సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగేలా వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును మెరుగుపరుస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో మెరుగైన సేవలు అందిస్తూనే, దశలవారీగా వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఈటల సమీక్ష నిర్వహించారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, జిల్లాల ఆస్పత్రుల పనితీరు, వాటిలో ఉన్న సౌకర్యాలను అధికారులు మంత్రికి వివరించారు. ఆస్పత్రుల వారీగా చేయాల్సిన అభివృద్ధి, కావాల్సిన నిధులు, సిబ్బంది నియామకం తదితర అవసరాలను తీర్చాలని మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఒక్క రోగి కూడా చికిత్స అందకుండా వెనుతిరగొద్దని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో సాధ్యమైనంత మేర పడకల పెంపు చేపడతామని చెప్పారు. ఎక్కడి ప్రజలకు అక్కడే అత్యాధునిక వైద్య సేవలు పొందేలా ఆయా జిల్లాల ఆస్పత్రులను ఆధునీకరిస్తామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని ఐదారు నెలల్లో ఖాళీ చేయించి, మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు. నిమ్స్‌లో ప్రస్తుతం ఐసీయూ బెడ్లు 219 ఉండగా, 4 నెలల్లో మరో 100 పడకలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది చివరికి మొత్తం 450 ఐసీయూ పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఉన్న వాటినే బాగుచేద్దాం..
ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చే రోగుల్లో అత్యధికులు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకే వస్తున్నారని, త్వరలోనే ఈ ఆస్పత్రులపై ఒత్తిడిని తగ్గిస్తామని మంత్రి చెప్పారు. ఈ మూడు ఆస్పత్రులు అత్యవసర వైద్య సేవలపై దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో దాదాపు 5 వేల పడకలు అందుబాటులోకి ఉన్నాయన్నారు. అయితే, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలేదని అభిప్రాయపడ్డారు. ఆయా కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి, వీటిల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఆయా ఆస్పత్రులను గుర్తించి ఏయే రోగులు ఏ ఆస్పత్రులకు వెళ్లాలన్న దానిపై అవగాహన కల్పిస్తామన్నారు. అంతేకాకుండా ఆయా జిల్లాల నుంచి వచ్చే రోగులు, ఆ రూట్‌లో అందుబాటులో ఉన్న ఆస్పత్రికే వెళ్లేలా దిశానిర్దేశం చేస్తామని వివరించారు. ఆస్పత్రుల కోసం కొత్త భవనాల నిర్మాణం ప్రస్తుతం తమ ఎజెండాలో లేదని, ఉన్నవాటినే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్ కిట్ల కొరత లేదని, అయితే ఆ పథకంలో భాగంగా అందజేస్తున్న నగదు ప్రోత్సాహం కొన్ని చోట్ల నిలిచిపోయిందని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
తక్షణమే ఇలా చేయండి..: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఉన్న చెత్త, మూలపడ్డ ఫర్నీచర్, స్క్రాప్ అంతా ఖాళీ చేయాలని అధికారులకు ఈటల సూచించారు. ‘3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగవ్వాలి. ముక్కు మూసుకునే పరిస్థితి అస్సలే రావద్దు. ఆస్పత్రి భవనాలకు చిన్న చిన్న మరమ్మతులుంటే వెంటనే చేయించాలి. అన్ని ఆస్పత్రులకు మిషన్ భగీరథ పైప్‌లైన్ తీసుకోవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు రోగుల వద్దకు వెళ్లి బాగోగులు తెలుసుకోవాలి. రోగులతో సిబ్బంది ప్రవర్తన ఎట్ల ఉంటుందో గమనించాలి. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా కచ్చితంగా వేతనాలు అందించాలి’అని మంత్రి దిశానిర్దేశం చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్యంలో తెలంగాణను దేశంలోనే మూడో స్థానంలో నిలిపామని, ఈ ఐదేండ్లలో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను తెలంగాణ మెడికల్, హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ సన్మానించారు. మంగళవారం సంఘం నేతలు ఈటలను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలుంటే మళ్లీ కూర్చొని చర్చిద్దామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కలీముద్దీన్ అహ్మద్, అసోసియేట్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, ట్రెజరర్ కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment