సీఎం పర్యటన ఖరారు!
కెరమెరి : కొమురం భీమ్ ఆశీర్వాదంతో జోడేఘాట్ అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ జగన్మోహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం కెరమెరి మండలంలోని హట్టి బేస్ క్యాంపులో కొమురం భీమ్ వర్ధంతిపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. సోమవారం స్వయంగా కేసీఆర్ చెప్పారని, ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు కలెక్టర్ అన్నారు. కాశ్మీర్ ఎలాంటి ప్రాంతమో.. తెలంగాణకు ఆదిలాబాద్ అలాంటి ప్రాంతమని అందుకు సీఎం జోడేఘాట్‌లో జరుగు కొమురం భీమ్ వర్ధంతికి వస్తున్నారన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
అధికారులు, నాయకులు సమష్టి కృషితోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమని అన్నారు. జోడేఘాట్‌లో గిరిజన మ్యూజియం, ఉద్యానవన కేంద్రం, వన్యమృగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తాగునీరు, రోడ్డు, రవాణా, పాఠశాలల ఏర్పాటు, వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. భీమ్ ఆత్మకు శాంతి కలగాలంటే అవసరాలన్ని తీర్చాలన్నారు. ఇదే చివరి సమీక్షా సమావేశమని వివధ శాఖలకు అప్పగించిన పనులను తప్పకుండా గడువులోపు పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రప్రథమంగా మన జిల్లాకు, అమరుని గ్రామమైన జోడేఘాట్‌కు రావడం మనందరి అదృష్టమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ అన్నారు.
అందరికి విద్య అందేలా చర్యలు తీసుకోవాలి
- గిరిజన నాయకుల డిమాండ్
అనేక ప్రాంతాల్లో గిరిజన ఆదివాసీలకు విద్య అందనంత దూరంలో ఉందని అందుకు అధికారులు విద్య, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కొమురం భీమ్ ఉత్సవ కమిటీ చైర్మన్ కోవ దేవ్‌రావు, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, పెందోర్ దత్తు, కనక యాదవరావులు అన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా భీం వర్దంతి కి రావడం గిరిజనుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, ఏవో భీమ్, కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, జెడ్పీటీసీ అబ్దుల్‌కలాం, సర్పంచ్ భీంరావు, జొడేఘాట్ గ్రామ పటేల్ సోము విద్యుత్, ఆర్‌అండ్‌బీ, ఐకేపీ, ఏజీఎస్, ఐటీడీఏ ఈఈ, డీఈ, ఏఈ, ఐసీడీఎ ఆర్‌టీవో తదితర శాఖలకు చెందిన అధికారులున్నారు.