
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో డయేరియా, మలేరియా, చికున్ గున్యా, డెంగీలతో పాటు వైరల్ ఫీవర్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశమున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులను అరికట్టేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారులతో బుధవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలతో సమన్వయం చేసుకొని నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఈ వ్యాధులపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా వర్షాలు ఎక్కువ కురుస్తున్న జిల్లాల మీద దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్‌రావును ఆదేశించారు.
ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అన్ని ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డికి ఆదేశాలిచ్చారు. ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్‌లో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందేలా చూడాలని వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డికి సూచించారు. గ్రామస్థాయిలో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు రోజువారీ సర్వే చేయాలని ఆదేశించారు. జ్వరంతో పాటుగా ఇతర జబ్బులు కూడా పరిశీలించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణ చర్యలు, చికిత్సపై శుక్రవారం జిల్లా వైద్య అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment