లక్ష వరకే మాఫీ.. ఆపై ఉంటే రైతులే కట్టుకోవాలి | Telangana CM promises waiver of crop loans worth Rs 12,000 crores | Sakshi
Sakshi News home page

లక్ష వరకే మాఫీ.. ఆపై ఉంటే రైతులే కట్టుకోవాలి

Published Thu, Jun 5 2014 2:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

లక్ష వరకే మాఫీ.. ఆపై ఉంటే రైతులే కట్టుకోవాలి - Sakshi

లక్ష వరకే మాఫీ.. ఆపై ఉంటే రైతులే కట్టుకోవాలి

  • బ్యాంకర్ల సమావేశంలో స్పష్టం చేసిన కేసీఆర్ 
  •   పాత బకాయిలు కట్టని, రెన్యువల్ చేసుకోని వారికి మాఫీ వర్తించదు
  •   బంగారం, దీర్ఘకాలిక రుణాల మాఫీ కూడా లేనట్లే
  •   మాఫీతో సంబంధం లేకుండా ఖరీఫ్ రుణాలివ్వండి
  •   రాష్ర్ట స్థాయి బ్యాంకర్లను కోరిన ముఖ్యమంత్రి
  •   రుణ మాఫీ భారం రూ. 10 వేల కోట్లలోపే!
  •  సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీని గత ఆర్థిక సంవత్సరానికే పరిమితం చేయాలని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా సంకేతాలిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. అయితే గత  ఆర్థిక సంవత్సరం(2013-14)లో తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
     
    అలాగే లక్షకుపైగా రుణం తీసుకున్న రైతుల విషయంలో లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందని, మిగతా మొత్తాన్ని వారే చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు ఈ సందర్భంగా స్పష్టతనిచ్చినట్లు సమాచారం. ఇక వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంట రుణాలు, పరోక్ష రుణాలకు ఈ మాఫీ వర్తించదని కూడా బ్యాంకర్లకు కేసీఆర్ తేల్చి చెప్పారు. రుణ మాఫీతో సంబంధం లేకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.
     
    రాష్ర్ట స్థాయి బ్యాంకర్లతో తొలిసారి సమావేశమైన సందర్భంగా తెలంగాణ రైతాంగం తీసుకున్న రుణాల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులు అనేక కష్టనష్టాలను భరిస్తూ వ్యవసాయం చేస్తున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్య, రుతు పవనాలు సకాలంలో రాకపోవడం వంటి ఇబ్బందుల నడుమ పంటలు పండిస్తూ అన్నదాతలు నష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి రైతులకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఓ రైతుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు. నేను వారంలో రెండుమూడు రోజులు పొలానికి వెళ్తుంటాను’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలుగైదు రోజుల్లో బ్యాంకర్లతో మళ్లీ సమావేశంకావాలని నిర్ణయించారు.
     
    కాగా, పంట రుణాల వివరాలను అన్ని బ్యాంకులు ఒకే నమూనాలో వారంలోగా అందించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి కోరారు. తెలంగాణ పురోగతికి అన్ని విధాలుగా సహకరిస్తామని  రాష్ట్ర లీడ్ బ్యాంకుగా ఉన్న ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ నెల 9న సమీక్షా సమావేశం నిర్వహించేందుకు అన్ని బ్యాంకులు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక రైతులకు రుణ మంజూరు, ఎప్పుడు పంపిణీ చేశారన్న వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కోరారు.
     
    కాగా రుణ మాఫీ రూ. 10 వేల కోట్లలోపు ఉండేలా దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె. గోయల్ సూచించారు. ఈ సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. రెన్యూవల్ లేదా బుక్‌అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న రైతు రుణాలకు కూడా మాఫీని వర్తింప చేస్తామని చెప్పారు. మూడు నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించని వారికి రుణ మాఫీ వర్తించదని స్పష్టం చేశారు. రుణ మాఫీతో సంబంధం లేకుండా ఖరీఫ్ రుణాలు మంజూరు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని బ్యాంకులను కోరామన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
     
     ఇంతకీ రుణ మాఫీ భారమెంత?
     బ్యాంకర్ల భేటీలో ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం మాఫీ అయ్యే రుణం రూ. 8 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. లక్షలోపు మాఫీ అంటే అసలుతోపాటు వడ్డీ కలిపి లక్ష రూపాయలా? లేక అసలు మాత్రమే లక్ష రూపాయలా? అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2008 తర్వాత రుణాలు తీసుకున్న రైతులు క్రమం తప్పకుండా రుణాలు చెల్లించడం లేదా రెన్యువల్ చేసుకుంటూ వస్తే తప్ప వారికి రుణ మాఫీ వర్తించే అవకాశం లేదు.
     
    2013 సంవత్సరానికి ముందు బకాయిలు చెల్లించకుండా ఉన్న వాటిని మాఫీ చేసేది లేదని ప్రభుత్వం కరాఖండి గా చెప్పింది. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరం(2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు)లో బ్యాంకులు అందించిన వ్యవసాయ రుణాలు రూ.14,897 కోట్లుగా ఉన్నాయి. ఇందులో బంగారం తాకట్టు రుణాలు రూ. 2,700 కోట్లు, కోతల అనంతరం రుణాలు రూ. 500 కోట్లు, చెరకు, పొగాకు రుణాలు 500 కోట్లుగా ఉన్నాయి.
     
    ఈ మూడు రకాల రుణాలను తొలగిస్తే మిగిలిన పంట రుణాల మొత్తం రూ. 11,197 కోట్లుగా ఉంది. ఇందులోనూ కొన్ని లక్ష రూపాయల కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి. వీటిలో లక్ష వరకే మాఫీ వర్తింపజేస్తే ప్రభుత్వంపై పడే భారం పది వేల కోట్లలోపే ఉండే అవకాశముంది.  తెలంగాణలో 23 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్ల వరకు రుణ మాఫీ చేస్తామని బుధవారం గజ్వేల్ సభలో కేసీఆర్ చెప్పడం గమనార్హం. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement