Crop loans Waiver
-
కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన
సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గిరిజన మరణాలు.. అన్నదాతల ఆత్మహత్యలు.. విద్యుత్ కోతలు.. కళ్ల ఎదుటే ఎండిపోతున్న పంటలు.. పంట రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్యం.. పడకేసిన ప్రభుత్వ వైద్యం.. ప్రభుత్వ కార్యాలయాల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు.. వెరసి జిల్లా వాసులు కష్టాల కడలిని ఈదుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కె.చంద్రశేఖర్‌రావుకు జిల్లాలోని ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం నిజాంపై అలుపెరుగని పోరు సాగించిన కొమురం భీమ్‌కు నివాళి అర్పించేందుకు సీఎం బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌కు వస్తున్నారు. కేసీఆర్ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధమయ్యాయి. ఏటా భీమ్‌కు నివాళులర్పించే కార్యక్రమం మొక్కుబడిగా జరిగేది. కేవలం హట్టిలోనే ఈ కార్యక్రమాన్ని ముగించేవారు. కానీ.. ఈసారి ఏకంగా సీఎం జోడేఘాట్‌కు వస్తుండటంతో ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆదివాసీల అభ్యున్నతికి వరాల జల్లు కురిపిస్తారని ఆశాభావంతో ఉన్నారు. జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే.. జమీన్.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా 1/70 భూ బదలాయింపు చట్టం జిల్లాలో సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల భూములు అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఈ చట్టాన్ని తుంగలో తొక్కి బడాబాబులు బినామీ పేర్లతో ఆదివాసీ భూములను అనుభవిస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీలో సుమారు 7,800 ఎకరాల గిరిజనుల భూములకు సంబంధించిన ఎల్టీఆర్ కేసులు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విచారణలో ఉన్నాయంటే, ఆదివాసీల భూములు ఏ స్థాయిలో అక్రమార్కుల పరమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వలస వచ్చి గిరిజనులుగా చెలామణి అవుతూ తమ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్నారని ఆదివాసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు 2005 అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు కల్పించారు. ఇందులో కూడా సుమారు 250 ఎకరాలు అటవీ భూములను బినామీ పేర్లతో గిరిజనేతరులు అనుభవిస్తున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జంగల్.. : అడవినే నమ్ముకుని జీవనం కొసాగిస్తున్న ఆదివాసీల జీవనోపాధిని సర్కారు గాలికొదిలేసింది. గిరిజనులు అడవిలో సేకరించే తేనె, ఇప్పపువ్వు, బం క, పలుకులు వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ సొసైటీ) చేతులెత్తేసింది. దీంతో గిరిజనులు దళారులకు విక్రయించాల్సి వస్తోంది. అలాగే ఏజెన్సీలో అ క్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. లాట రైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నారు. జల్.. : ఆదివాసీలు ఇప్పటికీ సురక్షిత మంచినీటికి నోచుకోవడం లేదు. తాగునీటి కోసం ప్రభుత్వాలు ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం గుక్కెడు తాగునీరు ఇవ్వలేకపోతోంది. ఏజెన్సీలో సుమారు 100కు పైగా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన గూడేలాల వాసులు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికీ వాగులు, చెలిమెలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కలుషిత నీటిని సేవించడంతో డయేరియా, అతిసార వంటి రోగాల బారిన పడి గిరిజన గూడాలు మంచం పడుతున్నాయి. ఇలా జ్వరాల బారిన పడిన గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించడంలో కూడా సర్కారు విఫలమవుతోంది. దీంతో అమాయక ఆదివాసీలు మరణాల పాలవుతున్నారు. ఈ జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల కాలంలో సుమారు 103 మంది గిరిజనులు జ్వరాల బారిన పడి మరణించినట్లు అనధికారిక అంచనా. సాగునీటి విషయంలోనూ ఆదివాసీలకు అన్యాయమే జరుగుతోందని ఆ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కోతలు.. జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే.. ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు దెబ్బతీస్తే.. పంటలు చేతికందే సమయంలో కరెంట్ కోతలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. కనీసం నాలుగు గంటలు కూడా వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో కళ్ల ముందే పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన బాట పట్టారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. వరి, సోయా, పత్తి వంటి పంటలు పక్షం రోజుల్లో చేతికందుతాయి. ఈ తరుణంలో కోతలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెక్కిరిస్తున్న ఖాళీలు.. జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కీలక పో స్టుల ఖాళీలు ఉన్నాయి. వివిధ పనుల కోసం ఆయా కార్యాలయాలకు వెళుతున్న జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌తో పాటు, ఐటిడీఏ పీఓ వంటి ఉన్నతాధికారులతో పాటు, క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారుల పోస్టులు గత కొన్ని నెలలుగా భర్తీకి నోచుకోవడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 40కిపైగా వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్ర స్థాయిలో వైద్యం అందడం ఇబ్బందిగా మారింది. అరకొరగా పంట రుణం.. రుణమాఫీ చేసి తీరుతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా బ్యాంకర్లు మాత్రం అన్నదాతలకు పంట రుణాలు మంజూరు చేయడం లేదు. మాఫీ అయిన రుణాల్లో 25 శాతం మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసినా.. బ్యాంకర్లు మాత్రం కేవలం గతేడాది ఇచ్చిన రుణంలో 25 శాతం మొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తున్నారు. ఖరీఫ్ సీజను ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో పది శాతం రైతులకు కూడా రుణాలివ్వలేదు. ఆత్మహత్యలు.. ఖరీఫ్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయాయి. రెండు, మూడు పర్యాయాలు విత్తనాలు వేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల్లో సుమారు 38 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనధికారిక అంచనా. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన ఎల్లంపల్లి, గొల్లవాగు వంటి ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఆ నీటిని ఆయకట్టుకు అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టుల పనులు 90 శాతానికి పైగా పూర్తికాగా, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయక ఆయకట్టుకు నీరందడం లేదు. పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. -
రుణమాఫీ బ్యాంకులకు మంచిది కాదు
-
ఏపీ రైతు రుణ మాఫీ పట్ల బ్యాంకర్ల నిరసన
* సక్రమంగా కట్టిన రైతులు ఎగవేత దారులుగా మారే ప్రమాదముంది * ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారీ స్థాయిలో వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనపై బ్యాంకింగ్ రంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏకంగా రూ. 54,000 కోట్ల రుణాల మాఫీ ప్రతిపాదన బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. నిబద్ధతతో రుణాలను తిరిగి చెల్లించేవారిని శిక్షిస్తూ, ఎగ్గొట్టేవారిని ప్రోత్సహించే ఈ తరహా విధానం ఎవరికీ మంచిది కాదని ఒక ఆంగ్ల చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. కష్టపడి బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించిన వారికి ఈ రుణ మాఫీల వల్ల ఎలాంటి ప్రయోజనాలు దక్కకుండా పోతాయని భట్టాచార్య పేర్కొన్నారు. ఫలితంగా ఇంతకాలం క్రమశిక్షణతో కట్టుకుంటూ వచ్చిన వారు కూడా భవిష్యత్‌లో ఎగవేతదారులుగా మారే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా, ఇకపై కూడా రుణ మాఫీలు జరుగుతాయని వారు ఎదురుచూస్తూ కూర్చునే అవకాశం ఉందన్నారు. రుణ మాఫీని కొందరు బ్యాంకర్లు వ్యతిరేకిస్తుండటంపై స్పందిస్తూ.. ఈ విషయాలపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సమాలోచనలు జరిపినట్లు భట్టాచార్య వివరించారు. దేశీయంగా రుణాలు ఇవ్వడం, తీసుకోవడం సంస్కృతిని ధ్వంసం చేసే ఈ తరహా విధానం పట్ల తాము కూడా ఐబీఏ వద్ద నిరసన వ్యక్తపరుస్తామన్నారు. -
లక్ష వరకే మాఫీ.. ఆపై ఉంటే రైతులే కట్టుకోవాలి
బ్యాంకర్ల సమావేశంలో స్పష్టం చేసిన కేసీఆర్ పాత బకాయిలు కట్టని, రెన్యువల్ చేసుకోని వారికి మాఫీ వర్తించదు బంగారం, దీర్ఘకాలిక రుణాల మాఫీ కూడా లేనట్లే మాఫీతో సంబంధం లేకుండా ఖరీఫ్ రుణాలివ్వండి రాష్ర్ట స్థాయి బ్యాంకర్లను కోరిన ముఖ్యమంత్రి రుణ మాఫీ భారం రూ. 10 వేల కోట్లలోపే! సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీని గత ఆర్థిక సంవత్సరానికే పరిమితం చేయాలని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా సంకేతాలిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే లక్షకుపైగా రుణం తీసుకున్న రైతుల విషయంలో లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందని, మిగతా మొత్తాన్ని వారే చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు ఈ సందర్భంగా స్పష్టతనిచ్చినట్లు సమాచారం. ఇక వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంట రుణాలు, పరోక్ష రుణాలకు ఈ మాఫీ వర్తించదని కూడా బ్యాంకర్లకు కేసీఆర్ తేల్చి చెప్పారు. రుణ మాఫీతో సంబంధం లేకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. రాష్ర్ట స్థాయి బ్యాంకర్లతో తొలిసారి సమావేశమైన సందర్భంగా తెలంగాణ రైతాంగం తీసుకున్న రుణాల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులు అనేక కష్టనష్టాలను భరిస్తూ వ్యవసాయం చేస్తున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్య, రుతు పవనాలు సకాలంలో రాకపోవడం వంటి ఇబ్బందుల నడుమ పంటలు పండిస్తూ అన్నదాతలు నష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి రైతులకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఓ రైతుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు. నేను వారంలో రెండుమూడు రోజులు పొలానికి వెళ్తుంటాను’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలుగైదు రోజుల్లో బ్యాంకర్లతో మళ్లీ సమావేశంకావాలని నిర్ణయించారు. కాగా, పంట రుణాల వివరాలను అన్ని బ్యాంకులు ఒకే నమూనాలో వారంలోగా అందించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి కోరారు. తెలంగాణ పురోగతికి అన్ని విధాలుగా సహకరిస్తామని రాష్ట్ర లీడ్ బ్యాంకుగా ఉన్న ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ నెల 9న సమీక్షా సమావేశం నిర్వహించేందుకు అన్ని బ్యాంకులు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక రైతులకు రుణ మంజూరు, ఎప్పుడు పంపిణీ చేశారన్న వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కోరారు. కాగా రుణ మాఫీ రూ. 10 వేల కోట్లలోపు ఉండేలా దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె. గోయల్ సూచించారు. ఈ సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. రెన్యూవల్ లేదా బుక్‌అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న రైతు రుణాలకు కూడా మాఫీని వర్తింప చేస్తామని చెప్పారు. మూడు నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించని వారికి రుణ మాఫీ వర్తించదని స్పష్టం చేశారు. రుణ మాఫీతో సంబంధం లేకుండా ఖరీఫ్ రుణాలు మంజూరు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని బ్యాంకులను కోరామన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇంతకీ రుణ మాఫీ భారమెంత? బ్యాంకర్ల భేటీలో ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం మాఫీ అయ్యే రుణం రూ. 8 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. లక్షలోపు మాఫీ అంటే అసలుతోపాటు వడ్డీ కలిపి లక్ష రూపాయలా? లేక అసలు మాత్రమే లక్ష రూపాయలా? అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2008 తర్వాత రుణాలు తీసుకున్న రైతులు క్రమం తప్పకుండా రుణాలు చెల్లించడం లేదా రెన్యువల్ చేసుకుంటూ వస్తే తప్ప వారికి రుణ మాఫీ వర్తించే అవకాశం లేదు. 2013 సంవత్సరానికి ముందు బకాయిలు చెల్లించకుండా ఉన్న వాటిని మాఫీ చేసేది లేదని ప్రభుత్వం కరాఖండి గా చెప్పింది. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరం(2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు)లో బ్యాంకులు అందించిన వ్యవసాయ రుణాలు రూ.14,897 కోట్లుగా ఉన్నాయి. ఇందులో బంగారం తాకట్టు రుణాలు రూ. 2,700 కోట్లు, కోతల అనంతరం రుణాలు రూ. 500 కోట్లు, చెరకు, పొగాకు రుణాలు 500 కోట్లుగా ఉన్నాయి. ఈ మూడు రకాల రుణాలను తొలగిస్తే మిగిలిన పంట రుణాల మొత్తం రూ. 11,197 కోట్లుగా ఉంది. ఇందులోనూ కొన్ని లక్ష రూపాయల కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి. వీటిలో లక్ష వరకే మాఫీ వర్తింపజేస్తే ప్రభుత్వంపై పడే భారం పది వేల కోట్లలోపే ఉండే అవకాశముంది. తెలంగాణలో 23 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్ల వరకు రుణ మాఫీ చేస్తామని బుధవారం గజ్వేల్ సభలో కేసీఆర్ చెప్పడం గమనార్హం.