* సక్రమంగా కట్టిన రైతులు ఎగవేత దారులుగా మారే ప్రమాదముంది
* ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనపై బ్యాంకింగ్ రంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏకంగా రూ. 54,000 కోట్ల రుణాల మాఫీ ప్రతిపాదన బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. నిబద్ధతతో రుణాలను తిరిగి చెల్లించేవారిని శిక్షిస్తూ, ఎగ్గొట్టేవారిని ప్రోత్సహించే ఈ తరహా విధానం ఎవరికీ మంచిది కాదని ఒక ఆంగ్ల చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. కష్టపడి బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించిన వారికి ఈ రుణ మాఫీల వల్ల ఎలాంటి ప్రయోజనాలు దక్కకుండా పోతాయని భట్టాచార్య పేర్కొన్నారు.
ఫలితంగా ఇంతకాలం క్రమశిక్షణతో కట్టుకుంటూ వచ్చిన వారు కూడా భవిష్యత్‌లో ఎగవేతదారులుగా మారే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా, ఇకపై కూడా రుణ మాఫీలు జరుగుతాయని వారు ఎదురుచూస్తూ కూర్చునే అవకాశం ఉందన్నారు. రుణ మాఫీని కొందరు బ్యాంకర్లు వ్యతిరేకిస్తుండటంపై స్పందిస్తూ.. ఈ విషయాలపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సమాలోచనలు జరిపినట్లు భట్టాచార్య వివరించారు. దేశీయంగా రుణాలు ఇవ్వడం, తీసుకోవడం సంస్కృతిని ధ్వంసం చేసే ఈ తరహా విధానం పట్ల తాము కూడా ఐబీఏ వద్ద నిరసన వ్యక్తపరుస్తామన్నారు.
ఏపీ రైతు రుణ మాఫీ పట్ల బ్యాంకర్ల నిరసన
Published Sat, Jun 7 2014 5:41 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement
Advertisement