రూ.45 లక్షల కోట్లతో వంద స్మార్ట్ సిటీలు
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళిక
‘సీఐఐ-సమ్ ఇన్ఫ్రా’ సదస్సులో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేశంలో ప్రభుత్వ, ప్రైవే టు భాగస్వామ్యంతో రూ.45 లక్షల కోట్లతో వంద స్మార్ట్ సిటీల అభివృద్ధికి ప్రణాళిక రచించామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. 500 మేజర్ టౌన్లు, చారిత్రక, వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి పథకం రూపొందించామన్నారు. దీనిపై జనవరిలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. తిరుపతిలో మూడు రోజులుగా జరుగుతున్న ‘సీఐఐ-సమ్ ఇన్ఫ్రా’ సదస్సు శనివారం ముగిసిం ది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తేనే పంచడానికి సాధ్యమవుతుందన్నారు. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ వల్ల సంపదను సృష్టించలేకపోయారన్నారు. రాజకీయపార్టీలు, నాయకులతోపాటు ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజ లకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని పేర్కొన్నా రు. ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటూ పోతే చివరకు విద్యుత్తే ఉండదన్నారు. పన్నులు వేస్తేనే పనులు జరుగుతాయని చెప్పారు.
దేశంలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పన్నులు వేయకపోవడం, ప్రజ లు కట్టకపోవడం వల్లే ఆ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. విజయవాడ కార్పొరేషన్లో మూడు నెలలకు ఒకసారి వేతనా లు ఇస్తున్నారని కార్మికులు తన వద్దకు వచ్చారని చెప్పారు. అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానమే శరణ్యమన్నా రు. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబును చూసే పెట్టుబడులు వస్తాయని చెప్పారు.
వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం, కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, చెన్నై-విశాఖపట్నం, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు ఉండటం వల్ల పెట్టుబ డులు పెట్టడానికి, పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రాంతమని వివరించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పన్ను రాయితీలు కల్పించడంపై పార్లమెంటులో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు మాట్లాడుతూ చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ఆసియా అభివృద్ధి బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు నౌకాశ్రయాలను అనుసంధానం చేస్తూ నాలుగు వరుసల రహదారి నిర్మిస్తామని చెప్పారు.