కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన
సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గిరిజన మరణాలు.. అన్నదాతల ఆత్మహత్యలు.. విద్యుత్ కోతలు.. కళ్ల ఎదుటే ఎండిపోతున్న పంటలు.. పంట రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్యం.. పడకేసిన ప్రభుత్వ వైద్యం.. ప్రభుత్వ కార్యాలయాల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు.. వెరసి జిల్లా వాసులు కష్టాల కడలిని ఈదుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కె.చంద్రశేఖర్‌రావుకు జిల్లాలోని ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
ఆదివాసీల హక్కుల కోసం నిజాంపై అలుపెరుగని పోరు సాగించిన కొమురం భీమ్‌కు నివాళి అర్పించేందుకు సీఎం బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌కు వస్తున్నారు. కేసీఆర్ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధమయ్యాయి. ఏటా భీమ్‌కు నివాళులర్పించే కార్యక్రమం మొక్కుబడిగా జరిగేది. కేవలం హట్టిలోనే ఈ కార్యక్రమాన్ని ముగించేవారు. కానీ.. ఈసారి ఏకంగా సీఎం జోడేఘాట్‌కు వస్తుండటంతో ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆదివాసీల అభ్యున్నతికి వరాల జల్లు కురిపిస్తారని ఆశాభావంతో ఉన్నారు. జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే..
జమీన్..
పాలకుల నిర్లక్ష్యం కారణంగా 1/70 భూ బదలాయింపు చట్టం జిల్లాలో సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల భూములు అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఈ చట్టాన్ని తుంగలో తొక్కి బడాబాబులు బినామీ పేర్లతో ఆదివాసీ భూములను అనుభవిస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీలో సుమారు 7,800 ఎకరాల గిరిజనుల భూములకు సంబంధించిన ఎల్టీఆర్ కేసులు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విచారణలో ఉన్నాయంటే, ఆదివాసీల భూములు ఏ స్థాయిలో అక్రమార్కుల పరమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వలస వచ్చి గిరిజనులుగా చెలామణి అవుతూ తమ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్నారని ఆదివాసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు 2005 అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు కల్పించారు. ఇందులో కూడా సుమారు 250 ఎకరాలు అటవీ భూములను బినామీ పేర్లతో గిరిజనేతరులు అనుభవిస్తున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జంగల్.. : అడవినే నమ్ముకుని జీవనం కొసాగిస్తున్న ఆదివాసీల జీవనోపాధిని సర్కారు గాలికొదిలేసింది. గిరిజనులు అడవిలో సేకరించే తేనె, ఇప్పపువ్వు, బం క, పలుకులు వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ సొసైటీ) చేతులెత్తేసింది. దీంతో గిరిజనులు దళారులకు విక్రయించాల్సి వస్తోంది. అలాగే ఏజెన్సీలో అ క్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. లాట రైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నారు.
జల్.. : ఆదివాసీలు ఇప్పటికీ సురక్షిత మంచినీటికి నోచుకోవడం లేదు. తాగునీటి కోసం ప్రభుత్వాలు ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం గుక్కెడు తాగునీరు ఇవ్వలేకపోతోంది. ఏజెన్సీలో సుమారు 100కు పైగా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన గూడేలాల వాసులు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికీ వాగులు, చెలిమెలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కలుషిత నీటిని సేవించడంతో డయేరియా, అతిసార వంటి రోగాల బారిన పడి గిరిజన గూడాలు మంచం పడుతున్నాయి. ఇలా జ్వరాల బారిన పడిన గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించడంలో కూడా సర్కారు విఫలమవుతోంది. దీంతో అమాయక ఆదివాసీలు మరణాల పాలవుతున్నారు. ఈ జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల కాలంలో సుమారు 103 మంది గిరిజనులు జ్వరాల బారిన పడి మరణించినట్లు అనధికారిక అంచనా. సాగునీటి విషయంలోనూ ఆదివాసీలకు అన్యాయమే జరుగుతోందని ఆ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ కోతలు..
జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే.. ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు దెబ్బతీస్తే.. పంటలు చేతికందే సమయంలో కరెంట్ కోతలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. కనీసం నాలుగు గంటలు కూడా వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో కళ్ల ముందే పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన బాట పట్టారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. వరి, సోయా, పత్తి వంటి పంటలు పక్షం రోజుల్లో చేతికందుతాయి. ఈ తరుణంలో కోతలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వెక్కిరిస్తున్న ఖాళీలు..
జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కీలక పో స్టుల ఖాళీలు ఉన్నాయి. వివిధ పనుల కోసం ఆయా కార్యాలయాలకు వెళుతున్న జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌తో పాటు, ఐటిడీఏ పీఓ వంటి ఉన్నతాధికారులతో పాటు, క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారుల పోస్టులు గత కొన్ని నెలలుగా భర్తీకి నోచుకోవడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 40కిపైగా వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్ర స్థాయిలో వైద్యం అందడం ఇబ్బందిగా మారింది.
అరకొరగా పంట రుణం..
రుణమాఫీ చేసి తీరుతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా బ్యాంకర్లు మాత్రం అన్నదాతలకు పంట రుణాలు మంజూరు చేయడం లేదు. మాఫీ అయిన రుణాల్లో 25 శాతం మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసినా.. బ్యాంకర్లు మాత్రం కేవలం గతేడాది ఇచ్చిన రుణంలో 25 శాతం మొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తున్నారు. ఖరీఫ్ సీజను ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో పది శాతం రైతులకు కూడా రుణాలివ్వలేదు.
ఆత్మహత్యలు..
ఖరీఫ్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయాయి. రెండు, మూడు పర్యాయాలు విత్తనాలు వేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల్లో సుమారు 38 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనధికారిక అంచనా.
ప్రాజెక్టుల్లో నీళ్లున్నా..
జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన ఎల్లంపల్లి, గొల్లవాగు వంటి ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఆ నీటిని ఆయకట్టుకు అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టుల పనులు 90 శాతానికి పైగా పూర్తికాగా, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయక ఆయకట్టుకు నీరందడం లేదు. పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.