుగురు డాక్టర్లకు ఇద్దరే పనిచేస్తున్నారు. ల్యాబ్ టెక్నిషియన్, సిబ్బంది కొరత ఉంది. నందిగామ నియోజకవర్గంలోని పీహెచ్సీలలో సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. -
కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన
సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గిరిజన మరణాలు.. అన్నదాతల ఆత్మహత్యలు.. విద్యుత్ కోతలు.. కళ్ల ఎదుటే ఎండిపోతున్న పంటలు.. పంట రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్యం.. పడకేసిన ప్రభుత్వ వైద్యం.. ప్రభుత్వ కార్యాలయాల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు.. వెరసి జిల్లా వాసులు కష్టాల కడలిని ఈదుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కె.చంద్రశేఖర్‌రావుకు జిల్లాలోని ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం నిజాంపై అలుపెరుగని పోరు సాగించిన కొమురం భీమ్‌కు నివాళి అర్పించేందుకు సీఎం బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌కు వస్తున్నారు. కేసీఆర్ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధమయ్యాయి. ఏటా భీమ్‌కు నివాళులర్పించే కార్యక్రమం మొక్కుబడిగా జరిగేది. కేవలం హట్టిలోనే ఈ కార్యక్రమాన్ని ముగించేవారు. కానీ.. ఈసారి ఏకంగా సీఎం జోడేఘాట్‌కు వస్తుండటంతో ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆదివాసీల అభ్యున్నతికి వరాల జల్లు కురిపిస్తారని ఆశాభావంతో ఉన్నారు. జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే.. జమీన్.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా 1/70 భూ బదలాయింపు చట్టం జిల్లాలో సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల భూములు అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఈ చట్టాన్ని తుంగలో తొక్కి బడాబాబులు బినామీ పేర్లతో ఆదివాసీ భూములను అనుభవిస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీలో సుమారు 7,800 ఎకరాల గిరిజనుల భూములకు సంబంధించిన ఎల్టీఆర్ కేసులు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విచారణలో ఉన్నాయంటే, ఆదివాసీల భూములు ఏ స్థాయిలో అక్రమార్కుల పరమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వలస వచ్చి గిరిజనులుగా చెలామణి అవుతూ తమ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్నారని ఆదివాసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు 2005 అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు కల్పించారు. ఇందులో కూడా సుమారు 250 ఎకరాలు అటవీ భూములను బినామీ పేర్లతో గిరిజనేతరులు అనుభవిస్తున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జంగల్.. : అడవినే నమ్ముకుని జీవనం కొసాగిస్తున్న ఆదివాసీల జీవనోపాధిని సర్కారు గాలికొదిలేసింది. గిరిజనులు అడవిలో సేకరించే తేనె, ఇప్పపువ్వు, బం క, పలుకులు వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ సొసైటీ) చేతులెత్తేసింది. దీంతో గిరిజనులు దళారులకు విక్రయించాల్సి వస్తోంది. అలాగే ఏజెన్సీలో అ క్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. లాట రైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నారు. జల్.. : ఆదివాసీలు ఇప్పటికీ సురక్షిత మంచినీటికి నోచుకోవడం లేదు. తాగునీటి కోసం ప్రభుత్వాలు ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం గుక్కెడు తాగునీరు ఇవ్వలేకపోతోంది. ఏజెన్సీలో సుమారు 100కు పైగా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన గూడేలాల వాసులు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికీ వాగులు, చెలిమెలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కలుషిత నీటిని సేవించడంతో డయేరియా, అతిసార వంటి రోగాల బారిన పడి గిరిజన గూడాలు మంచం పడుతున్నాయి. ఇలా జ్వరాల బారిన పడిన గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించడంలో కూడా సర్కారు విఫలమవుతోంది. దీంతో అమాయక ఆదివాసీలు మరణాల పాలవుతున్నారు. ఈ జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల కాలంలో సుమారు 103 మంది గిరిజనులు జ్వరాల బారిన పడి మరణించినట్లు అనధికారిక అంచనా. సాగునీటి విషయంలోనూ ఆదివాసీలకు అన్యాయమే జరుగుతోందని ఆ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కోతలు.. జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే.. ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు దెబ్బతీస్తే.. పంటలు చేతికందే సమయంలో కరెంట్ కోతలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. కనీసం నాలుగు గంటలు కూడా వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో కళ్ల ముందే పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన బాట పట్టారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. వరి, సోయా, పత్తి వంటి పంటలు పక్షం రోజుల్లో చేతికందుతాయి. ఈ తరుణంలో కోతలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెక్కిరిస్తున్న ఖాళీలు.. జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కీలక పో స్టుల ఖాళీలు ఉన్నాయి. వివిధ పనుల కోసం ఆయా కార్యాలయాలకు వెళుతున్న జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌తో పాటు, ఐటిడీఏ పీఓ వంటి ఉన్నతాధికారులతో పాటు, క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారుల పోస్టులు గత కొన్ని నెలలుగా భర్తీకి నోచుకోవడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 40కిపైగా వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్ర స్థాయిలో వైద్యం అందడం ఇబ్బందిగా మారింది. అరకొరగా పంట రుణం.. రుణమాఫీ చేసి తీరుతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా బ్యాంకర్లు మాత్రం అన్నదాతలకు పంట రుణాలు మంజూరు చేయడం లేదు. మాఫీ అయిన రుణాల్లో 25 శాతం మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసినా.. బ్యాంకర్లు మాత్రం కేవలం గతేడాది ఇచ్చిన రుణంలో 25 శాతం మొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తున్నారు. ఖరీఫ్ సీజను ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో పది శాతం రైతులకు కూడా రుణాలివ్వలేదు. ఆత్మహత్యలు.. ఖరీఫ్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయాయి. రెండు, మూడు పర్యాయాలు విత్తనాలు వేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల్లో సుమారు 38 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనధికారిక అంచనా. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన ఎల్లంపల్లి, గొల్లవాగు వంటి ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఆ నీటిని ఆయకట్టుకు అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టుల పనులు 90 శాతానికి పైగా పూర్తికాగా, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయక ఆయకట్టుకు నీరందడం లేదు. పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.